Monday, June 24, 2024
Homeఓపన్ పేజ్ED Vs SC: ఈడి వేగానికి సుప్రీంకోర్టు కళ్లెం

ED Vs SC: ఈడి వేగానికి సుప్రీంకోర్టు కళ్లెం

ప్రాథమిక హక్కులకు భంగం కలగకపోవచ్చు

ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈ.డి) వేగానికి గత వారం సుప్రీం కోర్టు కళ్లెం వేసింది. మనీ లాండరింగ్‌ కేసుల్లో ఆరోపణలకు గురైన వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో ఇ.డికి ఉన్న అధికారాలను అది చాలావరకు కత్తిరించింది. జీవిత హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన తీర్పులను అది ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంది. అక్రమ నిధుల మళ్లింపు నిరోధక చట్టం (పి.ఎం.ఎల్‌.ఏ) కింత ఏదైనా కేసు ప్రత్యేక న్యాయస్థానం పరిశీలనలో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన వ్యక్తిని తమకు తాముగా అరెస్టు చేయడానికి వీల్లేదని, ఆ వ్యక్తిని అరెస్టు చేయదలచుకున్న పక్షంలో ఈడి ప్రత్యేక కోర్టు అను మతి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమన్లు జారీ చేసినప్పుడు ఆ వ్యక్తి ఈ.డి ముందు హాజరైన పక్షంలో దాన్ని కస్టడీగా పరిగణించకూడదని, అతను బెయిలుకు మం జూరు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
కొన్ని నిర్దిష్ట కారణాలపై ఆ వ్యక్తిని అరెస్టు చేయాలా, వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఈడీ యేనని, ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరైన వ్యక్తి ఆ తర్వాత ఇ.డి విచారణకు వెళ్లనవసరం లేదని కూడా అది స్పష్టం చేసింది. ఈ మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో మనీ లాండరింగ్‌ కేసులు బయటపడుతుండడం, ఇ.డి ఎక్కువ సంఖ్యలో అరెస్టు చేస్తుండడం, విచారణ కోసం ఇ.డి వారిని ఎక్కువ కాలం కస్టడీలో ఉంచాల్సి రావడం వగైరా పరిణా మాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండు కారణాల వల్ల మనీ లాండరింగ్‌ కేసుల్లో బెయిల్‌ రావడమన్నది కఠినమైన వ్యవహారంగా మారింది. తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడి మీదే ఉంటుంది. బెయిలులో బయట ఉండగా తాను ఎటువంటి నేరానికీ పాల్పడనని నిందితుడు న్యాయ మూర్తికి నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్ల నిందితులకు బెయిలు లభిం చడానికి చాలా కాలం పడుతోంది. ఇటువంటి కేసుల్లో నిందితుల జీవిత కాలం చాలావరకు వృథా అయిపోతూ ఉంటుంది.
మనీ లాండరింగ్‌ కేసుల్లో గత కొద్ది సంవత్సరాల్లో ఇ.డి చాలామందిని అరెస్టు చేయవలసి వచ్చింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఇ.డి అరెస్టు చేసిన ప్రముఖుల్లో ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఉన్నారు. కేజ్రీవాల్‌ ఏదో విధంగా బెయిల్‌ సంపాదించుకుని బయటపడినప్పటికీ, పలువురు నిందితులు ఇంకా కస్టడీలోనే కాలం గడపాల్సి వస్తోంది. వారికి బెయిల్‌ రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇటు వంటి నేపథ్యంలో ఇ.డికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతించ వలసిందే. ఒక వ్యక్తిని అరెస్టు చేయడమంటే, రాజ్యాంగపరంగా అతనికి సంక్రమించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. అందువల్ల అరెస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిని అనవసరంగా ఒక రోజు అరెస్టు చేయడం కూడా తప్పేనని సుప్రీం కోర్టు ఇతర కేసుల్లో కూడా అనేక పర్యాయాలు స్పష్టం చేసింది.
ప్రత్యేక న్యాయస్థానం మనీ లాండరింగ్‌ కేసును విచారిస్తున్న సమయంలో కూడా నిందితులు బెయిల్‌ కోసం ఈ రెండు షరతులను నెరవేర్చవలసి ఉంటుందా అనే అంశానికి సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌ పై సుప్రీం కోర్టు ఈ విధంగా స్పందించింది. మనీ లాండరింగ్‌ కేసు ఒకసారి ప్రత్యేక న్యాయస్థాన విచారణలోకి వెళ్లిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన వ్యక్తిని ఇ.డి అరెస్టు చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఇక ఎక్కువగా అరెస్టులు జరిగే అవకాశం లేదు. దీనివల్ల వ్యక్తుల జీవిత హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు సుప్రీంకోర్టు మరింత భద్రత, రక్షణ కల్పించినట్టయింది. ఏ కేసూ ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించడం జరగకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News