Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Election season starts: ఎన్నికల ప్రచారానికి నాందీ ప్రస్తావన

Election season starts: ఎన్నికల ప్రచారానికి నాందీ ప్రస్తావన

ముక్కు సూటిగా మాట్లాడి, తమ విధానాలను వెల్లడించిన మోడీ

దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఒక విధంగా తమ ప్రభుత్వ విజయాలను వరుస క్రమంలోవెల్లడించడంతో పాటు 2024 నాటి ఎన్నికలకు నాందీ ప్రస్తావనగా కూడా భావించడం జరుగుతోంది. ఆయన చేసిన ప్రసంగంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ ఎర్రకోటపై మొత్తం పది ప్రసంగాలు చేసిన మోదీ ఇక్కడ తమ ప్రభుత్వ సాఫల్యాలను, విజయాలను వివరించడంలో తప్పేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఏప్రభుత్వమైనా ఇదే పనిచేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, నిజానికి ఆయన మూడవసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఈ ప్రసంగం చేసినట్టు కనిపించింది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, దాదాపు 2014 వరకూ అస్థిరంగా, గమ్యం లేకుండా ఉన్న దేశానికి ఆ తర్వాత ఒక దిక్సూచి లభించినట్టయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏ దేశానికైనా జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం అనే మూడు అంశాలు కొండంత బలమిస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే విధంగా మూడు సవాళ్లు దేశాన్ని పురోగతి చెందకుండా గట్టిగా పట్టి ఉంచుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, వంశపార్యంపర్య పాలన, బుజ్జగింపు రాజకీయాలతో దేశం ముందుకు వెళ్లలేకపోతోందని ఆయన అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మూడు సవాళ్లను ముఖాముఖీ ఎదుర్కుంటున్నామని, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని అవరోధాలు కలగజేసినా తాము పట్టించుకోవడం లేదని కూడా ఆయన వివరించారు. ఈ విషయంలో తాము కొందరిని శత్రువులను చేసుకోవాల్సి వస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడిప్పుడే వెయ్యేళ్ల బానిసత్వం నుంచి బయటపడుతోందని, వెయ్యేళ్ల స్వర్ణయుగానికి పునాదులు పడుతున్నాయని ఆయన అభివర్ణించారు. మారుతున్న ప్రపంచ వ్యవస్థలో భారత్‌ ఒక ముఖ్య భూమికను నిర్వర్తిస్తోందని కూడా ప్రధాని తెలిపారు.
భారతీయులంతా తమ కుటుంబ సభ్యులేనంటూ మోదీ చేసిన సుదీర్ఘ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ఆశావహంగా ఉన్న మాట నిజం. అయితే, ఈప్రసంగం స్వోత్కర్షకు ఎక్కువగా అవకాశమిచ్చిందని, ఇందులో అందరినీ కలుపుకునిపోయే తత్వం ఎక్కడా కనిపించలేదని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. తాను వివిధ ప్రాంతాల మధ్య, వివిధ వర్గాల మధ్య, జెండర్ల మధ్య ఐక్యతను సాధించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు కూడా మోదీ చెప్పడం జరిగింది. ఆయన ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడడం, తమ విధానాలను లోతుగా విశ్లేషించి వివరించడం జరిగింది. దేశానికి తమ వల్ల జరిగిన మేలును ఆయన వివరించారు. తాము దేశాన్ని ఏ స్థాయికి తీసుకు వెళ్లదలచిందీ వివరించారు. కొత్తగా వాగ్దానాలు చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను తాము ఏ విధంగా అధిగమిస్తున్నదీ ఆయన స్పష్టంచేశారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇటువంటి సవాళ్లు సహజమేనని, అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించాయి. అంతేకాక, వీటి వల్ల దేశ పురోగతి దెబ్బతింటున్నదనడంలో అర్థం లేదని కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు విమర్శలు సాగించాయి.
మోదీ మణిపూర్‌ పరిస్థితి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మణిపూర్‌లో క్రమంగా ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. అయితే, ఈసంక్షోభానికి, అల్లర్లకు ఎవరిని బాధ్యులను చేస్తున్నదీ ఆయన వెల్లడించలేదు. అవినీతిని అంతమొందిస్తామని చెబుతున్న మోదీ పూర్తిగా ప్రతిపక్ష నాయకుల మీదే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని బట్టి ఆయన ఉద్దేశం ఎంత దురుద్దేశంతో కూడుకుని ఉన్నదో అర్థంచేసుకోవచ్చని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో దేశ ప్రజలకు అర్థమవుతూనే ఉందని పాలక పక్ష నాయకులు ప్రతి విమర్శలు సాగిస్తున్నారు. మొత్తం మీద మోదీ ఇక్కడ తమ ప్రభుత్వ పురోగతి నివేదికను ప్రజల ముందుంచారు. ఎన్నికల సమయంలో దీని మీద తీర్పు చెప్పాల్సింది ప్రజలే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News