Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్Ex MLA BC Janardhan Reddy: రాయలసీమ ద్రోహి జగన్

Ex MLA BC Janardhan Reddy: రాయలసీమ ద్రోహి జగన్

కమీషన్లు దండుకుంటున్నారు

గడిచిన 58 నెలలో రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ లేదు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో 52 సీట్లకు గాను వైసీపీకి 49 సీట్లు గెలిపించి గంతగుత్తగా జగన్ చేతికి అప్పగించారు. అందుకు అనేక కారణాలున్నాయి. జగన్ రాయలసీమ బిడ్డ, మాట తప్పడు, మడమ తిప్పడు, మాటిచ్చాడంటే చేస్తాడంతే అంటూ రాయలసీమ ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకొని మరీ సీఎం సీటులో కూర్చోబెట్టారు. ఇక అప్పటి నుంచి మొదలు… సీమ ప్రజలంతా మన బిడ్డ అనుకున్నారు ఇప్పుడు అది క్యాన్సర్ గడ్డలా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సరిగ్గా 5 ఏళ్లు తిరిగే సరికి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. పరిశ్రమలు లేవు, నాణ్యమైన విద్య లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. సంక్షేమం మాటన సంక్షోభం, అభివృద్ధి నిల్ కాని జగన్ కు మాత్రం కమీషన్లు ఫుల్. న్యాయ రాజధాని అంటూ చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టారు.
నాడు కృష్ణాలోని మిగులు జలాలపై హక్కు కోరబోమని జగన్ రెడ్డి తండ్రి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి ఇచ్చి బచావత్ కమిషన్ మన రాష్ట్రానికి కల్పించిన హక్కుల్ని తాకట్టు పెట్టారు. నేడు జగన్ రెడ్డి చేతగానతనంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటిని కేంద్రం చేతుల్లో పెట్టారు. టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులపై రూ.12,411 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లల్లో ఖర్చు చేసింది కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే. అదే విధంగా గాలేరు-నగరికి గత ప్రభుత్వం రూ 2,323 కోట్లు ఖర్చు చేయగా.. జగన్ రెడ్డి ఖర్చు చేసింది రూ.795 కోట్లు మాత్రమే. హంద్రీ-నీవాకు చంద్రన్న రూ.4,182 కోట్లు ఖర్చు చేయగా… జగన్ రెడ్డి ఖర్చు చేసింది రూ.515 కోట్లు మాత్రమే. ఇతర ప్రాజెక్టులది ఇదే తీరు. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ (ఆర్‌డీఎంపీ) కింద 23 ప్రాజెక్టుల కోసం రూ.33,862 కోట్లతో టెండర్లు పిలిచి ఉత్తుత్తి హడావుడి చేశారు.
కర్ణాటకలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయిస్తే రాయలసీమ నీటి వనరులకు తీవ్ర ప్రమాదంగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాయలసీమ ఎడారిగా మారతుందని తెలిసినా జగన్ మౌనంగా ఉండి రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు ముందుకు కదిలించారు. కానీ… జగన్‌ మాత్రం వాటిని పట్టించుకోలేదు, అటకెక్కించారు. కొన్ని ప్రాజెక్టుల పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2019 జనవరిలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,942.38 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. పనులు కూడా మొదలయ్యాయి. అయితే జగన్‌ సర్కారు రావడంతో పరిస్థితి మారిపోయింది. కాంట్రాక్టు సంస్థ రూ. 90 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం పైసా కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
అనంతపురం జిల్లా మనవడిగా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తా అని జగన్ హామీనిచ్చారు. సత్యసాయి జిల్లాలో జగన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకూ అతీగతీ లేదు. కొత్తగా ఒక్క ఎకరా కూడా సాగులోకి రాలేదు. టీడీపీ ప్రభుత్వంలో కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులు రూ.475 కోట్లతో 80 శాతం పూర్తయ్యాయి. జగన్‌ వచ్చాక పైసా కూడా ఇవ్వ లేదు. దాంతో పనులు ఆగిపోయాయి. పుంగనూరు బ్రాంచి కెనాల్‌ విస్తరణను రూ.1,219.93 కోట్లతో చేపట్టనున్నట్టు ఆర్భాటం చేశారు. గతేడాది టెండర్లు ఖరారు చేసినా నిధులు ఇవ్వకపోవడంతో పనులు మొదలు కాలేదు. గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన ఆర్టీఎస్‌ కుడి కాలువ, వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులు.. జగన్‌ రాగానే ఆగిపోయాయి.
హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద మిగిలిన పనులను రెండేళ్లలో పూర్తి చేస్తానన్న హామీని జగన్‌ విస్మరించారు. నంద్యాల జిల్లాలో బిల్లులు రాక పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అనంతపురం జిల్లా రైతాంగానికి జీవనాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టు చేపట్టాలని మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్‌ హయాంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఫేజ్‌-1, ఫేజ్‌-2కు కలిపి రూ.13,635 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. నాలుగేళ్ల క్రితం వరకూ రూ.11,535 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో దాదాపు రరూ.4,182 కోట్లు ఖర్చు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో కేవలం ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకే నిధులు విదిల్చారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి చేతులు రావడం లేదు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జలవనరుల ప్రాజెక్టుల నిర్వీర్యం చేయడాన్ని చూసి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తట్టుకోలేపోయారు. అందుకే గత ఏడాది ఆగస్టు నెలలో పెన్నా టు వంశధార వరకు తెలుగు తల్లి జలహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల్లో పని తీరును ప్రజలకు తెలియజేశారు. కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర సాగించారు. కీలక ప్రాజెక్టుల్లో నత్తనడకన సాగిన పనిని, జరిగిన అవినీతిని భయటపెట్టారు. రాష్ట్ర రూపాన్ని మార్చే నదుల అనుసంధానం ప్రక్రియకు జగన్ ప్రభుత్వం చేసిన నష్టాన్ని ప్రజలు తెలియజేశారు. అంతేకాకుండా మేథావులు, జలవనరుల నిపుణులు సైతం చెప్పలేని విధంగా జలవనరుల ప్రాజెక్టుల విధ్వంసం పేరుతో ప్రజంటేషన్ ఇచ్చి మరీ వివరించారు.
చంద్రబాబుకు జలవనరుల మీద ఉన్న పట్టు, మక్కువ ఈ సంఘటనతో చెప్పవచ్చు. బహుశా అందుకేనేమో గత 5 ఏళ్లల్లో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రూ.68వేల కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టులను చేపట్టి 23 ప్రాజెక్టులను పూర్తి చేసి, 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందించారు. కాని జగన్ రూ. 22,165.46 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు. ఆఖరికి కమీషన్ల కోసం బహుళార్ధక సాధక ప్రాజెక్టును సైతం ప్రశ్నార్ధకం చేశారు. 15 నెలల పాటు పనులు చేయకపోవడంతో డయఫ్రంవాల్ దెబ్బతిందని సాక్షాత్తు నీతి ఆయోగ్ నియమించిన ఐఐటీ హైదరాబాద్ స్పష్టం చేసింది. అదే 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి పోలవరంతో పాటు మిగిలిన 40 ప్రాజెక్టులు పూర్తి చేయడంతో రాష్ట్రం సశ్యశ్యామలం అయ్యి ఉండేది. రాయలసీమ రత్నాల సీమగా మారి సిరులు పండేవి. కాని నేడు రాయలసీమ మళ్లీ రాళ్ల సీమగా మారడంతో మునుపెన్నడూ లేని వలసలు పెరిగాయి. నిరుద్యోగులు సైతం ఉద్యోగాలు లేకపోవడంతో రైతు కూలీలతో పాటు వలసలకు వెళుతున్నారు. రాయలసీమను ఏటికేడు అభివృద్ధి పథంలో నడిపించాల్సిన జగన్ అథోగతి పాలు చేశారు. అందుకే జగన్ ఓడిపోయే మొట్ట మొదటి సీటు రాయలసీమ నుంచే ప్రారంభం అవ్వక తప్పదు. ఆయనకు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలందరూ సిద్ధం.
బిసి జనార్ధన్ రెడ్డి
బనగానపల్లె మాజీ శాసనసభ్యులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News