Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Food politics: అధికార భద్రత కోసం ఆహార భద్రతా

Food politics: అధికార భద్రత కోసం ఆహార భద్రతా

అసలు దేశం పేదలు ఎంతమంది ఉన్నారు. దీనికి ఇదమిత్థంగా సమాధానం మాత్రం పార్లమెంటు సాక్షిగా సమాధానం ఇవ్వదు కేంద్రం. పైగా ప్రతిపార్టీ తాము అధికారంలోకి వచ్చాక దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని, ఆర్థిక అసమానతలు సమిసిపోయాయని చెప్పుకుంటాయి . కానీ దేశంలో 81.35 కోట్ల మంది అర్హులైన వారికి ఉచిత ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందంటే అర్థం ఏమిటి? సింపుల్ దేశంలో 81.35 కోట్ల మంది పేదలు ఉన్నట్టేకదా. మరి రెండు దఫాలుగా అధికారంలో ఉన్నకమలనాథులు సాధించిన ఆర్థిక అభివృద్ధి లెక్కలు ఏమైనట్టు? 2020 నుంచి 2022 వరకు కరోనా సాయం కింద ఉచితంగా ధాన్యాలు పంపిణీ చేసే బృహత్తర పథకానికి మోడీ సర్కారు శ్రీకారం చుట్టింది.

- Advertisement -

కానీ ఇదంతా సర్కారు ఖజానాకు మోయలేనంత భారమైనప్పటికీ ఎప్పటికప్పుడు దీన్ని కొనసాగించటంపైనే మోడీ సర్కారు ఇంతకాలం కసరత్తు చేస్తూ వచ్చింది. చివరికి దీన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించటం ఎవరికీ ఆశ్చర్యమైతే కలిగించలేదు. ఎందుకంటే ఎన్నికల ఏడాది కాబట్టి ఇప్పుడు ఇలాంటీ ఉచిత పథకాలను ఎత్తేస్తే ఓటర్ల ఆగ్రహానికి బలి కాక తప్పదని పాలకులకు బాగా తెలుసు. కర్రు కాల్చి సామాన్యులు వాత పెట్టకుండా వారిని దువ్వుతూ ఉండటానికే ఈ పథకం అంటూ విపక్షాలు గట్టి విమర్శలకే దిగుతున్నాయి. కానీ ఈ విమర్శలపై కేంద్రం ఎందుకో తనదైన శైలిలో ధీటుగా సమాధానం మాత్రం ఇవ్వలేకపోతోంది. ఇటు కమలం పార్టీ నేతలు కూడా ఎవరూ దీనిపై సరైన సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయటం లేదు. తమ చర్యలను కేంద్రం సమర్థించుకునేందుకైనా దేశంలో ఎందరు పేదలున్నారు, గతంతో పోల్చితే వారి జనాభా పెరిగిందా, తగ్గిందా, ఎందుకు ఈ సంఖ్యలో తేడా వచ్చిందో సవివరంగా సభా ముఖంగా పార్లమెంట్ లో చెబితే చాలా బాగుండేది.

2013లో మన్మోహన్ సర్కారు ఆహార భద్రతా చట్టాన్ని ఓ ఆర్డినెన్స్ రూపంలో తెచ్చింది. అంటే ఆహార భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమే అయినా ఇదంతా ఎలక్షన్ ఫీట్లు చేసేందుకు మంచి మైలేజ్ తెచ్చిపెడుతుందని కేంద్ర పాలకులకు బాగా ఎరుక. అయితే ఫ్రీబీస్ ను అధికారికంగా ఇచ్చేందుకు ఇలాంటి చట్టాలు అధికారికంగా రాచమార్గంగా పనికివస్తాయి.

అయినా దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే ఉన్నాయి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్ల సంఖ్యే అత్యధికం. అయినా పేదరికం ఈ స్థాయిలో ఉందా ఇంత ఆహార ధాన్యం ఉచితంగా పంపిణీ చేయక తప్పదా అనేవి అసలు ప్రశ్నలు. అందుకే మోడీ సర్కారుపై అన్నివైపుల నుంచి విమర్శల తాకిడి ఎక్కువైంది. ఆహార భద్రత కాదిది అధికార భద్రత, ఓట్ల భద్రత కోసం అనే విమర్శల్లోనూ చాలా నిజాలే ఉన్నాయి.

ప్రపంచానికి ఆహారాన్ని ఎగుమతి చేస్తూ, పలు పేద దేశాలకు భారీ ఎత్తున వితరణ చేస్తున్న భారతదేశంలో ఇంతమంది పేదలు ఆహారం కోసం అలమటిస్తున్నారా అన్నది సమాధానం దొరకాల్సిన ప్రశ్న. దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి అందాల్సిన ఆహార ధాన్యం ఇంత భారీ ఎత్తున కోట్ల మంది అర్హులకు దక్కుతోందంటే ఇన్ని పదుల కోట్ల మంది దారిద్రంలో మగ్గుతున్నారనే అర్థం అని ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. వీరందరినీ అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తాయి. వీరిని ఉచితాలతో ఆకట్టుకుంటే తమ అధికారానికి వచ్చే ఢోకా ఏమీ ఉండదని ఇదో సక్సెస్ ఫార్ములాగా వీరిని ప్రసన్నంచేసుకోవటం కోసం ఇలాంటి ప్రత్యేక చట్టాలు రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయన్నది ఆర్థిక శాస్త్రవేత్తల భాష్యం.

మోడీ సర్కారు దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టి, చరిత్ర తిరగరాసి, మళ్లీ అధికారం చేపట్టాలనే కసితో ఉన్న మోడీ, షా ద్వయం రచిస్తున్న రాజకీయ వ్యూహాలు అంత సులువుగా అర్థమయ్యేవి ఏమీ కావని సామాన్యుడు కూడా గ్రహిస్తున్నాడు.

800 మిలియన్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యం ఇచ్చేందుకు 47 బిలియన్ డాలర్ల ఖర్చు భారం దేశ ఖజానాపై పడుతోంది. అంతేకాదు దేశంలో ఘనంగా ఉన్న గోధుమ నిల్వలు కూడా ఖాళీ అయ్యే స్థితికి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి గోధుమ నిల్వలు పతనం అయ్యాయి కూడా. కోవిడ్ ఫ్రీ ఫుడ్ పథకం కొత్త సంవత్సరం నుంచి ఆపితే ప్రభుత్వంపై 20 బిలియన్ డాలర్ల బరువు తగ్గుతుంది. సబ్సిడీల భారం కేంద్రంపై కనీసం 30 శాతం తగ్గటం ఖాయం. కానీ తీరా ఎన్నికల ఏడాది ఇలా ఉచితాలు కట్ చేస్తే తాము ఓటమిపాలవ్వటం ఖాయమని ముందే అంచనా వేసింది మోడీ టీం. ప్రజాదరణ పొందాలంటే ఇలాంటి భారాన్ని మోయాల్సిందే, ప్రజాకర్షక పథకాలైన ఉచితాలను తీసేసే సాహసం ఏ పార్టీ చేయదుగాక చేయదనేది చరిత్ర చెబుతున్న సత్యం. మరి ప్రజాధనాన్ని ఇలా వృథా చేయచ్చా. పలు రూపాల్లో సరికొత్త పన్నులు వసూలు చేసేస్తూ ప్రజలపై పరోక్షంగా భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉచితాలను మాత్రం అలాగే కొనసాగిస్తుండటం రాజకీయ వ్యూహం మాత్రమేనని రాజకీయ పండితులు సైతం చెబుతున్నారు.

అత్యంత ప్రజాకర్షక నేతగా, అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానిగా 60శాతం ప్రజలు మోడీకి పట్టంకడుతున్నారని సీ ఓటర్ వంటి సంస్థలు తేల్చాయి. ఇంత భారీ ఇమేజ్ ఉన్న మోడీకి ఉచితాలు కలిసి వస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది.

2023లో దేశంలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇంత కీలకమైన సమయంలో మళ్లీ అధికార అందలం ఎక్కించే ఇలాంటి పథకాలను మోడీ సర్కారు ఎలా నిలుపుదల చేస్తుంది. ఓవైపు విమర్శలు చేసే జనాలే తమకు అన్నీ ఉచితంగా కావాలని, ఉచితంగా ఎవరు ఎక్కువ ఏది ఇస్తే ఆ పార్టీకే పట్టం కట్టడం ప్రజలకు అలవాటైన తీరుగా మారింది. తమిళనాడులో అందుకే సెల్ ఫోన్ మొదలు అన్నీ ఉచితంగా ఎన్నికల హామీలుగా ప్రకటించి, అధికారంలోకి వస్తాయి పార్టీలు. మరి అందరి ఎన్నికల మంత్రదండం ఇదే అయినప్పుడు కేవలం బీజేపీని ఈ విషయంలో ప్రశ్నించి, దూషించి, నిందించి సాధించేదేమిటని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News