Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Food safety and challenges: ఆహార భద్రతకు సరికొత్త ప్రమాదం

Food safety and challenges: ఆహార భద్రతకు సరికొత్త ప్రమాదం

ఇదొక పెద్ద సవాలుగానూ, సంక్షోభంగా మారనుంది

దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. గత పదిహేను నెలల కాలంలో ఏనాడూ కనీవినీ ఎరుగని విధంగా ద్రవ్యోల్బణం 7.44 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా రిటైల్‌ ధరలకు రెక్కలొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ఉల్లిపాయల ఎగుమతిని తగ్గించడానికి ప్రోత్సాహకాలను నిలిపివేసింది. అంతేకాక, వీటి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. గత జూలైలో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఏడాది క్రితం గోదుమపై విధించిన నిషేధాన్ని కొనసాగిస్తోంది.
గత జూలైలో వినియోగదారుల ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతం పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాల ధరలు బాగా పెరగడమే. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఎండా కాలాలు, వర్షాకాలాలేనని, రెండు మూడు నెలల్లో పరిస్థితి చక్కబడుతుందని ప్రభుత్వం మేకపోతు గాంభీర్యంతో చెబుతున్నప్పటికీ, అసలు కారణం మాత్రం, వాతావరణ మార్పుల వల్ల కాలక్రమంలో అనుభవానికి వస్తున్న దుష్ఫలితాలేనని అర్థం అవుతూనే ఉంది.
నిజానికి, ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఇందుకు కారణం వాతావరణంలో వస్తున్నమార్పులేనని ప్రపంచ దేశాలు క్రమంగా గ్రహిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, కరువు కాటకాలు, వరదలు, తుపానులు విజృంభించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని అతలాకుతలం చేస్తున్నాయి. సహజంగానే దీని ప్రభావం భారత్‌ మీద కూడా పడింది. 1901 నాటి నుంచి నేటి వరకూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఆగస్టులో దేశంలో ద్రవ్యోల్బణం విజృంభించింది. ఇది పూర్తిగా ఎల్‌ నీనో ప్రభావ మేనని వాతావరణ విజ్ఞానవేత్తలు తేల్చి చెబుతున్నారు. పసిఫిక్‌ మహా సముద్రంపై ఏర్పడుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల హిందూ మహా సముద్రంలోకి రుతు పవనాలు ప్రవేశించడం అసాధ్యమవుతోంది. ఫలితంగా భారత్‌ లో రుతుపవనాలు చురుకుగా కదలలేకపోతున్నాయి.
భారతదేశం పూర్తిగా ఎల్‌ నీనో ప్రభావంలో ఉంది. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఖరీఫ్‌ పంటల దిగుబడి సగానికి సగం తగ్గడం జరిగింది. 2022-23లో 150కి పైగా దేశాలకు దాదాపు 1100 కోట్ల డాలర్ల విలువైన బియ్యాన్ని ఎగుమతి చేసిన భారతదేశం ప్రస్తుతం ఈ ఎగుమతుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించు కోవాల్సి వస్తోంది. బాస్మతేతర బియ్యం ఎగుమతిపై విధించిన నిషేధం వల్ల భారత్‌ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రపంచ దేశాలలో ఆహార భద్రత సంక్షోభంలో పడింది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటికే గోదుమ ఎగుమతులు ఆగిపోయిన నేపథ్యంలో బియ్యం ఎగుమతి కూడా నిలిచిపోవడం అనేక దేశాలను తీవ్రస్థాయిలో కలవరపరుస్తోంది.
మొత్తానికి వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే తీవ్ర ఆహార సంక్షోభంలో పడిన ప్రపంచ దేశాలకు మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో ఏమాత్రం అంతుబట్టడం లేదు. అతి కొద్ది కాలంలో ఇదొక పెద్ద సవాలుగానూ, సంక్షోభంగానూ పరిణమించబోతోంది. ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం, 2022 జూన్‌ నుంచే 82 దేశాలలో 34.50 కోట్ల మంది ప్రజలు ఆహార పదార్థాల కోసం నానా అవస్థలూ పడడం ప్రారంభమైంది. 2019 తర్వాత ఇది 155 శాతం పెరిగింది. వ్యవసాయోత్పత్తులకు సంబంధించినంత వరకూ భారతదేశం పాత్ర చాలా కీలకమైంది. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ కు ప్రాధాన్యం పెరిగింది. భారత్‌ ఇటువంటి సమయంలో స్వదేశీ, విదేశీ అవసరాల మధ్య సమతూకం పాటించాల్సి ఉంటుంది. స్వదేశంలో ధరలను అదుపు చేయడానికి భారత్‌ ఇదివరకు కూడా బియ్యం, గోధుమ, చక్కెర, కూరగాయల ఎగుమతుల మీద నిషేధం విధించింది. అయితే, వాతావరణ మార్పుల కారణంగా ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతున్న స్థితిలో భారత్‌ ఎగుమతులపై నిషేధం విధించడం, దేశ అవసరాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం కొన్ని విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News