Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Freebies: కొంప ముంచుతున్న ఉ "ఛీ"తాలు

Freebies: కొంప ముంచుతున్న ఉ “ఛీ”తాలు

ఎన్నికల్లో గెలవాలంటే బ్రహ్మాస్త్రం ఒకటే. అదే ఫ్రీబీస్ అనే ఉచితాలు. అవును ఎంతటి గొప్ప పార్టీ అయినా..ఎంత గొప్ప నేత అయినా ఉచితాలే దిక్కు. ఎన్నికలనే నావకు చుక్కాణి వంటివి ఉచితాలు అని కొత్త సామెత చెప్పక తప్పదు. అందుకే ఎలక్షన్ ఇయర్ అనగానే ఇవిస్తాం..అవిస్తాం అని ఊదరగొట్టడమే పార్టీలకు, నేతలకు పని. రేయింబవళ్లు ఇలా ఊదరగొట్టే రేస్ లో ఎవరైతే ముందుంటారో, ఎవరు అత్యధికంగా ఓటర్లను ఆకట్టుకుంటే వారిదే గెలుపన్నమాట. అందుకే సరికొత్త ఫ్రీబీస్ మనదేశంలోకి ఏ ఏడాదికి ఆ ఏడాది వచ్చేస్తున్నాయి.

- Advertisement -

ఒకప్పుడు బొట్టు బిళ్లలతో మొదలైన ఈ ఉచితాల రాజకీయ సంప్రదాయం కాలానుగుణంగా మారి, ఇప్పుడు ఫ్రీ కంప్యూటర్లు, ఫ్రీ టూర్ల వరకు వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ.. వంటి సంప్రదాయ పార్టీలే కాదు ఆఖరుకి నిన్న మొన్న పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ వరకూ ఇదే ఎన్నికల మంత్రంగా మారిపోయింది.

మమ్మల్ని గెలిపిస్తే మేం ఉచితంగా సీనియర్ సిటిజెన్స్ ను కాశీ, మధుర, అయోధ్య పంపుతామని ఆప్ ఎన్నికల వాగ్ధానం గట్టిగానే చేసింది. నిజానికి ఓటర్లను ఇది బాగా ఆకట్టుకుంది కూడా. అందుకే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు సై అంటున్న కేజ్రీవాల్ పార్టీ..ఈ ఉచిత తీర్థయాత్ర, సబ్సిడీ తీర్థ యాత్రకు మాత్రం అలాగే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకాన్ని మొట్టమొదట ప్రారంభించింది బీజేపీ అయితే..ఆ తరువాత బీజేపీ బాట పట్టిన వారిలో డీఎంకే, ఏఏపీ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఈ సబ్సిడీ తీర్థ యాత్రకు అటు ఇటుగా ఓ ప్యాకేజ్ తెచ్చే పనిలో పడింది.

తాజాగా గృహిణులుక సైతం నెలకు 2,000 రూపాయలు ఇచ్చేస్తాం అంటూ కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే తాము అధికారంలోకి రాగానే తక్షణం గృహిణులకు నెలకు 2000 రూపాయలు అకౌంట్లో వేసేస్తాం అంటున్నారు ప్రియాంకా గాంధీ వాద్రా. అదేమంటే ఇది మహిళా సాధికారత కిందకు వస్తుంది, మహిళకు ఆర్థిక స్వావలంభన అందిస్తే కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుందని ఆమె కొత్త విషయాలను ఓటర్లకు చెప్పేస్తున్నారు. అంతేకాదు..”మహిళలూ..రండి రాజకీయాలు మార్చేద్దాం”.. అంటూ ఆమె సరికొత్త ప్రవచనాలు వల్లె వేసేస్తుండటం పెద్ద ట్విస్టే. అంతటితో ఆగకుండా ‘వుమెన్ మ్యానిఫెస్టో’ తేవాలంటూ.. ఇందుకు తాను రెడీగా ఉన్నట్టు ప్రియాంక చెప్పటం చూస్తుంటే రాజకీయాలు ఇక వుమెన్ సెంట్రిక్ గా సాగటం ఖాయమనే విషయం స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటి వరకు ఒంటరి మహిళకు పెన్షన్లు అంటూ వచ్చిన ప్రభుత్వాలు ఇక మహిళలకు షాపింగ్ కు పైసలు, ఫెస్టివల్ అడ్వాన్సులు, పెళ్లిళ్లు, శ్రీమంతాలు, కాన్పులు, పండగలు ..ఇలా ప్రతి అకేషన్ కు ఏదో ఒక సరికొత్త పథకాన్ని పార్టీలన్నీ డిజైన్ చేసి ఢంకా బజాయించే పనిలో పడేలా ఉన్నాయి. ఇప్పటికే పార్టీల ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీమంతాలు వంటివి చేస్తుండగా, కేసీఆర్ కిట్ వంటి డెలివరీ కిట్ ఇస్తుండగా ప్రతి మహిళలకు ఏదో ఒక ఆకర్షణీయ పథకం అనే గాలం వేసేలా దేశ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి.

ఉదాహరణకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తీసుకోండి. ఇక్కడంతా వుమెన్ సెంట్రిక్ పాలిటిక్సే. మహిళా ఓటర్లను ఆకట్టుకుంటే తమిళనాడు ఎన్నికలు గట్టెక్కటం తేలికనే విషయాన్ని డీఎంకే, అన్నాడీఎంకే ఎప్పుడో కనిపెట్టేసాయి. అందుకే ఇక్కడ ముక్కుపుడకలు, కమ్మలే కాదు.. మిక్సీ, గ్రైండర్, టీవీ, కేబుల్ కనెక్షన్, సెల్ ఫోన్, కంప్యూటర్, సెల్ఫోన్ రీఛార్జ్, కేబుల్ కనెక్షన్ రీఛార్జ్, సైకిల్ ..ఇలా అన్నీ మహిళలకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ పార్టీలన్నీ పోటీ పడుతూనే ఉంటాయి. అందుకే ఫ్రీబీస్ కు తమిళనాడు పాలిటిక్స్ కేరాఫ్ గా ఎప్పుడో మారాయి. తమిళనాట ఎన్నికలంటేనే ఉచితాలు ఏమిటో అని అందరూ అడిగేస్తారు.

ఒకప్పుడు రైతు ఆకర్షక పథకాలు, మ్యానిఫెస్టో ఉండేది. వాటి స్థానంలో క్రమంగా మహిళా ఆకర్షక పథకాలు వచ్చి చేరుతున్నాయి. ఉచిత కరెంట్, ఇన్ పుట్ సబ్సిడీ, రైతులకు ఉచిత బీమా, పంట బీమా వంటివాటి స్థానంలో స్వయం సహాయక బృందాలు, నిరుద్యోగ మహిళలు, మహిళా విద్య, మహిళా వివాహం (షాదీ ముబారక్, సుకన్య సమృద్ధి యోజన) వంటి పథకాలు విస్తృతంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక పేరుతో అమలులోకి వచ్చేసాయి.

ఇలాంటి పథకాలకు సరికొత్తగా శ్రీకారం చుట్టే విషయంలో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా మరో 18 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో పోటాపోటీగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీ ఉచితాల పోరాటం సాగుతోంది. మరి ఇలాంటివి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయవా అంటే ఎందుకు చేయవు. బ్రహ్మాండంగా ఖాళీ చేస్తాయి. ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయి ప్రజల నుంచి ఏదో ఒక రూపంలో వసూలు చేసే పన్నులు, ఛార్జీలే. కాబట్టి మన డబ్బు తిరిగి మన జోబులోకి ఇచ్చి..మన ఓట్లు కాజేసే పాలకులకు జై కొట్టడంలో మనకు ఎంతమాత్రం తెలివి తేలటున్నాయనే విషయాన్ని సామాన్యుడు గుర్తెరగాలి. అదేదో తన సొంత అకౌంట్లో నుంచి పార్టీలు, నేతలు నిధులు వెచ్చిస్తామన్నట్టు వీరావేశంగా ఎన్నికల ప్రసంగాలు చేసేస్తున్నారు.

ఏపీలో ఏ ప్రభుత్వ పథకాన్ని తీసుకున్నా రాజేశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేర్లతో అమలవుతుండటాన్ని ఏమనలేక ఇటు ఆర్థికవేత్తలు, అటు సామాన్యులు నలిగిపోతున్నారు. ఏదో తమ సొంత డబ్బు వెచ్చించినట్టు జగనన్న కానుక, జగనన్న గోరుముద్ద ఇలా ప్రజాధనాన్ని ప్రజలకోసం వెచ్చిస్తూ సొంత పేరు ప్రతిష్ఠల కోసం వెంపర్లాడటాన్ని ఏమనాలి. ఇది ప్రజాస్వామ్యమేనా ఇంకా రాచరికంలో కొట్టుకుఛస్తున్నామా అంటూ మేధావులు గట్టిగా ప్రశ్నించలేక నసుగుతున్నారు. ఇటు తెలంగాణ సర్కారు తామేం తక్కువ తినలేదన్నట్టు కేసీఆర్ కిట్టు .. అంటూ ఎన్నో పథకాలను సీఎం పేరుతో అమలు చేసేస్తుండటం చూస్తే ఇదంతా రాజరికాన్ని గుర్తుచేస్తుంది.

ప్రజాధనంతో అమలు చేసే పథకాలకు సంక్షేమ పథకాలనే పేరు పెట్టి..సొంత పేర్లతో అమలయ్యే పథకాలతో జరిగే అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో మనం దశాబ్దాలుగా చూస్తున్నాం. గరీబీ హటావో అంటూ నినాదం ఇచ్చి రెచ్చిపోయిన ఇందిరా గాంధీ శకాన్ని నేటి కాలంతో పోల్చుకోండి. ప్రభుత్వ ఉచిత రేషన్ తీసుకునే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటున్నవారి జనాభా 80 కోట్లకు పైమాటే అంటూ మోడీ సర్కారు చెబుతోందంటే అంత్యోదయ అన్న యోజన..గరీబీ హటావో లాంటి పథకాలతో వచ్చిన అభివృద్ధి ఏంటో అర్థమవుతుంది. ఇన్ని పార్టీలు మారి, ప్రభుత్వాలు మారి, ప్రధానులు మారినా దేశంలో పేదిరికం కనీసం సగం కూడా తగ్గలేదంటే దానికి ఎవరిని బాధ్యులనాలి. మరదే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోని డొల్లతనం అంటే.

ఆర్బీఐ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే కళ్లు తిరగటం ఖాయం. 2022-23 మధ్య కాలంలో పంజాబ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఇలాంటి ఉచితాలకు అయ్యే ఖర్చు జీఎస్డీపీలో 2.7 శాతం దాటుతుందని. దారుణంగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాల్లోనూ ఉచితాలంటే ఇక ఆ రాష్ట్రాన్ని ఏమనాలి. మరోవైపు అన్నీ ఉచితాలు అంటూ ఇచ్చేస్తూ పోతున్న ప్రభుత్వాలు ప్రజలను సోంబేరులు చేసేస్తున్నాయి. ఇప్పటికే మీరు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లండి..మీకు కూలీలు, వ్యవసాయ కూలీలు దొరకటం గగనంగా మారింది. అదేమంటే తిండి, బట్ట, ఇళ్లు, చదువు.. ఇలా అన్నీఉచితంగా ఇచ్చేస్తూపోతే ఇక పని చేయటం ఎందుకు అన్నట్టు మారింది వ్యవహారం.

పంజాబ్ రాష్ట్రాన్ని కేస్ స్టడీస్ గా తీసుకుంటే రాష్ట్రానిక పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో సగానికిపైగా ఈ ఉచితాలకే ఆప్ సర్కారు వెచ్చిస్తోంది. మరి మిగతా అభివృద్ధి పథకాల మాటేంటి. సంక్షేమం అంటే ఉచితాలు ఇచ్చి.. ప్రజలను సోంబేరులను చేసి..ఇంట్లో కూర్చోబెట్టడం కాదుకదా. కేంద్ర ప్రభుత్వం, విదేశీ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకుని, నిధులు సమకూర్చుకుని ఉచితాలు ఇవ్వటంపైనే.. కేరళ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక శాఖలు మునిగి తేలుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాతలు పెట్టింది. అప్పుల భారంతో.. వడ్డీలు కట్టేందుకు ఈ రాష్ట్రాలు సతమతమవుతున్నాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ ఇంట్రెస్ట్ పేమెంట్ టు రెవన్యూ రిసిప్ట్స్ (ఐపీ-ఆర్ఆర్) రేషియా ఎప్పుడో 10 శాతం దాటింది. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం హైలీ స్ట్రెస్డ్ సేట్స్ గా పంజాబ్, కేరళ, రాజస్థాన్, బిహార్, వెస్ట్ బెంగాల్ నిలిచాయి.

రాజకీయ ప్రయోజనాలు తప్పితే అభివృద్ధి, భవిష్యత్తులో పరిస్థితి ఏంటనేదానిపై ఏ పార్టీకి-ప్రభుత్వానికి సోయి లేకుండా పోతోంది. సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలైతే ఇక లెక్కబెట్టలేనన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఉచిత రేషన్ తీసుకుంటే కార్లలో వచ్చి రేషన్ బియ్యం, పప్పు, చింతపండు తీసుకుని పోవటాన్ని మనం రెగ్యులర్ గా మన చుట్టుపక్కలే చూస్తుంటాం. మరి వీరి ఏరకంగా వైట్ రేషన్ కార్డుకు అర్హులు. మరోకోణంలో చూస్తే.. ఈ బియ్యం తినేవారు తక్కువ..వీటిని అమ్ముకునేవారెక్కువ. మరి రేషన్ ధాన్యం ఇలా పక్కదారిపడితే అసలు లక్ష్యం నీరుకారినట్టేగా. అలాగే ఉచిత ఇళ్ల పథకం కూడా అంతే. అనర్హులే ఎక్కువగా లబ్దిదారులుగా మారితే రాష్ట్రం, దేశ ఆర్థికవ్యవస్థ అగమ్యగోచరంగా మారటం ఖాయం. ఇప్పటికే భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ దివాళా తీయగా.. చైనాను వెనక్కి తోసి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశమైన మనదేశం కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఉచిత విద్యుత్ వంటి పథకాలవల్ల దీర్ఘకాలంలో దేశ ప్రజలు నానా అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురిస్తుంది. పార్టీలు, నేతలదేముంది అన్నీ ఉచితాలు అంటారు..ఇస్తారు కూడా.. చివరికి వాటి దుష్పరిణామాలను మనమే అనుభవించాలి. అధికారం కోల్పోయిన తక్షణం..రాజకీయ నేతలు, వారి కుటుంబీకులు విదేశాల్లో ఉంటారు. వారికి ఇక్కడ ఏం జరిగినా ఎటువంటి సంబంధం ఉండదు..మరి వీటి ఆద్యంతాలు మనమే కదా భరించాలి. సామాన్యులు హుషారుగా ఉంటే ప్రభుత్వ ఖజానా, ప్రజాధనానికి శ్రీరామ రక్షలా ఉంటుంది. ప్రజలు రాజకీయ నేతల ఉచ్చులో పడితే అధోగతి తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News