Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Freebies turning burden: భారంగా మారిన ఉచిత పథకాలు

Freebies turning burden: భారంగా మారిన ఉచిత పథకాలు

ఉచితాల బరువు మోయలేక పతనమవుతున్న ప్రభుత్వాలు

ఉచితాలకు కూడా ఒక పరిమితి ఉందన్న విషయాన్ని కర్ణాటక గుర్తు చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఉచిత పథకాలు హద్దులు దాటి ప్రభుత్వానికి పెనుభారంగా మారాయి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రకటించిన ఉచితాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే, అధికారానికి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ ఉచిత పథకాల ఖర్చు తడిసి మోపెడయింది. వీటి కారణంగా ప్రభుత్వంలో ఒక విధమైన గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది. పైగా, ఈ సమస్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ‘అన్నభాగ్య’ పేరుతో ఉచిత అన్న దాన పథకాన్ని ప్రవేశపెట్టారు కానీ, ఈ పథకా నికి ధాన్యం కొరత ఏర్పడింది. అవసరమైన ధాన్యాన్ని సేకరించడం అలివి కాకుండా పోతోంది. ఆయన ప్రవేశపెట్టిన గృహ జ్యోతి (ఉచిత విద్యుత్తు), గృహలక్ష్మి (ఒక్కో మహిళకు రెండు వేల రూపాయల సహాయం) వంటివి కూడా సమస్యల్లో చిక్కుకున్నాయి.
ఈ ఉచిత పథకాలను ప్రారంభించి నెల రోజులైనా గడిచిందో లేదో, ప్రభుత్వం ఒక విధమైన దిక్కు తోచని పరిస్థితికి చేరుకుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం (శక్తి పథకం) కల్పించిన సిద్దరామయ్య ప్రభుత్వం ఈ పథకాన్ని సజావుగా అమలు పరచలేక అవస్థలు పడు తోంది. స్థానిక మహిళలకు ఇంకా ‘స్థానిక’ గుర్తింపు కార్డులు ఇవ్వడం పూర్తి కాలేదు. సుమారు 16 కోట్ల మంది మహిళలు ఇంతవరకూ ఈ ఉచిత రవాణా పథకాన్ని ఉపయోగించుకున్నారు. దీనివల్ల రాష్ట్ర రవాణా శాఖకు ఇంతవరకూ 382 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. మున్ముందు ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉచిత బస్సు సౌకర్యం కారణంగా లక్షలాది మంది మహిళలు భారీగా పర్యాటకాలు, ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
నిజానికి, ఈ శక్తి పథకం కోసం ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో రూ. 2,800 కోట్లు కేటాయించింది. వీరి కోసం అదనపు బస్సులను కూడా రంగంలోకి దించుతోంది. ఇందుకు గాను రూ. 600 కోట్లు కేటాయించింది. అయితే, రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు తమకు ముందుగానే నిధులు మంజూరు చేయాలని, ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో రూ. 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. తమకు ప్రతి నెలా రూ. 250 కోట్లు ఖర్చవుతున్నట్టు ఇవి చెబుతున్నాయి. మరో విషయమేమిటంటే, మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడం అనేది కండక్టర్లకు ఒక పీడకలగా మారిపోయింది. వారి ఆధార్‌ కార్డులను, ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేయడమన్నది కండక్టర్లకు అసాధ్యంగా ఉంటోంది. ఎక్కడ చూసినా ప్రయాణికులకు, రవాణా సంస్థ సిబ్బందికి మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు చెలరేగు తున్నాయి.
ఇది మహిళలకు ఎంతో నచ్చిన పథకమే కానీ, దీనిని అమలు చేయడానికి అవసరమైన సిబ్బందికి భారీగా కొరత ఏర్పడింది. పురుషులు, యువకులకు ఏ విధంగా తమ ఆఫీసులకు, కాలేజీలకు చేరుకోవాలో అర్థం కావడం లేదు. ఆటోలకు గిరాకీ తగ్గిపోవడంతో ఆటో డ్రైవర్లు తమకు నెలకు పది వేల రూపాయలు భరణం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తు న్నారు. ఈ ఉచిత రవాణా పథకం విజయం సాధించినందుకు మొదట్లో ప్రభుత్వం తనను తాను అభినందించుకుంది. దీనివల్ల టికెట్లు కొనుక్కునే ప్రయాణికుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని, తద్వారా తమ రెవిన్యూ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాక, ఉచిత ప్రయాణాల వల్ల పర్యాటక రంగం ఊపందుకుంటుందని కూడా భావించింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఆర్థికా భివృద్ధి చోటు చేసుకుంటుందని కూడా అభిప్రాయపడింది. అయితే, ఈ పథకం గురించి ముందుగా ఎక్కడాచర్చించడం, ఇందులోని సమస్యల గురించి లోతుగా ఆలోచించడం వంటివి జరగలేదు.
బస్సు ప్రయాణికులు పడబోయే ఇబ్బందుల గురించి కూడా ఆలోచించలేదు. రెగ్యులర్‌ ప్రయాణికులు ఈ బస్సుల మీద ఆశలు పెట్టుకోవడం విరమిస్తే ఈ పథకం కుప్పకూలి పోవడం ఖాయం. ప్రభుత్వ ఉద్దేశమే దెబ్బతింటుంది. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు మాత్రమే’ బస్సు పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం అధ్యయనం చేసి ఉండాల్సింది. మహిళా ప్రయాణికుల కోసం ఉచిత బస్సులను నడిపే బదులు ప్రత్యేక బస్సులు నడపడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News