Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Freedom of speech: హద్దులు మీరుతున్న భావ ప్రకటన స్వేచ్ఛ

Freedom of speech: హద్దులు మీరుతున్న భావ ప్రకటన స్వేచ్ఛ

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ద్వేషపూరిత ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాఖ్యలు, విమర్శలు పెరిగిపోవడం ఎంతగానో ఆందోళన కలిగిస్తోంది. అధికారంలో ఉన్నవారు, అధికారానికి దగ్గరగా ఉన్నవారు, అధికారం కోసం ఆరాటపడుతున్నవాళ్లు ఇటువంటి ద్వేషపూరిత ప్రకటనలకు పాల్పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. దేశం పట్ల, ప్రజల పట్ల, ప్రభుత్వాల పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన వారే ఇటువంటి ధోరణికి తెగబడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతున్న ఈ ధోరణి ప్రజాస్వామ్యవాదుల మనసుల్లో అలజడి రేకెత్తిస్తున్న మాట నిజం, వాస్తవానికి, ఇటువంటి ద్వేషపూరిత ప్రసంగాలు నేర శిక్షాస్మృతి కిందకే వస్తాయి. ఎవరికైనా కేసు నమోదు చేసి, కోర్టులో విచారణ జరిగితే ఈ నేరాలకు కఠిన శిక్షలే విధించడం జరుగుతుంది. అయితే, ‘న్యాయం’, ‘చట్టం’ వీటిపైన తగిన చర్యలు తీసుకోలేకపోతోంది. చట్టాల్ని, న్యాయస్థానాల్ని ఉద్దేశపూర్వకంగా, వాంఛితంగా ధిక్కరించడం రానురానూ సర్వసాధారణమైపోతోంది. విచిత్రమేమిటంటే, ఊచకోతలకు, నరమేధానికి కూడా దారితీయగల ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలను వదిలిపెట్టి, సాధారణ ప్రజానీకం సరదా కోసమో, హాస్యం కోసమో చేసే వ్యాఖ్యల మీద అధికారులు తమ ప్రతాపం చూపించడం కూడా జరుగుతోంది.

- Advertisement -

ఏతావతా, దేశం రాజకీయంగా, సాంస్కృతికంగా అతి దారుణంగా పతనమవుతోందనిపిస్తోంది. సుమారు పదేళ్ల నుంచి అతి ప్రముఖ వ్యక్తులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడడమన్నది సుమారు 490 శాతం పెరిగిపోయిందని అంచనా. అంతేకాదు, ఈ పదేళ్ల కాలంలో 45 మంది ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి, 124 కేసులు నమోదయ్యాయి. అటు అధిక సంఖ్యాకుల్లోనూ, ఇటు అల్పసంఖ్యాకుల్లోనూ మతోన్మాతం, మత ద్వేషం అనేవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆరోగ్యకరమైన చర్చలకు, వాదోపవాదాలకు ఈ ధోరణులు మాయని మచ్చ తెచ్చిపెడుతున్నాయి. సంస్థల కార్యకలాపాలను, సంస్థలను నిర్వహిస్తున్నవారి కార్యకలాపాలను ప్రజలు, ప్రముఖులు విమర్శించడానికి స్వేచ్ఛ ఉండాలనడంలో సందేహం లేదు. ప్రజల విమర్శలను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు కానీ, చట్టసభలు కానీ, న్యాయస్థానాలు కానీ ఎటువంటి ప్రయత్నాలూ చేయకూడదని ప్రజాస్వామ్యవాదులంతా అంగీకరిస్తున్నారు. ప్రజాస్వామ్యం సక్రమంగా పని చేయాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛగా విమర్శించే హక్కు వగైరాలన్నీ మౌలికంగా అవసరం. ఈ స్వేచ్ఛకు రాజ్యాంగబద్ధత ఉంది. ప్రభుత్వం ఈ స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తోంది. “ప్రజల భావ వ్యక్తీకరణకు భంగం కలిగించే, ఈ స్వేచ్ఛకు హద్దులు విధించే ఎటువంటి చర్యనూ న్యాయస్థానాలు సహించకూడదు. ఒక స్వేచ్ఛ కోసం మరో స్వేచ్ఛను బలిచేయటం సమంజసం కాదు” అని సుప్రీం కోర్టు చాలా ఏళ్ల కిందటే ఒక కేసులో తీర్పునిచ్చింది.

ప్రజలదే పూర్తి బాధ్యత

అయితే, ఇక్కడ సమస్య భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించింది కాదు. మంత్రులు, చట్టసభల సభ్యులు, ప్రజాప్రతినిధులు, బహిరంగంగా విద్వేషపూరిత, ద్వేషపూరిత, నిందాపూర్వక ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయడం సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా తీవ్ర మనస్తాపాన్ని కూడా కలుగజేస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి? ప్రజల హక్కుల విషయంలో ప్రభుత్వాలు కల్పించుకోవడం లేదు కానీ, ప్రభుత్వంతో, చట్టసభలతో సంబంధం ఉన్నవారు, వాటికి దగ్గరగా ఉన్నవారితోనే పేచీ అంతా వస్తోంది. నిజానికి, వీరు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సి ఉంటుంది. కేవలం బాధితులు మాత్రమే ఈ ధోరణుల మీద పోరాడాలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులు తమకు తాముగా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీలుండదు. రాజ్యాంగంలోని 19(1) ప్రకారం ప్రతివారికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇటువంటి వాటిని నిరోధిస్తూ రాష్ట్రాలు చట్టాలు చేస్తే తప్ప నిరోధించడం సాధ్యం కాదు.

కొన్ని ప్రత్యేక కేసుల్లో వీటిని నిరోధించడం అనివార్యమవుతుంది. ఏదైనా వ్యాఖ్య లేదా ప్రకటన వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేదిగా ఉన్నప్పుడు దానిని నేరపూరిత చర్యగా పరిగణించి, శిక్షలు విధించవచ్చని సుప్రీం కోర్టు ఒకప్పుడు రూలింగ్ ఇచ్చింది. ఏవైనా వ్యాఖ్యలు మతపరంగా విద్వేషాలు, వైషమ్యాలు సృష్టించిన పక్షంలో వాటిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం ఒక కేసులో చెప్పింది. సంబంధిత అధికారులు నిషేధాజ్ఞలు విధించవచ్చని కూడా చెప్పింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత నేరాల విషయంలో ఇటీవల కూడా సుప్రీం కోర్టు వివిధ రకాల ఆదేశాలు జారీ చేసింది. అసహనానికి సంబంధించిన, మతపరమైన ఆధిపత్యానికి సంబంధించిన, దురభిప్రాయాలకు సంబంధించిన నేరాల్లో సహనంతో వ్యవహరించకూడదని, ఇటువంటివి ఒక రకంగా ఉగ్రవాద ధోరణులేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయేతర శక్తులు, ప్రభుత్వేతర శక్తులు న్యాయ, ప్రభుత్వ అధికారాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కూడా అది పేర్కొంది. మొత్తానికి, విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయడానికి అటు పోలీసులకు, ఇటు న్యాయస్థానాలకు అధికారముందనే సంగతి సుప్రీం కోర్టు ఆదేశాలతో తేలిపోయింది. అయితే, అధికారం, రాజకీయాల కారణంగా న్యాయస్థానాల ఆదేశాలు కార్యరూపం దాల్చడం లేదు.

పోలీసులు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించగలిగితే తప్ప న్యాయస్థానాల ఆదేశాలు కార్యరూపం దాల్చలేవు. నిజానికి పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశమివ్వాలని కూడా సుప్రీం కోర్టు అనేక సందర్భాలలో స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వాలు, కార్యనిర్వాహక వ్యవస్థలు అందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు బహిరంగ వ్యాఖ్యలు, ప్రసంగాలకు కొన్ని నైతిక హద్దులు, పరిమితులు, నిబంధనావళిని నిర్దేశించాయి. ఇక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తమకు తాముగా కొంత క్రమశిక్షణను నిర్దేశించుకోవడం కూడా జరుగుతోంది. అయితే, ఇటువంటివి భారతదేశంలో అమలు జరగడం లేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఓటర్ల నుంచి అత్యధికంగా ప్రయోజనాలు రాబట్టడానికి నాయకులు, అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎక్కువగా ఆధారపడడం జరుగుతోంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిషేధ, శిక్షాత్మక అంశాలకు, నిబంధనలకు విరుద్ధంగా మత సంబంధమైన అంశాలతో, అజెండాలతో బహిరంగంగానే ప్రసంగాలు సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.

ఇటువంటి ధోరణులను అడ్డుకోవడానికి ఒక సంస్థాగతమైన యంత్రాంగం చాలా అవసరం. నిజానికి మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలు ఇటువంటి విషయాల్లో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. ప్రతి విద్వేషపూరిత ప్రసంగమూ మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇటువంటి మానవ హక్కుల సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం వల్ల ఉపయోగం ఉంటుంది. రాజకీయ నియామకాల విధానం, ఇందుకు సంబంధించిన ప్రక్రియ అనేక సంస్థల పనితీరును బలహీనపరిచినట్టే మానవ హక్కుల సంస్థను కూడా బలహీనపరుస్తోంది. విద్వేషపూరిత ప్రసంగాలను వెనువెంటనే ఎదుర్కోవడంలో మానవ హక్కుల సంస్థలు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు కల్పించుకోవచ్చు. కానీ, అవి కల్పించుకోవు. మానవ హక్కుల సంస్థలను పనిచేయించడానికి న్యాయస్థానాలు ముందుకు రానప్పుడు, ప్రజలే కల్పించుకోవాల్సి ఉంటుంది. సోషల్ యాక్షన్ లిటిగేషన్ (ఎస్.ఏ.ఎల్) ద్వారా ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ప్రజాప్రతినిధులే ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నిజంగా దిగ్భ్రాంతికర విషయం. ఎంతో పరిపక్వంగా, సమతూకంగా వ్యవహరించాల్సిన తమ నాయకులు కొట్టు, నరుకు, చంపు అన్నతీరులో వ్యవహరించడం ప్రజలకు కొరుకుడు పడని సమస్య. ఏది ఏమైనా, ప్రజల వల్లే, అప్రమత్తంగా ఉన్న పౌరుల వల్లే ఇటువంటి ధోరణులకు తెరపడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News