ఎప్పుడో 26 ఏళ్ల క్రితం.. అంటే 1998లో బాలీవుడ్‌లో కుఛ్ కుఛ్ హోతా హై అనే సినిమా విడుదలైంది. షారుక్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ అందులో ప్రధాన పాత్రధారులు. స్నేహం అనేది ప్రేమకు పునాది లాంటిదన్నది ఆ సినిమా ప్రధాన ఇతివృత్తం.
ఇప్పుడు జపాన్ దేశం మరో అడుగు ముందుకేసింది. స్నేహాలను నేరుగా పెళ్లిదాకా తీసుకెళ్లే ప్రయత్నం అక్కడ జరుగుతోంది. అంటే మధ్యలో ప్రేమ ప్రసక్తి మాత్రం ఉండదన్నమాట. జపాన్‌లో ఇప్పుడు స్నేహితుల మధ్య పెళ్లిళ్లు అనేది ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. చట్టబద్ధంగా ఇద్దరు స్నేహితులు వివాహ బంధంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ, వారి మధ్య మొదట్లో శృంగారం మాత్రం ఉండదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ సరేననుకుంటేనే శృంగారం, పిల్లల్ని కనడం లాంటివి ఉంటాయి. ఒకవేళ కాస్త వయసైపోతున్న తరుణంలో పిల్లలు కావాలనుకున్నా, కృత్రిమ గర్భధారణ లేదా ఐవీఎఫ్ లాంటి మార్గాలు కూడా వారికి ఉంటున్నాయి.
స్నేహం.. పెళ్లి.. ఏంటి సగతి?
నిజానికి ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అంటే స్నేహితులను పెళ్లి చేసుకోవడం ఒక్కటే కాదు. తమలాంటి ఆలోచనలు, ఆసక్తులు, విలువలు ఉన్నవారితో జీవితాన్ని పంచుకోవడం. ప్రధానంగా ఇద్దరి మధ్య మంచి బంధం ఉండాలి. ఇద్దరూ కలిసి సరదాగా జీవితం గడపగలగాలి. బాధ్యతలు పంచుకోవాలి. ఇంట్లో పనుల నుంచి ఆర్థిక విషయాల వరకు అన్నీ కలిసే చేసుకుంటారు. వ్యక్తిగతంగా అయినా, వృత్తిపరంగా అయినా ఒకరి ఎదుగుదలకు మరొకరు సాయపడతారు. ఇద్దరి మధ్య అవగాహన బాగా పెరిగిన తర్వాతే శృంగారం, పిల్లల గురించి ఆలోచిస్తారు. అప్పటివరకు కలిసి ఉండడానికే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్లు చేయించడానికి కొన్ని సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ పెళ్లి చేసుకునేందుకు ముందే ఆడ-మగ ఇద్దరూ కలిసి విస్తృతంగా చర్చించుకుంటారు. ఇంటి పనులు, ఆర్థిక వ్యవహారాల నుంచి ఫ్రిజ్ స్పేస్ పంచుకోవడం ఎలా అనే చిన్న విషయాల వరకు అన్నింటి గురించీ మాట్లాడుకుంటారు. అన్నీ సరే అనుకుంటేనే ముందుకెళ్తారు. ఇప్పటివరకు ఇలాంటివి దాదాపు 500 పెళ్లిళ్లు చేయించినట్లు జపాన్ సంస్థ ఒకటి చెబుతోంది. ఇలా చేసుకునేవారి సగటు వయసు 32.5 సంవత్సరాలు. బాగా చదువుకుని, ఆర్థికంగా స్థిరపడ్డాక ఇందులోకి వెళ్తున్నారు.
జపాన్‌లోనే ఎందుకు మొదలైంది?
జపాన్ వాసుల్లో చాలామందికి శృంగారం మీద ఆసక్తి ఉండట్లేదు. కానీ, ఆడవాళ్లకు మగవాళ్లు, పురుషులకు స్త్రీలు తోడు ఉంటే బాగుంటుందని మాత్రం అనుకుంటున్నారు. అంతేకాదు, పెళ్లయిన జంటలకు అక్కడ పన్ను రాయితీలు, ఆరోగ్య బీమా లాంటి సదుపాయాలను అక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది. భార్యాభర్తల్లో ఒకరి ఆదాయం బాగా ఎక్కువగా ఉండి, మరొకరిది కాస్త తక్కువగా ఉంటే.. అప్పుడు వాళ్లిద్దరికీ పన్నుభారం గణనీయంగా తగ్గిపోతుంది. ఒకరకంగా దీనివల్లే స్నేహితుల మధ్య పెళ్లిళ్లు మొదలవుతున్నాయి. అక్కడి నగరాల్లో జీవనవ్యయం బాగా ఎక్కువ కావడం వల్లే ఇన్నాళ్లూ పెళ్లి, పిల్లలు వద్దనుకున్నారు. కానీ, స్నేహితులనే చేసుకుంటే బాధ్యతలు పంచుకోవడంలోను, బాధలు చెప్పుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 2024 సంవత్సరం ప్రథమార్ధంలో 37,227 మంది తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారు!
ఈ విధానం మంచిదేనా?
స్నేహం అనేది ప్రేమకు పునాది అన్నది వాస్తవమే. కానీ, శారీరక సంబంధాలు లేకపోతే కొన్నాళ్ల తర్వాత సమస్య అవుతుందని మానసిక వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందునుంచే బాగా తెలిసుండడం, ఒకరి వ్యక్తిత్వం గురించి ఒకరికి అవగాహన ఉండడం వల్ల ఇద్దరి మధ్య సంబంధాలు మరింత సుస్థిరంగా, బలంగా ఉంటాయి. ఒకరిపై ఒకరికి విశ్వాసం, గౌరవం కూడా ఉంటాయి. దీనివల్ల వారి బంధం బలపడుతుంది. ఇలా పెళ్లి చేసుకున్నవారిలో ఒకటి రెండేళ్ల పాటు అసలు శృంగారం ప్రస్తావనే తేకపోయినా.. తర్వాత క్రమంగా పిల్లల్ని కంటున్నవారు కూడా ఉన్నారని జపాన్ పరిశీలకులు చెబుతున్నారు. కొంతమందిలో మాత్రం అస్సలు రొమాంటిక్ జీవితం అన్న ప్రస్తావనే ఉండట్లేదని, ముఖ్యంగా ఒకరు కావాలనుకుని, మరొకరు వద్దనుకుంటే మాత్రం అప్పుడు బంధం బద్దలవుతుందని అంటున్నారు. ఇద్దరూ చర్చించుకుని, ఒక అంగీకారానికి వస్తేనే ఇందులో దీర్ఘకాలం పాటు బంధాలు నిలుస్తాయని వివరిస్తున్నారు.
మన దేశంలో పరిస్థితి ఏంటి?
భారతదేశంలో సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లిళ్లే ఎక్కువ. కొన్ని ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నా, వాటిలోనూ పెద్దలు అంగీకరించి పెళ్లి తంతు అంతా భారీగా జరిపిస్తున్నవీ ఉంటున్నాయి. కానీ, పెద్దలు కుదిర్చినా.. ప్రేమ వివాహం అయినా విడాకుల వరకు వెళ్తున్నవి కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో స్నేహితుల మధ్య పెళ్లి అనేది ఒక మంచి పరిష్కారమని భావిస్తున్నారు. పిల్లలు వద్దనుకునే జంటలు భారతదేశంలోనూ పెరుగుతున్నాయి. డింక్ (డ్యూయల్ ఇన్‌కమ్, నో కిడ్స్) అనే జీవనశైలి ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో ఇప్పుడిప్పుడే స్నేహితుల మధ్య పెళ్లిళ్లుకూడా కనిపిస్తున్నాయి. అయితే.. జపాన్ తరహాలో కాకుండా పెళ్లయిన కొద్ది రోజుల నుంచే ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు మన దేశంలో బాగానే ఉంటున్నాయన్నది ఒక పరిశీలన. ఇద్దరిలో ఒకరికి ఎక్కువ కోరికలు ఉండి, మరొకరికి తక్కువగా ఉంటేనే సమస్యలు వస్తున్నాయని.. ఈ విషయాన్ని స్నేహితులైతే బాగా పరిష్కరించుకుని కలకాలం కలిసి జీవించే అవకాశం ఉంటుందని ఢిల్లీకి చెందిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ సుదీప్తి మిశ్రా చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఇలా స్నేహితుల మధ్య పెళ్లిళ్లు అనేవి బలపడుతున్నాయని, ఇది ఒక రకంగా మంచిదేనని ఆమె అన్నారు. ఇద్దరి మధ్య భావోద్వేగపరమైన స్థిరత్వం ఉండడంతో క్రమంగా ఎక్కువమంది ఇటు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కొంత కాలం క్రితం అయితే స్నేహితులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేవారని, అంటే.. ఇద్దరు పురుషుల మధ్య స్నేహబంధం బాగుంటే దాన్ని వియ్యంగా మార్చుకునేవారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఒక అడుగు ముందుకు వచ్చి స్త్రీ పురుషుల మధ్య స్నేహం.. వివాహంగా మారుతోందని వివరించారు.
ఏది ఏమైనా.. వివాహ బంధం అనేది కలకాలం నిలిస్తేనే ఆ జంట కన్నులపంటగా ఉంటుందన్నది తిరుగులేని వాస్తవం. అందుకు స్నేహం ఒక మంచి పునాది అయితే అంతకంటే కావల్సింది ఏముంటుంది?
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)