Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్G-20: జీ-20 సమావేశం సాధించేదేమిటి?

G-20: జీ-20 సమావేశం సాధించేదేమిటి?

శిఖరాగ్ర సదస్సు తెచ్చే ఫలితాలపై యావత్ ప్రపంచ దేశాల ఆసక్తి

ఢిల్లీలో జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు క్సి జిన్‌ పింగ్‌ హాజరు కాకపోవడం భారత్‌ కు నిజంగా ఎంతో ఊరట కలిగించే విషయం. ఉక్రెయిన్‌ దేశంతో యుద్ధంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాను ఈ సమావేశానికి హాజరు కాలేనని ముందుగానే సమాచారం అందించారు. తాను రాలేకపోతున్న విషయాన్ని ఇతర దేశాల అధినేతలకు కూడా తెలియ జేయాల్సిందిగా పుతిన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీకి చాలా కాలం క్రితమే తెలియజేశారు. అయితే, జిన్‌ పింగ్‌ ఇటువంటి సౌజన్యాన్నేమీ ప్రదర్శించలేదు. తన తరఫున తమ ప్రధాని లీ జియాంగ్‌ తమ ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహిస్తారని మాత్రమే ఆయన తెలిపారు.
నిజానికి, జిన్‌ పింగ్‌ రాకపోవడాన్ని బాగా తగ్గించి చూపించడానికే పాశ్చాత్య దేశాలు ప్రయత్నించాయి. సరిహద్దు సమస్యల విషయంలో భారత, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్నందువల్లే జిన్‌ పింగ్‌ రావడం లేదన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు అవి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయితే, జిన్‌ పింగ్‌ గైర్హాజర్‌ అవడమనేది కేవలం సరిహద్దు సమస్యలకు మాత్రమే పరిమితం కాలేదు. మరికొన్ని భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో ‘దక్షిణ ప్రపంచం’ అనే నినాదాన్ని చేపట్టిన రష్యా, చైనా దేశాలు ఇప్పుడు తూర్పు దేశాలు వడివడిగా అభివృద్ధి సాధిస్తుండగా, పాశ్చాత్య దేశాలు అధోగతి పాలవుతున్నాయంటూ కొత్త పాట ఎత్తుకున్నాయి.
ఇటువంటి దశలో చైనా భౌగోళక, రాజకీయ ప్రాధాన్యాన్ని, ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి భారత్‌ అమెరికా వంటి పాశ్చాత్య దేశాల కూటమితో సన్నిహితం కావడాన్ని అది తీవ్రంగా ప్రశ్ని స్తోంది. బహుశా ఈ కారణంగానే చైనా జీ-20 శిఖరాగ్ర సమావేశానికి గైర్హాజర్‌ అయి ఉండవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాదు, జీ-20 సమావేశాల సందర్భంగా భారత్‌ ను ఇరకాటంలో పెట్టడానికి, ఒత్తిడికి గురి చేయడానికి చైనా మరో ఎత్తుగడకు పాల్పడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఆక్సాయ్‌ చిన్‌, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాం తాలు తమ భూభాగంలో ఉన్నట్టుగా తెలియజేస్తూ చైనా ఒక ప్రామాణిక మ్యాప్‌ ను విడుదల చేసింది. అదే సమయంలో అది భారతదేశంతో తమ సంబంధాలు ‘స్థిరంగా’ ఉన్నట్టుగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రాకపోయినా, సరిహద్దు సమస్యలు ఉన్నా తమ మధ్య వాణిజ్య సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయని చెప్పడమే దాని ఉద్దేశం.
భారత, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 14,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. భారతదేశవాణిజ్య లోటు మొదటిసారిగా 10,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ విధంగా భౌగోళిక రాజకీయ కారణాలను చూపిస్తూ, చైనా భారతదేశంతో తన వాణిజ్య సంబంధాలు చెక్కుచెదరకుండా చూసుకుంటోంది. ఇంతకూ ఈ జి-20 సభ్య దేశాల మధ్య ఉన్న విభేదాలు, అంతరాలు, వివాదాలు జీ-20 శిఖరాగ్ర సమావేశం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయకుండా అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ విషయంలోనూ, ఇతర అంతర్జాతీయ సమస్యల విషయంలో తమ వైఖరిని సరైన విధంగా ప్రతిబింబింపజేయని పక్షంలో ఈ ఉమ్మడి ప్రకటనకు తాము తప్పకుండా అడ్డుపడతామని రష్యా ఇప్పటికే ప్రకటించింది. భద్రతా వ్యవహారాలను ఈ వేదికపై చర్చించడానికి అవకాశం లేనప్పటికీ, ఉక్రెయిన్‌ దేశంపై రష్యా దాడిని పాశ్చాత్య దేశాలు ఈ ఉమ్మడి ప్రకటనలో అనివార్యంగా ప్రశ్నించడం జరుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రకటన విడుదల అయ్యేలా చేయడం భారత్‌కు పెద్ద సవాలు కాబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News