Sunday, May 19, 2024
Homeఓపన్ పేజ్Gamophobia-fear of marriage: పెళ్లిపై ఆసక్తి సన్నగిలుతోంది

Gamophobia-fear of marriage: పెళ్లిపై ఆసక్తి సన్నగిలుతోంది

సోషల్‌ లైఫ్‌ అంటే సోషల్‌ మీడియాగా మారిపోయింది

రాములమ్మ కూతురు జాహ్నవి చాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం మంచి పొజిషన్‌ లో ఉంది. పెద్ద మల్టీ నేషనల్‌ కంపనీలో సి.ఏ గా పని చేస్తుంది. లక్షల్లోజీతం.. కానీ పెళ్లి చేసుకోమంటే చాలు చికాకు పడుతోంది. సంసారం, పిల్లలు వద్దా..? అని అమ్మ నాన్న అడిగితే.. మీకు మనవలు కావాలా చెప్పండి. అనాధ పిల్లలను దత్తత తీసుకుందాం లేదా సరోగసీ ఉండనే ఉంది కదా. సో.. పిల్లలను తీసుకొచ్చి నీ చేతిలో పెడతానులే. నేను మాత్రం ఇపుడే పెళ్లి చేసుకొను అంటోంది. ఇలా జాహ్నవి ఆలోచనలతో ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
వెంకటేశ్వర్‌ కూతురు బిందు ఒక సాఫ్ట్‌ వేర్‌ కంపనీ లో పని చేస్తుంది. ఇప్పటి వరకు ఇరవై ముప్పై పెళ్లి చూపు లు అయినప్పటికి ఒక్క సంబంధం కూడా నచ్చడం లేదు. బిందుతో పాటుగా పనిచేసే రజని పెళ్లి చేసుకుని ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే విడాకులతో విడిపోయిన సంఘటన తనను కుంగదీస్తుంది. సిల్లిగా అనిపిస్తున్న హిమబిందులో ఆ ప్రభావం బాగా పనిచేస్తుంది. బిందుకంటూ కొన్ని వ్యక్తిగత లక్ష్యాలున్నాయి. వాటిని కాబోయే వాడు అర్థం చేసుకుని అండగా ఉంటాడా అనే ప్రశ్న నిద్దుర పట్టనీయడం లేదు. సంబంధాల్ని దాటేస్తుంటే అందరూ మరో రకంగా అనుకుంటారనే ఒత్తిడి.. పోనీ ధైర్యం చేసి ఓకే చెబుదామంటే ఇన్నాళ్ల నుండి పడిన శ్రమంతా వ్యర్థమై పోతుందేమో అనే ఒత్తిడి. ఇలా పెళ్లిళ్లు దాటేస్తున్న వారు ఉన్నారు. పెళ్లంటే ఇద్దరి వ్యక్తుల మధ్య రెండు మనసులు కలిసి చేసే నూరేల్ల కాపురం. ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి ఒక మరపురాని ఘట్టం. రెండు జీవితాలను ముడివేసే బంధం. తల మీద చెయ్యివేసి ఒట్టు పెట్టినా… తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా.. అని ఒక కవి రాస్తే… పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు… పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు.. అని మరో కవి వివాహ విశిష్టత గురించి అనుభూతులు, అనుభవాలను రంగరించి చెబితే ప్రస్తుత పరిస్తితి మాత్రం వద్దురా సోదరా పెళ్ళంటె నూరేళ్ల మంటరా.. అనేవాళ్లు ఇప్పుడెక్కువయ్యారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏవేవో అభిప్రాయాలకు, అభిరుచులకూ అలవాటుపడ్డ రెండు జీవితాలను కలిపేది పెళ్లి. అయితే.. పెళ్లి గురించి కలలు కంటూ ఊహల్లో తేలిపోయే రోజులు పోయాయి. నేటి యువతరం పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోవ డానికైనా ఇష్టపడుతున్నారు తప్ప… పెళ్లి మాటే ఎత్తడం లేదు. షాదీ మాటే వద్దు గురూ… సోలో బతుకే సో బెటరు అంటున్నారు. పెళ్లి.. పిల్లలు.. వంటి బాదర బందీకి దూరంగా ఉండేం దుకే ఇష్టపడుతున్నారు. తప్పని సరై పెళ్లి చేసుకున్నా… పిల్లలను కనడం అప్పుడే వద్దనుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
సోషల్‌ లైఫ్‌ అంటే సోషల్‌ మీడియాగా మారిపోయింది…
ప్రపంచీకరణ ప్రభావంతో నేడు జీవన విధానంలోనూ వేగం పెరిగింది. పరుగెడుతున్న కాలాన్ని అందుకో వాలంటే… కాలంతోపాటు మనమూ పరుగెత్తాల్సిందే. దీంతో జీవితం ఉరుకులు పరుగులమయంగా మారింది. చిన్నతనం నుంచి పెద్ద చదువు చదవాలి, పెద్ద ఉద్యోగం చెయ్యాలి, బాగా డబ్బు సంపాదించాలి అన్న కోరికలు మనసులో బలంగా నాటుకుపోవడమే దీనికి కారణం. దీనిలో తల్లిదండ్రుల పాత్ర గణనీయమైనదే. చదువు తర్వా త, ఉద్యోగంలో నెట్టుకు రావాలంటే లక్ష్యాలను చేరుకోవాల్సిందే. ఇందుకోసం కాలంతో పోటీ పడాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉద్యోగానికి ముప్పు తప్పదు. దీంతో ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. జీవన శైలిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కోసం ఉదయం లేవడం మొదలు అర్ధరాత్రి నిద్రపోయే వరకు కుస్తీ పడుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. ఇంటికి చేరాక ఇన్‌ స్టా రీల్స్‌, స్నాప్‌ చాట్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ చాటింగ్‌ల్లో మునిగి తేలుతున్నారు. పెళ్లి ఆలోచనయే లేదు.
యువత మెషీన్‌ లలా తయారయ్యారా….
చేతినిండాడబ్బు, లగ్జరీ జీవితం, కారు, షికారు, పబ్‌ లు, డ్రింక్‌లు, రాత్రి విందులు, బాయ్‌ఫ్రెండ్‌ గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఇలా అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. ఇంక ఫ్యామిలీ లైఫ్‌ ఎందుకు..? అనే భావన పెరిగిపోతుంది. పెళ్ళి చేసుకుంటే బాధ్యతలకు, బంధాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సోషల్‌ లైఫ్‌లో ఆ అవసరం లేదు. ఒకరి కోసం ఒకరు పట్టించుకోని బిజీ జీవితాలు అయిపోతున్నాయి. ఆఫీసు పరిచయాలు, కొలీగ్‌లు, కాలేజీ స్నేహితులు బంధువులగా మారిపోతున్నారు. తమకంటూ కుంటుంబాన్ని ఏర్పరచుకోవాలన్న వైఖరి నుంచి వారికి తెలియకుండా వారే దూరమైపోతున్నారు. కానీ జీవితం సగభాగం ముగిసాక అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తను అనుకునే వారెవరూ వారికి ఉండకపోవచ్చు. అలాం టి పరిస్థితుల్లో వారిని నైరాశ్యం ఆవహించక మానదు. మగవారైనా, ఆడవారైనా.. వారికి జీవితపు చివరి కాలం వరకు ఒకతోడు ముఖ్యమన్న విషయాన్ని వారు తెలుసు కునే సరికి జీవితం ముగిసిపోతుంది. అందుకే పెద్దలు కుటుంబం గురించి, వివాహ వ్యవస్థ ఎందుకు నిర్మించారో వాటిని పునరుద్దరించే దిశగా నేటియువత ఆలోచనలు ఉండాలే కాని విపరీత ప్రవర్తనలు ఉండకూడదు.
ఆకర్షణయే ప్రేమ అనే భ్రమ
యుక్త వయస్సులో హార్మోన్ల కారణంగా శరీరంలో అనేక రసాయన చర్యలు జరుగుతుంటాయి. శారీరకంగా మానసికంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. తొందరపాటు నిర్ణయాలతో అప్పు్పడప్పుడు అభాసుపాలు అవుతుంటారు. ఎదుటి వ్యక్తిపై కలిగే ఆకర్షణను కొందరు ప్రేమగా భ్రమిస్తుంటారు. తాము ఏది అనుకుంటే అది దక్కాలని అతిగా ఆవేశపడతారు. తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదు అనే భావావేశాలు వెంటాడుతూ ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్ని వాల్లే చేజేతులారా నాశనం చేసుకునేవారు కూడా ఉన్నారు. ఏది మంచో ఏది చెడో తెలియక మాయమాటలను నమ్మి మోసపోతున్నవారు కూడా మన కళ్లముందు కనిపిస్తు ఉన్నారు. ఆధునికంగా పరుగులు తీస్తున్న ప్రస్తుత సమాజంలో విభిన్న మార్పులు ఉమ్మడి కుటుంబాలు కొరత, పిల్లలపట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం ఇవన్నీ పిల్లల ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్నేహితులకు చెబితే ఎగతాలి చేస్తారనో, వారి ముందర జీరో అయిపోతానేమోననే ఫీలింగ్‌, ఇంట్లో చెబితే తల్లిదండ్రులు తిడతారనో సతమతం అవుతుంటున్నారు.
ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే చాలదా
ప్రస్తుతం అమ్మాయిలలో, అబ్బాయిలలో సొంత వ్యక్తిత్వం చిన్న వయసు నుంచే అలవడుతోంది. అందుకు కారణం విద్య కావచ్చు, ఆర్థికస్థోమత కావచ్చు. తమ తల్లి దండ్రులు కూడా చీటికీమాటికీ గొడవలు పడుతూ ఏ ఆనందం లేకుండా గడపడం చూసి కావచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకు చిన్న వయసులోనే వివాహవ్యవస్థ మీదున్న అభిప్రాయాలను చెడుగా మార్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆర్థికస్వాతంత్య్రం ఉంటే చాలాదా ఇంకేం అక్కర్లేదు అన్న ధోరణి నేటి యువతలో పెరిగిపోతోంది. వంశ పారంపర్యంగా వచ్చిన జన్యువులతో పాటుగా, పెరిగిన వాతావరణం కూడా మనిషి యొక్క ప్రవర్తన మరియు వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో దోహదం చేస్తాయి.
భవిష్యత్తు ఆనందంగా మలచుకోవడం మన చేతిలోనే
గతాన్ని బాగు చెయ్యడం మన చేతిలో లేదు. వర్త మానం కచ్చితంగా మన చేతిలోనే వుంది. భవిష్యత్తు ఆనందంగా మలచుకోవడం, బంగారుమయం చేసుకోవడం మన ఆలోచనల్లో, ఆచరణలో మాత్రమే వుంటాయి. అవసరాలకు అనుగుణమైన ప్రణాళిక లోపించినప్పుడు మాత్రమే మనిషి ఒత్తిడికి గురవుతాడు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలకు లోనవడంతోపాటు, సామాజికంగా, ఆర్థికంగా బలహీనుడవుతాడు. ప్రపంచంలో మనిషిని వేధించే భయాలు చాలా వున్నాయి. వాటన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైనది భయాలు వస్తాయేమోనని ముందుగానే భయపడడం. ఎప్పుడో ఏదో అవుతుందని భయపడకుండా, ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కో గలిగితే వివాహం పెద్ద కష్టమేమీ కాదు. నేను రేపటి గురించి అనవసరంగా ఆందోళన చెందను. ఎందుకంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతవరకూ ఆత్మ విశ్వాసంతో వుంటాను, భాగస్వామితో ప్రేమతో నిజాయితీగా వ్యవహరించడం, కలసికట్టుగా ఉమ్మడి బంగారు భవిష్యత్తు రూపొందించు కోవడం, మార్పులు చేసుకోవడం వంటివి చేసుకోగలను అనుకోవడం ద్వారా పెళ్లి ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
డా. అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌
9703935321

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News