Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్'Gandhi' saved my life: 'గాంధీ' కాపాడిన ప్రాణం నాది

‘Gandhi’ saved my life: ‘గాంధీ’ కాపాడిన ప్రాణం నాది

ఆర్థికంగా చితికిపోయిన నాకు కరోనా సంక్షోభంలో ప్రాణభిక్ష పెట్టిన 'తెలంగాణ గాంధీ'

తెలంగాణలో అప్రతిహతంగా వైద్య సేవలు
‘నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానాకు, సర్కారీ దవాఖానాకు.. దుమ్ము ఉన్న దవాఖానాకు’ అనే సినిమా పాట 1980లలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పాట ప్రాచుర్యం పొందడానికి కారణం.. అప్పుడున్న ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితే.
ఇక రాష్ట్ర రాజధానిలో గాంధీ ఆస్పత్రి గురించి మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చేది. గాంధీ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తే.. పరలోకం వెళ్ళడానికి సింహద్వారం అనే నానుడి అప్పట్లో ఉండేది. ఆ విషయానికి వస్తే గాంధీతో పాటు, ఉస్మానియా, సుల్తాన్‌ బజార్‌ ఆస్పత్రుల్లో ధైన్యస్థితి గురించి, రోగులను పట్టించుకోరనే అభిప్రాయాలు చాలా మందిలో ఇప్పటికీ ఉన్నాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు పదేళ్ల కాలంలో ఒక్క గాంధీలో మాత్రమే కాదు… ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరులో గణనీయంగా మెరుగుదల కనిపిస్తోంది. కోవిడ్‌ సమయంలో ప్రజలు బెడ్లు దొరకక, సదుపాయాలు కల్పించలేక ప్రైవేట్‌ ఆస్పత్రులు చేతులు ఎత్తివేసినప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రత్యేకంగా గాంధీ ఆస్పత్రి బాధితులను అక్కున చేర్చుకుని వైద్య సేవలు అందించాయి. కోవిడ్‌ సమయంలో కార్పొరేట్లు లక్షల రూపాయిలు రోగుల నుంచి దోచుకుంటే, ప్రభుత్వ ఆస్పత్రులు పైసా ఆశించకుండా సేవలు అందించాయి.
ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలతో పాటు ఇతర విషయాలపై శ్రద్ధ వహించింది. ఇప్పు డూ అదే పంథా కొనసాగిస్తోంది. వైద్య సేవలు అందించ డంలో కార్పొరేట్‌ ఆస్పత్రులతో సరి సమానంగా పోటీ పడుతోంది.
రోజులు మారిపోయాయి. ప్రభుత్వాసుపత్రులు అంటే.. నిజంగా ఒకప్పుడు చెప్పుకొనే ధర్మాసుపత్రుల్లా మారిపోయాయి. నయాపైసా ఖర్చు లేకుండా, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కార్పొరేట్‌ ఆస్పత్రులకు మించిన వైద్యం అందిస్తూ.. అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ నుంచి మొదలుపెట్టి మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు, కిడ్నీల లాంటి అవయవ మార్పిడులు.. ఇలాంటివెన్నో అవలీలగా చేసేస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే, కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ వైద్య రంగం అందించిన సేవలకు నిలువెత్తు ప్రత్యక్ష సాక్షిని నేనే. మొదటి దశలోనే నాకు కోవిడ్‌ సోకింది. అప్పటికే తీవ్రమైన మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దానికితోడు ఈనాడు, ఆంధ్ర జ్యోతి వంటి ప్రముఖ దినపత్రికలలో దశాబ్దన్నర కాలంగా పనిచేసి గడించిన అనుభవంతో ‘మనం’ పత్రికలో ప్రయో గం చేశాను. ఆ ప్రయోగంలో నేను విఫలమవడంతో జీవితంలో అన్నింట ఓడిపోయిన దశలో ఉన్నాను. ఆర్థికంగా కూడా చితికిపోయిన రోజులు అవి. ఇటువంటి పరిస్థితిలో కోవిడ్‌ అంటే నా పరిస్థితి నాకే అర్థం అవుతోంది. ఆస్పత్రి లో చేరకపోతే ప్రాణాలు నిలబడేలా లేవు. నేనంటూ లేక పోతే నా కుటుంబంతో పాటు వృద్ధు రాలైన మా అమ్మను చూసుకునేది ఎవరన్న ఆందోళన మొదలైంది. ప్రైవేటు రంగంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా లక్షల్లో ఖర్చవుతుందని వింటున్నాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక మిత్రుడి సలహాతో ఎలాగోలా ఓపిక చేసుకుని గాంధీ ఆస్పత్రికి వెళ్లాను.
ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 42 రోజుల పాటు గాంధీ ఆస్పత్రిలోనే తీవ్రమైన కోవిడ్‌కు చికిత్స పొందాల్సి వచ్చింది. అన్ని రోజుల పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యుల దగ్గర నుంచి నర్సులు, వార్డు బోయ్‌ల వరకూ ప్రతి ఒక్కరూ అద్భుతమైన సేవలు అందించారు. మందులు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ లాంటివి సరే సరి. మంచి పోషకాహారం ఇచ్చేవారు. ఫక్తు శాకాహారిని కావడంతో తగినన్ని ప్రోటీన్లు అందాలంటూ..రోజూ డ్రైఫ్రూట్స్‌ కూడా తప్పనిసరిగా పెట్టేవారు. చావు నోట్లోకి వెళ్లొచ్చిన నేను… మళ్లీ ఈరోజు మీ అందరి ముందు నిలబడ్డానంటే, మళ్లీ నాలుగు ముక్కలు రాయగలుగుతున్నానంటే అందుకు ఏకైక కారణం గాంధీ ఆస్పత్రి.
అటూ ఇటూ శవాలు.. మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌
కోవిడ్‌ మొదటివేవ్‌ వచ్చినప్పుడు అసలు చికిత్సలు ఎలా చేయాలో కూడా చాలావరకు తెలియదు. ర్యాండమ్‌ గా కొన్నిరకాల మందులు మాత్రమే వాడేవారు. దానికి తోడు గాంధీ ఆస్పత్రికి ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వ్యాధి ముదిరిపోయిన తర్వాత రోగులు వస్తుండటంతో ఇక్కడ మరణాల రేటు కాస్త ఎక్కువగానే కనిపించేది. నాతో పాటు దాదాపు వచ్చిన ప్రతి పేషెంటూ ముక్కుకు ఆక్సిజన్‌ మాస్కు తగిలించుకునే ఉండేవారు. దాంతో అటూ ఇటూ బెడ్ల మీద ఉన్న వారిని కళ్లతోనే పలకరించుకునే వాళ్లం. అలా ఒకరి ముఖం ఒకరికి తెలుసు తప్ప, వాళ్ల పేరు.. ఇతర వివరాలు ఎవరికీ తెలియవు. ఒక రోజు పొద్దున్న నాకు బ్రేక్‌ఫాస్ట్‌ వచ్చింది. అది తింటూ అటూ ఇటూ చూస్తుంటే రెండు బెడ్ల మీద జిప్‌ వేసిన బ్యాగ్‌లు ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత మందులు తీసుకొచ్చిన నర్సుతో అదేంటని అడిగితే, ఆ ఇద్దరు పేషెంట్లు చనిపోయారని చెప్పింది. అంటే నేను రాత్రంతా రెండు శవాలను అటూ ఇటూ పెట్టుకుని పడుకోవడంతో పాటు ఉదయం పూట వీటి మధ్యనే నేను టిఫిన్‌ తిన్నానన్న మాట! ఈ విషయం తెలిసి గుండె జల్లుమంది. ఇలాంటి సంఘటనలు నాకు పదుల సార్లు అనుభవంలోకి వచ్చింది.
బతకాలనే ధైర్యం మీకు ఉండాలి
నిజానికి అలాంటి సమయంలో నేను బతుకుతానా అనే భయం చాలా వేసేది. కో-మార్బిడిటీస్‌ అంటే.. కోవిడ్‌ సోకినవారికి అప్పటికే మధుమేహం (డయాబెటిస్‌), బీపీ లాంటి దీర్ఘకాల సమస్యల ఉంటే బతికే అవకాశాలు తక్కువని అప్పట్లో చెప్పేవారు. దానికితోడు ఆస్థమా లాంటి సమస్యలు ఉంటే ఊపిరితిత్తులు బాగా పాడైపోతాయని అనేవారు. ఇందులో చాలా సమస్యలు నాకు ఉండటంతో బతికి బయటికొస్తానన్న నమ్మకం చాలా తక్కువగా ఉండేది. కానీ డాక్టర్లు అక్కడకు వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా ధైర్యం చెప్పేవారు. ‘బతకాలన్న కోరిక, బతకగలనన్న ధైర్యం మీకు ఉండాలి.. అప్పుడే మేం చేసే చికిత్సలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. మీరు మానసికంగా దృఢంగా ఉంటే శారీరకంగా మేం బాగుచేయగలం. కాబట్టి, మీరు బతకడానికి.. మీ జీవితానికి ఒక లక్ష్యం, ఒక అర్థం ఉన్నాయని గుర్తుతెచ్చుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే మీరు బతికే ఉండాలి కాబట్టి, ఇక్కడ మందులు బాగా వేసుకోండి, మంచి ఆహారం మేం పెడతాం.. తినండి. అప్పుడే మీరు కోలుకుని ఇంటికి వెళ్లగలరు‘ అంటూ సైకియాట్రిస్టుల తరహాలో మంచి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చేవారు. వాళ్లు అన్నట్లే… నేను మళ్లీ కోలుకుని బయటకు రావాలి, పాత్రికేయ రంగంలో నాకంటూ ఒక ముద్ర ఉందని మరోసారి నిరూపించుకోవా లని అనుకున్నాను. ఒకవైపు వైద్యులు అందించిన అద్భుత మైన చికిత్సలు, మరోవైపు వాళ్లు నూరిపోసిన మానసిక ధైర్యం, ఇంకోవైపు శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషక పదార్థాలతో కూడిన ఆహారం.. అన్నీ అందడంతో నేను పూర్తిస్థాయిలో కోలుకుని, మళ్లీ తిరిగి మీ ముందుకు రాగలిగాను. ఒకటా.. రెండా.. ఏకంగా 42 రోజుల పాటు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నది మాత్రం కచ్చితంగా గాంధీ ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బందేనని ఘంటా పథంగా చెప్పగలను.
ప్రభుత్వరంగంలో ఉన్న ఆస్పత్రులపై ఉండే చిన్న చూపును ఆ ఒక్క సంఘటన పటాపంచలు చేసేసింది. అప్పటికి నిమ్స్‌ లాంటి ఆస్పత్రులు అంటే కొంత గౌరవ భావం ఉన్నా.. ఉస్మానియా, గాంధీ లాంటి ఆస్పత్రులకు వెళ్లాలంటే అసలక్కడ వైద్యం అందుతుందా అనే అను మానం ఒకప్పుడు ఉండేది. ఎవరైనా చెబితే నమ్మేవాడిని కానేమో గానీ, స్వయంగా నాకే ప్రత్యక్ష అనుభవం అయిన తర్వాత అప్పటినుంచి ప్రభుత్వాసుపత్రులు అంటే వెంటనే లేచి రెండు చేతులూ జోడించి మరీ నమస్కారం పెట్టేంత గౌరవ ప్రపత్తులు పెరిగాయి. నిజానికి గాంధీ ఆస్పత్రికి వెళ్లినవారిలో ఏ ఒక్కరికీ అసంతృప్తి అనేది ఉండదు. కోకొల్లలుగా వచ్చే రోగుల కారణంగా కొన్ని మౌలిక సదుపాయాలు సరిపోకపోవచ్చేమో గానీ, సేవల విషయంలో ఏమాత్రం అనుమాన పడాల్సిన అవసరం లేనే లేదు. కోవిడ్‌ సమయంలోనే ప్రైవేటు ఆసుపత్రులు జలగల్లా రోగుల డబ్బు గుంజేసేవారు. అప్పటివరకు ఏం చేసినా, చివర్లో పరిస్థితి విషమించింది అన్నప్పుడు గాంధీకి తోలేసేవారు. దానివల్ల కూడా గాంధీ లాంటి ఆస్పత్రులలో కోవిడ్‌ మరణాల రేటు కొంచెం ఎక్కువగా కనిపించేది. అంతే తప్ప, అక్కడి సేవల్లో లోపం వల్లనో, సరైన చికిత్స అందించకపోవడం వల్లనో ఏమాత్రం కానే కాదు.

- Advertisement -

మన చుట్టుపక్కలే ఎన్నెన్ని సదుపాయాలో
నిజానికి మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పలు రకాల ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు.. ఇలా పూర్తి ఉచితంగా సేవలు అందించే అనేక స్థాయుల్లోని ఆస్పత్రులు ఉన్నాయి. వాటితోపాటు నగరానికి నలువైపులా తెలం గాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. టిమ్స్‌ పేరుతో అత్యాధునిక సదుపాయాలు ఉండే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు సైతం ఉంటున్నాయి. ఇవన్నీ ఉన్నా, వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన సిబ్బంది, వైద్యులు అందరూ ఉన్నా కూడా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు చాలావరకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, పెద్ద సమస్య అయినా వెంటనే ప్రైవేటు ఆస్పత్రుల వైపే చూస్తారు. నిజానికి ఏరియా ఆస్పత్రులలో అన్ని రకాల స్పెషాలిటీలకు చెందిన వైద్యులు కూడా ఉంటారు. ఎక్స్‌ రే దగ్గర నుంచి సీటీ స్కాన్ల వరకూ అన్నీ అందుబాటులో ఉంటాయి. అవన్నీ ఉచితంగానే చేస్తారు కూడా. అయినా, ఆ సేవలను వినియోగించుకోవడానికి ఎందుకో వెనకడుగు వేస్తారు.
ఉచిత టీకాలతో అపార సేవలు
పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి కొంత వయసు వచ్చేవరకు తప్పనిసరిగా కొన్ని రకాల టీకాలు ఇప్పించాలి. బయట ప్రైవేటు ఆస్పత్రులలో అయితే వాటికి వేలల్లో ఖర్చ వుతుంది. కానీ, ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం వాటన్నిం టినీ పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇక కోవిడ్‌ సమయం లో అయితే కోవిడ్‌ టీకాలు మూడు డోసులు తీసుకోవాలన్నప్పుడు బయట అయితే ఒక్కో టీకా డోసుకు దాదాపు 800 రూపాయల వరకు అయ్యేది. వాటన్నిం టినీ, కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ పూర్తి ఉచి తంగా అందించారు. అవన్నీ కూడా ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీలతో పాటు కొన్ని కమ్యూ నిటీ హాళ్లు, పాఠశాలల్లోనూ ప్రత్యేక శిబిరాలు పెట్టి మరీ రాష్ట్రంలోని ప్రజలందరికీ పూర్తి ఉచితంగా అందిం చాలన్న లక్ష్యంతో, వారి ప్రాణాలు కాపాడాలన్న ధ్యేయంతో అందించారు. ఈ తరహా సేవలను చూసి, దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణను ఆదర్శంగా తీసుకుని పని చేశాయనడం అతిశయోక్తి కాదు.
అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి అద్భుతమైన ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌.. ఇలా కేవలం ఐదు వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. 2023 నాటికి వాటి సంఖ్య 26కు పెరిగింది. అంటే ఐదు రెట్లు ప్రభుత్వ వైద్య కళా శాలలు పెరిగాయన్న మాట. అంతేకాదు.. 2014 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు కేవలం 850 ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 3,690కి పెరిగింది.
అదే ప్రభుత్వ, ప్రైవేటు రెండు రంగాల్లో వైద్య కళాశాలల సంఖ్య చూసుకుంటే, రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి కేవలం 20 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరుకుంది. రెండింటిలో కలిపి ఎంబీబీఎస్‌ సీట్లు 2,850 నుంచి 8,515కు చేరుకున్నాయి. పీజీ వైద్యవిద్య సీట్లు 1,183 నుంచి 2,890కి చేరుకున్నాయి. ఇక సూపర్‌ స్పెషాలిటీలలో అయితే రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 79 సీట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 206కు చేరుకుంది. ఇలా వైద్యరంగంలోను, వైద్యవిద్యా రంగంలోనూ తెలంగాణ ప్రస్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి ఆధ్వర్యంలో అప్రతి హతంగా సాగిపోతోంది.
‘తెలంగాణ గాంధీ’గా రాష్ట్ర ప్రజలు సగౌరవంగా పిలుచుకునే మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి కన్నుసన్నల్లో సర్కారీ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు మాటల్లో వివరించలేనంత అమూల్యమైనవి. దీనికి నిలువెత్తు సాక్ష్యం నేనే.
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
సమయమంత్రి చంద్రశేఖర శర్మ
ఎడిటర్‌
తెలుగుప్రభ

  • 7674869432
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News