Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Gandhiji: గాంధీజీ మార్గం ఆచరణీయం

Gandhiji: గాంధీజీ మార్గం ఆచరణీయం

గాంధీ మార్గం సర్వదా ఆచరణీయం

ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసి పేరు ప్రఖ్యాతులు ఆర్జించాడు మహాత్మా గాంధీ. ఇదంతా అధికారంతోనో, ఆస్తిపాస్తులతోనో కాదు. కేవలం తాను నమ్మిన సత్యం, అహింస, సహాయ నిరాకరణ, శాంతి మార్గం ద్వారా భారతదేశానికి బ్రిటిష్‌ వలసవాదుల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు సాధించి పెట్టిన మహనీయుడు. ఒక బక్క ప్రాణి తన మహత్తర శక్తిసామర్ధ్యాలతో, ఆత్మవిశ్వాసంతో మన చరిత్రకే వన్నెతెచ్చిన మహాత్ముని జీవిత విశేషాల్ని, విశ్వసనీయత, నిస్వార్థపూరితమైన త్యాగాలను తర్వాత తరాలకు అందించడంలో భాగమే ఈ చిరు ప్రయత్నం. వారి గురించి ఎంత రాసినా తక్కువే. మన మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ 1869 అక్టోబర్‌ 2న, గుజరాత్‌లోని పోరుబందర్లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కరంచంద్‌ గాంధీ, పుత్లిబాయ్‌. గాంధీజీ భార్య కస్తూరిబా. ‘నాలో ఏదన్నా పవిత్రత ఉందంటే దానికి కారణం మా అమ్మనే’ అన్నాడు గాంధీ. ప్రేమ, నిస్వార్థం, త్యాగం వంటి సుగుణాలను గాంధీజీ తన తల్లి నుండి పుణికి పుచ్చుకున్నాడు. గాంధీజీ ఇంగ్లాండ వెళ్లి బారిష్టర్‌ చదివి నారు. రెండు దశాబ్దాలకు పైగా అక్కడే ఉండిపోయారు. ఓ కంపెనీలో లాయర్‌ ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అక్కడి ప్రవాస భారతీయుల హక్కుల కోసం, జాతి వివక్షపై పోరాడినాడు. స్వయంగా వర్ణ వివక్షను ఎదుర్కొని రైలు భోగి నుండి నెట్టి వేయబడిన గాంధీని స్వదేశానికి గోఖలే రప్పించారు. ఆ అవమాన భారం జాతీయ ఉద్యమ స్పూర్తిని రగిల్చినది.
భారత జాతి వీరికి ఘనస్వాగతం పలికింది. దాదాభాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, తిలక్‌ తదితరులు గాంధీ కన్నా వయసులో పెద్దవారు. వీరు తమదైన శైలిలో పరాయి పాలనపై స్వతంత్ర ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయినా ఉద్యమ సారథ్యం గాంధీకి అప్పగించారు. నెహ్రూ, పటేల్‌, సరోజినీ, సుభాష్‌, భగత్‌, మౌలానా, అంబేద్కర్‌, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి తదితరులు ఈయన కన్నా చిన్నవారు. ఉద్యమాలలో అతివాద, మితవాద ధోరణుల భిన్న భావజాలాలను, రెండు తరాలను కలుపుకొనిపోయే మార్గ నిర్దేశకత్వంతో తనవైపుకు తిప్పుకొని ఆత్మవిశ్వాసంతో తను నమ్మిన సిద్ధాంతాలతో గాంధీజీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినారు. బానిసత్వాన్ని నిరసిస్తూ దేశమంతా పర్యటించి ప్రజల కష్టాలను చూసి చలించిపోయారు. తిండి, బట్ట, గూడు లేని తీరుకు చలించి అర్ధనగ్నంగా (అంగ) వస్త్రాలను ధరించాడు. అహింసనే ఆయుధంగా ఎంచుకొని స్వతంత్ర పోరాటాన్ని సాగించారు. ‘దేశభక్తి జీవితం కంటే గొప్పది- మానవత్వం దేశభక్తి కంటే గొప్పదని’ భావించి మానవతావాదంతో ముందుకు సాగినారు. చంపారన్‌లో రైతులకు అండగా నిలిచి రైతు బాంధవుడుగా విజయం సాధించారు. సత్యాగ్రహ ఆయుధంతో రౌలత్‌ చట్టంపై పోరాడి భారత జాతిని కార్యోన్ముఖులను చేసిన ధీశాలి. ఉప్పుపై పన్నుతో నిప్పులు చెరిగిన మహాత్ముడు దండియాత్రకు పూనుకున్నాడు. గాంధీ అడుగులో అడుగులు కలిపి దేశం మొత్తం 24 రోజుల పాటు సాగించిన పోరాట యాత్రను ప్రపంచవ్యాప్తంగా 1,350 పత్రికలు ప్రచురించాయి. ఈ సత్యాగ్రహాన్ని ప్రజల హక్కుల సాధనకు ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ ఆ పత్రికలు కీర్తించాయి. ప్రపంచం మొత్తం దృష్టి పడేలా ఈ సత్యాగ్రహం పనిచేసింది. దేశ ప్రజలందరిని స్వాతంత్య్ర పోరాటంలోకి నడిపించాడు. క్విట్‌ ఇండియా అంటూ తెల్లదొరలపై ‘లాంగ్‌ మార్చ్‌’ నిర్వహించి, వాడవాడలా స్వాతంత్య్ర కాంక్షను ఉధృతపరిచిన కర్మయోగిగా కీర్తించబడినాడు. ఆంగ్లేయులారా భారత్‌ వదలండి అనేది నినాదం అయింది. భారత జాతికి గాంధీజీ ‘కరో యా మరో’ (చేయి లేదా చావు) సందేశమిచ్చి ఉత్తేజపరిచాడు. ఈ ఆందోళన పూర్తిగా అహింసా మార్గంలో సాగాలని ఆశించాడు గాంధీ, కానీ అలా జరగలేదు. దేశంలో స్వాతంత్య్ర భావన ఉప్పెనలా ఎగిసిపడడంతో వేలాదిగా ప్రజలు బందీలయ్యారు, తుపాకీ తూటాలకు బలయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఇలా బాపూజీ ఆశయాలకు ప్రభావితమైన భరతజాతి యావత్‌ పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన అడుగుజాడల్లో నడిచి స్వాతంత్య్ర సముపార్జనలో భాగస్వామ్యం కాగలిగింది.
భిన్న భావాల సమూహాలు, విభిన్న పరిస్థితులు, అసమానతలు, మతవిద్వేషాలు ఉన్న పరిస్థితుల్లో భరత జాతిని ఒక్కతాటిపై నడిపించడం సామాన్యమైన విషయం కాదు. స్వాతంత్య్ర పోరాటంలో గడ్డిపోచలు పేని గట్టి ఏనుగునే బంధించినట్లు బ్రిటిష్‌ మత్తగజాలను అహింస అనే ఆయుధంతో బాపు ఎక్కడో ఒక మూలన పిలుపునిస్తే, దేశం నలుమూలలా ఆసేతు హిమాచలం భరత జాతి హోరెత్తి పోరాడినారు. అది ఆయన సంఘటిత శక్తికి నిదర్శనం. ఢిల్లీలో గాంధీజీ నిరాహార దీక్షకు కూర్చుంటే గల్లీలోని వారందరూ అన్నం ముట్టుకోలేదు. ‘గాంధీ మార్గం’ అనేది నాలుగు అక్షరాల పదం కాదు. అక్షరాల అగ్నిపథం. నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్దతే ఆయనను మహాత్మున్ని చేసింది. సూర్యుడు అస్తమించని బ్రిటిష్‌ రాజ్యమని బీరాలు పలికిన వారికి పడమట దారి చూపిన దృఢ సంకల్పం గాంధీజీది. ఆ సంకల్ప స్ఫూర్తితో, ఆత్మవిశ్వాసంతో తరతరాల భరతజాతి నరకయాతనను తీర్చినారు. భరతమాత తల రాతను మార్చి విధాతగా వెలుగొందాడు. భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు సిద్ధించిన అనంతరం కూడా ఎటువంటి పదవులను ఆశించలేదు. ‘భారత జాతిపిత’గా పిలుస్తారు. ఆయన చివరకు గాడ్సే చేతిలో 1948 జనవరి 30న నేలకొరిగారు. సత్యశోధన ఆత్మకథతో తన జీవితం తెరిచిన పుస్తకం అని ప్రపంచం ముందు ఉంచారు. తన జీవితంలో మొత్తంగా 2,338 రోజులు అంటే ఆరు సంవత్సరాల నాలుగు నెలలు జాతి బానిసత్వ విముక్తి కోసం జైలు జీవితం గడిపారు. మార్టిన్‌ లూథర్‌, నెల్సన్‌ మండేలా, దలైలామా, ఒబామా ఇలా పలువురికి ఆయన మార్గదర్శి. మన దేశంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకున్నాం. నాటి సంఘటనలను, వారి త్యాగాలను స్మరించుకోవడం అభినందనీయమే. గాంధీజీ కలలు గన్న స్వతంత్రం కేవలం రాజకీయమైనది కాదు. కొత్త భావాలతో సరికొత్త సమసమాజాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ మహనీయుడి ఆత్మవిశ్వాసంతో కూడిన శాంతి మార్గంలో ఈ జగత్తును పూర్ణత్వం వైపు నడిపించాలన్న ఈ అమర సందేశ స్ఫూర్తితో నేటి పార్టీ (పాలకు)లు పాలనా విధానాలు అమలు చేస్తూ, శాంతి సౌభాగ్యాలతో కూడిన సమసమాజ స్థాపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినవారు అవుతారు.

  • మేకిరి దామోదర్‌,
    సామాజిక విశ్లేషకులు, 9573666650.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News