Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Gas prices rising: గ్యాస్‌ ధరను ఎందుకు పెంచారు?

Gas prices rising: గ్యాస్‌ ధరను ఎందుకు పెంచారు?

దేశంలో ఈ ఏడాది మరో ఆరు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది మే నెలలో లోక్‌సభ, దానితో పాటు మరి కొన్ని రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటువంటి కీలక సమయంలో ఏ పాలక పక్షమైనా జనాకర్షక విధానాలకే పాల్పడుతుంది తప్ప, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు లేదా చర్యలకు పాల్పడడం జరగదు. ఏ పార్టీకైనా రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప, దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు పట్టని దేశం ఇది. అందులోనూ ప్రజలకు అత్యంత సన్నిహితమైన, ప్రయోజనకరమైన అంశం గ్యాస్‌ ధర. సాధారణంగా దీని ధరను అయిదు రూపాయలు పెంచడానికే పాలక పక్షాలు సందేహిస్తాయి. అటువంటిది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏకంగా యాభై రూపాయలు పెంచడమనేది ఎంతటి ‘ప్రజా వ్యతిరేక చర్యో’ అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కేంద్రం ఎందుకింత సాహసానికి ఒడికట్టింది? ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది? రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఏ ప్రభుత్వమైనా ఇంత అవివేకమైన నిర్ణయం తీసుకుంటుందా అనిపిస్తుంది.
నిజానికి కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరను యాభై రూపాయలు పెంచుతూ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందీ కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలకూ తెలుసు. మీడియాకూ తెలుసు. ఇందులో సందేహమేమీ లేదు. అయినప్పటికీ, ప్రజలను మభ్యపెట్టి, రాజకీయంగా లబ్ధి పొందడానికి, ఎన్నికల సమయంలో ఓట్లు సంపాదించడానికి ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. అయితే, మీడియాలో కొందరు మాత్రం కేంద్రం గ్యాస్‌ ధరను పెంచడానికి దారితీసిన బలీయమైన కారణాలపై దృష్టి పెట్టారు. గ్యాస్‌ ధరను పెంచడానికి దారి తీసిన కారణాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించినప్పుడు అవన్నీ కాకమ్మ కథలని తీసిపారేసిన కాంగ్రెస్‌ నాయకులు ఒక్కసారి తమ గత కాలపు ప్రభుత్వాల నిర్ణయాలను, చర్యలను పరిశీలించి వ్యాఖ్యలు చేస్తే మంచిదనిపిస్తుంది. మీడియా వారితో పాటు ఈ వ్యాస రచయిత కూడా తనకు రాజకీయాల పట్ల, ఆర్థిక విషయాల పట్ల ఉన్న ఆసక్తి కారణంగా కొన్ని వివరాలను సేకరించి ఈ వ్యాసం రాయడం జరిగింది.
మితిమీరిన వడ్డీ భారం
ఆయిల్‌ బాండ్ల మీద అసలు మొత్తానికి పడుతున్న వడ్డీని చెల్లిస్తున్న కారణంగా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటి వాటిపై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించడం ఇప్పట్లో సాధ్యపడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత ఏడాది ఆగస్టు 16న ప్రకటించారు.ఆ సమయంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉండి, సాధారణ ప్రజానీకం ఇబ్బంది పడడం జరుగుతోంది. అయినప్పటికీ నిర్మలా సీతారామన్‌ వీటిపై ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం జారీచేసిన ఆయిల్‌ బాండ్లను పూర్తిగా చెల్లించే వరకూ వీటి ధరలు తగ్గించడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. “చాలా పెద్ద మొత్తం వడ్డీ కింద, అసలుకు వాయిదా కింద చెల్లించాల్సి వస్తోంది. ఇది మా ప్రభుత్వం మీద ఒక పెను భారంగా మారింది”అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
నిధులను అప్పుగా తీసుకోవడానికి ప్రభుత్వం ఈ ఆయిల్‌ బాండ్లను జారీ చేస్తుంది. ఒక రకంగా ఇవి సెక్యూరిటీల లాంటివి. ఈ బాండ్లకు గడువు కాలం ఉంటుంది. ఆ గడువు కాలం తీరే దాకా వీటి మీద వడ్డీ చెల్లిస్తూ ఉండాలి. వాస్తవానికి దేశంలో ఇంధనాల మీద నియంత్రణ ఏమీ లేదు. వీటి ధరలు నేరుగా అంతర్జాతీయ ఆయిల్‌ ధరలతో అనుసంధానం అయి ఉంటాయి. ఆయిల్‌ ధరలు తగ్గినప్పుడు ఇంధనం ధరలు తగ్గాలి కదా అనే అనుమానం రాకమానదు. అయితే, ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉండదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో వాటి ధరలు తగ్గే అవకాశం లేదు.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే మాత్రం ఇక్కడ వీటి ధరలు పెరిగిపోతాయి. 2010 ప్రాంతంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటి ధరలను ప్రభుత్వం నియంత్రించ గలిగేది. దాంతో ప్రభుత్వం వీటిపై సబ్సిడీ ప్రకటించి, వీటి ధర పెరగకుండా కృత్రిమంగా ఆపేది. సబ్సిడీ ప్రకటించినప్రభుత్వం ఆ సబ్సిడీని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఓ.ఎం.సి) చెల్లించేది. ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం వంటి సంస్థలు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల కిందకు వస్తాయి.
ఆర్థికంగా పెనుభారం
ఈ సబ్సిడీలను చెల్లించడానికి బదులుగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ బాండ్లను జారీ చేసింది. ఈ బాండ్ల మీద ప్రభుత్వం ఏటా వడ్డీ చెల్లిస్తూ ఉండాలి. ఆ బాండ్ల గడువు కాలం తీరినప్పుడు ప్రభుత్వం పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి అవకాశం ఉంటుంది. వాటి గడువు కాలం తీరక ముందే ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీలకు పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి ఆస్కారం లేదు. ద్రవ్యలోటు ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వం అనేక రుణ సమస్యల్లో చిక్కుకుని ఉండడం కూడా ఇందుకు కారణం. ఈ స్థితిలో బాండ్ల గడువు కాలం పూర్తయ్యే వరకూ వడ్డీ చెల్లించడం తప్ప ప్రభుత్వానికి మార్గం లేదు. ఒకప్పుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా 9 వేల కోట్ల రూపాయలకు ఆయిల్‌ బాండ్లను జారీ చేసింది. అయితే, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాండ్ల మొత్తాన్ని తీర్చి వేసింది. అయితే, ఇదే యూపీఏ ప్రభుత్వం 2005-12 సంవత్సరాల మధ్య 1.44 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆయిల్‌ బాండ్లను జారీ చేసింది.
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ బాండ్లకు సంబంధించిన వడ్డీని చెల్లించడం జరుగుతోంది. “ఈ వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి లేకపోయి ఉంటే, ఈ ఇంధనాలన్నిటి మీదా ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడానికి అవకాశం ఉండేది” అని నిర్మలా సీతారామన్‌ గతంలోనే చెప్పారు. “గత ప్రభుత్వం భారీ మొత్తంలో ఆయిల్‌ బాండ్లను జారీ చేసి మమ్మల్ని సమస్యల్లో పడేసింది. ఆయిల్‌ బాండ్ల మీద వడ్డీ చెల్లించడం మాకు తలకు మించిన భారంగా మారింది” అని ఆమె అన్నారు. బాండ్లకు సంబంధించిన అసలు మొత్తంలో కూడా ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించగలుగుతోంది.ఇక వడ్డీ రూపేణా ఏటా 36 వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తోంది.ఆయిల్‌ బాండ్లకు 2026 లోపల మరో 1.33 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.

మరో మూడేళ్లు తప్పదు
విచిత్రమేమిటంటే, ఇంధనాల మీద ఎక్సైజ్‌ సుంకాల ద్వారా, పన్నుల ద్వారా కేంద్రం మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. వీటిని చెల్లించి ఈ ఆయిల్‌ బాండ్ల వ్యవహారం నుంచి బయటపడవచ్చు. కానీ, ఆయిల్‌ బాండ్ల జారీలో ఉన్న నిబంధనల ప్రకారం, 2026 నాటికి గానీ పూర్తి మొత్తం చెల్లించడానికి వీలు లేదు.అందువల్ల ప్రభుత్వం వడ్డీని, అసలులో కొంత భాగాన్ని మాత్రమే చెల్లిస్తూ ఉండాలి. అంతేకాదు, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి కారణాల వల్ల ప్రభుత్వం మొత్తం అసలును ఒకేసారిగా తీర్చలేని స్థితిలో ఉంది. అంతేకాదు, ప్రభుత్వం ఆహార భద్రత, వ్యాక్సినేషన్‌, ఉపాధి హామీ పథకం వంటి వాటి మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ఇంకా గడువు తీరని రుణాలను ఒక్కసారిగా తీర్చేయడం మీద ఖర్చు చేయడం అనేది ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ప్రాధాన్యం లేని అంశం.
ఇక కోవిడ్‌ విజృంభించినప్పుడు ముడిచమురు ధర విపరీతంగా పెరిగింది. దాంతో ప్రభుత్వం సబ్సిడీ మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇతర దేశాల్లో కూడా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా సరఫరా రేట్లు మించిపోవడం వంటివి కూడా ప్రస్తుతం చోటు చేసుకోవడం వల్ల ప్రభుత్వం మీద భారం పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం గ్యాస్‌ ధరను పెంచక తప్పడం లేదు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం భారీ మొత్తంలో ఆయిల్‌ బాండ్లను జారీ చేయకపోయి ఉంటే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద ఇంతగా ఆర్థిక భారం పడేది కాదు. ఇది తప్పనిసరి చెల్లింపు కావడంతో ఎన్నికల సమయం అయినప్పటికీ ప్రభుత్వం సాహసం చేయక, గట్టి నిర్ణయం తీసుకోక తప్పలేదు.
– ప్రొఫెసర్‌ ఎస్‌. నిరంజన రావు, విశ్రాంత ఆచార్యుడు (రాజనీతి శాస్త్రం)




సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News