దేశంలో గవర్నర్లను నియమించడమనేది వివాదాస్పదమైనా లేదా సంచలనాలనైనా సృష్టిస్తోంది. ఏ రాష్ట్రానికైనా కొత్తగా గవర్నర్‌ను నియమించడం తరువాయి, గవర్నర్ల వ్యవస్థ ఉండాలా, వద్దా, అవసరమా, కాదా అనే చర్చ ప్రారంభమవుతుంది. గత ఆదివారం కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించడం లేదా మార్చడం జరిగినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఇదే విధమైన చర్చ మొదలైంది. గవర్నర్లను నియమించడంలో పాలనా సౌలభ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ వ్యవస్థను శంకించడం జరుగుతోంది. నిజానికి ఇది కొత్త విషయమేమీ కాదు. రాజకీయాలే ప్రాధాన్యంగా గవర్నర్లను నియమించడం అనేది ఇందిరా గాంధీ హయాం నుంచీ జరుగుతోంది. గవర్నర్ల నియామకానికి సంబంధించి రాజ్యాంగం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నారా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం.
ఇంతకూ గత వారం కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను మార్చడంతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా మార్చారు. కొత్త గవర్నర్లలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సైనిక కమాండర్ కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది గవర్నర్లు రాజకీయ పాత్రలనే పోషిస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. జార్ఖండ్ పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో స్పష్టంగా కనిపించింది. ఈ రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉంటూనే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ, వివాదాస్పదంగా మారారు. అయితే, రాజకీయ రంగం నుంచి వచ్చిన వారి కంటే న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థల నుంచి వచ్చిన వారు ఎక్కువగా రాజ్యాంగానికే కట్టుబడి ఉండే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. సాధారణంగా ఈ న్యాయమూర్తులు, సైనికాధికారులు ప్రభుత్వాధినేతలకు, దేశాధినేతలకు, రాజకీయ నాయకులకు సన్నిహితం అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ.
అయితే, ఇక్కడ రాజకీయ నాయకులు, పాలకుల చిత్తశుద్ధినే శంకించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులను గవర్నర్లుగా నియమించడం ద్వారా న్యాయవ్యవస్థకు పాలకులు పంపిస్తున్న సందేశం ఏమిటన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. తమకు అనుకూలంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో వారికి రాజ్యాంగ పదవులు కట్టబెడతాం అనే ఎరను వేయడం జరుగుతోందా అన్న సందేహం ఎవరికైనా రాక మానదు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియమ్ వ్యవస్థతో వివాదం పేట్రేగుతున్న సమయంలో ఒక మాజీ న్యాయమూర్తికి గవర్నర్ పదవిని కట్టబెట్టడం ఒక విధమైన ఎర కావచ్చు లేదా పరోక్షంగా బెదరించడమూ కావచ్చు. ప్రస్తుతం దేశంలో ఇదే రకమైన చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులను నియమించే విషయంలో కొలీజియమ్ సిఫారసు చేసిన పేర్లపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తోంది. న్యాయమూర్తుల నియామకంలో తమకు పూర్తి స్థాయి అధికారాలు లేనప్పటికీ అటువంటి అధికారాలను ప్రయోగిస్తూనే ఉంది. అందువల్ల ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా మాజీ న్యాయమూర్తిని నియమించడంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని సందేహించాల్సి వస్తోంది.
కేంద్రం 2014లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించింది ఆ తర్వాత 2020లో మరో ప్రధాన న్యాయమూర్తిని రాజ్య సభ సభ్యత్వానికి ఎంపిక చేసింది. ఈ నియామకాలు వివాదాన్ని సృష్టించాయి కానీ, వారి వల్ల ఆ తర్వాత గవర్నర్లుగా వివాదాలేవీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం సాయుధ దళాలకు చెందినవారిని కూడా గవర్నర్ పదవులకు ఎంపిక చేయడంపై అనుమానాలు చెలరేగుతున్నాయి. కేంద్రం సాయుధ దళాల వారిని కూడా రాజకీయంగా ప్రలోభ పెడుతోందా అన్న అనుమానం కలుగుతోంది. అయితే, ఇందుకు అవకాశం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.
గవర్నర్ల వ్యవస్థ అనేది భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి వారసత్వంగా సంక్రమించింది. ఒక ప్రజాస్వామ్మ వ్యవస్థలో ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థకు తప్ప గవర్నర్ల వ్యవస్థకు చోటు ఉంటుందా అన్న విషయంపై రాజ్యాంగ సభలో ప్రముఖులంతా మల్లగుల్లాలు పడ్డారు. చివరికి కొంత అయిష్టంగానే, కొంత వైముఖ్యంతోనే దీనిని కొనసాగించడం జరిగింది, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య గవర్నర్ ఓ వారధిగా పని చేయడం మంచిదనే సదుద్దేశంతోనే ఈ వ్యవస్థను కొనసాగించడం జరిగింది. గవర్నర్లు సాధారణంగా అలంకార ప్రాయంగానే ఉండాలని, ఎప్పుడైనా చిక్కు సమస్య ఎదురైనప్పుడు మాత్రమే వీరి నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. అయితే, కొన్ని దశాబ్దాలుగా గవర్నర్ల వ్యవహార శైలిలో గణనీయంగా మార్పు చోటు చేసుకుంది. కేంద్రానికి, రాష్ట్రానికి వారధిగా ఉంటారనుకున్న గవర్నర్ల వల్లే కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. అంతే కాదు, ప్రజాస్వామ్య ప్రమాణాలు కూడా క్షీణించడం ప్రారంభమైంది.
కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఐక్యత, సయోధ్య, సామరస్యాలను పెంచాలని, ఇది దేశ శ్రేయస్సుకు మంచిదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. ఇదే తమ విజన్ అని కూడా పలు సందర్భాలలో పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాలు రాష్ట్రాలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా గవర్నర్లు తమ పాత్రను మార్చుకుంటుండడంతో ఇది ఎక్కువగా ఘర్షణవాదానికే దారి తీస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు సదుద్దేశాలే కావచ్చు. కానీ, గవర్నర్ పదవికి ఉన్న స్థాయిని, ఔన్నత్యాన్ని, గౌరవ మర్యాదలను ప్రభుత్వం తప్పని సరిగా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ఔన్నత్యాన్ని ఏ విధంగానూ కించపరచకూడదు, దిగజారనివ్వకూడదు. రాజకీయాలకు దూరంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన వ్యక్తులకు మాత్రమే ఇటువంటి పదవులను అప్పగించడం వల్ల ఈ పదవికి ఉన్న గౌరవం, ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తాయి.
– జి. రాజశుక