Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Gurram Jashuva: తమస్సును చీల్చిన కాంతి పుంజం - జాషువా

Gurram Jashuva: తమస్సును చీల్చిన కాంతి పుంజం – జాషువా

తెలుగు సాహిత్యాన్ని సాజామాజిక చైతన్యం వైపు నడిపించిన కవి

ఎంత కోయిల పాట వృథా యయ్యనో కదా
చిక్కు చీకటి వనసీమలందు
ఎన్ని వెన్నెల వాగులింకి పోయేనో కదా
కటిక కొండల మీద మిటకరించి
ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా
మురికి తిన్నెల మీద పరమళించి
ఎన్ని ముత్తెపు రాళ్లు భిన్నమయ్యెనో కదా
పండిన వెదురు జొంప ములలోన
ఎంత గంధవహన మెంత తంగేటి జున్ను
ఎంత రత్న కాంతి ఎంత శాంతి
ప్రకృతి గర్భమందు భగ్నమై పోయెనో
పుట్టరాని చోట పుట్టు కతన
తక్కువ కులంలో పుట్టడం వలననే కదా ఈ అవహేళ నలు అవమానాలు ఛీత్కారాలు అనుభవించాల్సి వచ్చిందని తన మనోవేదనను అభివ్యక్త పరిచిన మహాకవి గుర్రం జాషువా.
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సాజామాజిక చైతన్యం వైపు నడిపించిన కవులలో అగ్రగణ్యుడు విశ్వకవి గుర్రం జాషువా.1895 సెప్టెంబర్‌ 28న గుంటూరు జిల్లా విను కొండ మండలం చాట్రగడ్డ పాడు గ్రామంలో గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకోవడం వల్ల ఆ కుటుంబాన్ని ఆనాటి సమాజం చిన్న చూపు చూసింది. ఆ కారణంగా తనకు జరగని అవమానం లేదు. పడని అగచాట్లు లేవు, అలాంటి దుస్థితిని రూపుమాపడం కోసం జాషువా తన సాహిత్యం ద్వారా స్పృషించని అంశం లేదు. సంస్కరణ ఆయన కావ్య లక్ష్యం. తనకు సృజనాత్మక శక్తి ఎక్కువ. తనకిద్దరు గురువులని ఒకరు పేదరికం అయితే మరొకరు కుల-మత భేదమని అంటాడు. పేదరికం సహనాన్ని నేర్పితే కుల వివక్షత నాకు పట్టుదలను ఎదురించే తత్వాన్ని నేర్పిందంటాడు.
జాషువా ఎన్నో రచనలు చేసినప్పటికీ అందులో గబ్బిలం అనే ఖండకావ్యం అగ్రభాగాన నిలిచింది. పయనీర్‌ అనే ఆంగ్ల పత్రిక నిర్వహించిన ప్రసిద్ధ కావ్యాల మిలీనియం సర్వేలో ఎన్నుకోబడిన ఐదు మహా గ్రంథాలలో తెలుగు కావ్యాల్లో గబ్బిలం ప్రధానమైనది. ఈ కావ్యంలో గబ్బిలంతో తన బాధలను కాశీ విశ్వేశ్వరుడికి చెప్పమని అరుంధతి సుతుడు పంపించడం దీని ఇతివృత్తం. కాళిదాసు మేఘాన్ని సందేశ రాయబారిగా ఎంచుకున్నట్లు ఎవరైనా హంసను చిలుకను కోకిలను పావురాలను రాయబారిగా ఎంచుకుంటారు. కాని జాషువా గబ్బిలాన్ని సందేశ రాయబారిగా ఎంచుకోవడంలో ఆంతర్యం దాగి ఉంది. గబ్బిలానికి నిమ్న జాతి పోలికలు ఉన్నాయి. గబ్బిలం అశుభ సూచకమని సమాజం ఎప్పుడో వెలివేసింది. అది ఇంట్లో చేరితే అరిష్టమని దాని కూత కూడా వినరాదని సమాజం దాన్ని దూరం పెట్టింది. అలాగే నిమ్న జాతుల జీవితాలను కూడా బడి, గుడిలోకి వెళ్లకుండా సమాజం వెలివేసిందని నిరసనగా గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. చివరికి గబ్బిలానికైనా గుడిలోకి వెళ్లడానికి అనుమతి ఉందేమో కానీ నిమ్న జాతుల వారికి ఆ భాగ్యం లేదని నిరసిస్తూ నువ్వు నా జాతి పక్షివే గనుక నా బాధ నీవు మాత్రమే సరిగా అర్థం చేసుకోగలవు. అందుకే నువ్వు నా రాయబారివి అని కడగొట్టుబిడ్డతో పలికిస్తాడు జాషువా.
ఆలయమున నీవు వేలాడు వేళ శివుని చెవి నీకు కొం త చేరువుగానుండు, మౌని ఖగరాగ్ని పూజారి లేని వేళ, అప్పుడు విన్నవించు నా బాధలన్నీ, పూజారి చూస్తే గుడి మైల పడిందని నిన్ను నిందిస్తాడు, భగవంతున్ని ఉపవాసం పెడతారు. కాబట్టి పూజారి లేని వేళనే వెళ్ళమని గబ్బిలానికి సలహా ఇస్తాడు.
ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లాలో పుట్టిన గుర్రం జాషువా రాయబారాన్ని గుంటూరు నుండి కాకుండా తమిళనాడులోని తంజావూరులో ఊరు బయట ఉన్న ఒక పాడుబడిన పాకలో నుండి కాశీలో కొలువై ఉన్న విశ్వేశ్వరునికి విన్నవించమని దక్షిణ భారతదేశము నుండి ఉత్తర భారతదేశానికి తన సందేశాన్ని పంపిస్తాడు. అంటే ఒక ప్రాంతంలోని నిమ్న జాతుల అసమానతలే కాకుండా కన్యాకుమారి నుండి కాశీ వరకు యావత్‌ భారతదేశం అంతా విస్తరించి ఉన్న నిమ్నజాతుల అగచాట్లను తెలియజేసే ఉద్దేశమే.
సందేశ స్వీకర్తగా విష్ణువును ఎంచుకోకపోవడానికి గల కారణం విష్ణువు అలంకార ప్రియుడు, పాల సముద్రంలోను ఏడుకొండలపై ఉంటాడు కనుక అనగారిన వర్గాలకు అందుబాటులో ఉండడు. శివయ్య మాత్రం నిమ్న జాతి ప్రజలకు అందుబాటులో ఉన్న స్మశానంలో వెతికితే కనిపిస్తాడు. అభిషేక ప్రియుడు భోళా శంకరుడు భక్త సులభుడు, విభూతిని తోలును ధరించి కాటిలో కాపురం ఉండే శివునికే తన బాధలను చెప్పమని పంపించాడు గబ్బిలాన్ని.
జాషువా గారి సాహిత్యం గాంధేయవాదం, స్వాతం త్రోద్యమ ప్రభావం, మాక్సిజం ప్రభావం అంబేద్కర్‌ వాదం మరియు మహిళా సాధికారత కోసం తను పడిన తపన జాషువా రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
స్వాతంత్రోద్యమ ప్రభావం
1940లో రాసిన గబ్బిలం కావ్యం లో సర్వమానవ స్వేచ్ఛను కోరుకుంటాడు.
భోగులాహరించు భుక్తి కన్నుల చూసి పరమ పేదలు దుఃఖపడని చోటు
సాంఘికాచార పంచాస్య గర్జనమున బెదరక జ్ఞానంబు పెరుగు చోటు
జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కందక కళలు పెంపొందు చోటు…….
చెప్పగదమ్మ చూసి వచ్చితె వీవు
నిశ్చయంబుగా వాసముండెదను నేను.
ఎక్కడైతే మనసు స్వేచ్ఛగా విహరిస్తుందో కుల మతా లు లేని స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందగలిగే స్థలం ఉంటే చెప్పు నేను వెళ్తాను అంటాడు ఇందులో స్వాతంత్రోద్యమ భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అస్పృశ్యత శృంఖలాల నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చు చోటు కావాలంటాడు.
గాంధేయవాద ప్రభావం
లోకమోహన సబర్మతీ సమ్నునికిన్‌ కుమారుడను ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరింతున్‌ అంటూ తన రచనల్లో గాంధేయ వాదాన్ని ప్రదర్శిస్తాడు జాషువా. గాంధీజీ ఆంగ్లేయులతో అహింసా పద్ధతిలో పోరాడి నట్లు భారతదేశంలోని నిమ్న జాతుల సాంఘిక అసమాన తలను తొలగించడానికి తన సాహిత్యం ద్వారా అహింసా పద్ధతిలో పోరాటం చేసిన ధీరుడు. నా కవితా వధూటి వదనంబునెగాదిగా చూసి రూపు రేఖా కమనీయ వైఖరులను గాంచి భళీ భళీ అన్న వారే నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున కుమ్మినట్లగున్‌ పార్థివ చంద్ర వచింప సిగ్గగున్‌ అంటూ అహింసా పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తాడు.
మార్క్సిజం ప్రభావం
ముప్పు ఘటించి వాని కులమున్‌ కలిమిన్‌ కబలించి దేహమున్‌ పిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదం కంద కుండగా చెప్పులు కుట్టి జీవనం చేయును గాని నిరాకరింప లేదెప్పుడు అప్పుపడ్డది సుమీ భారతావని వీని సేవకున్‌ అంటూ ఉత్పాదక శక్తిని, కష్టపడే తత్వాన్ని ఫలితాన్ని ఆశించకుండా పని చేసే విధానాన్ని ప్రదర్శించాడు ఆ పరమ గర్భ దరిద్రుడు. జాషువా తన రచనల్లో ఏ మతాన్ని, ఏ దైవాన్ని దూషించలేదు. కేవలం వాటిలోని మూఢాచారాలను సాంఘిక అసమానతలను మాత్రమే నిరసించాడు.
అంబేద్కర్‌ ఇజం
కుల మతాలు గీసుకొన్న గీతల జొచ్చి పంజరాన గట్టు వడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగు లేదు విశ్వ నరుడ నేను అంటూ సమాజంలో ఉన్న కుల మతాల గోడలను కూకటి వేళ్లతో పెకలించడానికి సాహిత్యం ద్వారా తన దిక్కార స్వరాన్ని వినిపించడమే కాక కుల మతాలకు అతీతున్ని, సార్వ జనీన మానవున్ని అని ఎలుగెత్తి చాటాడు. నిమ్న వర్గాల కోసం సమాజంలో ఆత్మ గౌరవం కోసం కనీసం మనిషిని మనిషిగా నైనా చూసే మానవత్వం కోసం పరితపించాడు. ఇదే విషయాన్ని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కూడా మానవత్వ పరిపూర్ణత స్థాయిని సాదించుటకే మన ఈ యుద్దం అని తన ఉద్ఘాటించాడు.
గవ్వకు సాటిరాని పలు గాకుల మూకలవివేకము చేత, నన్నెవ్విది దూరినన్‌ నన్ను వరించిన శారద లేచిపోవునే పెళ్లి చేసుకున్న భార్య ఐనా విడాకులిచ్చి పోవచ్చునేమో కానీ నన్ను ఎవరూ ఏ విధంగా అవమానించినా నన్ను వరించిన శారద నన్ను వదిలిపోదు అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇది పిల్లల మర్రి పిన వీరభద్రుడు పలికిన వాణి నా రాణి అన్న మాటకు సారుప్యంగా ఉంది.
అంబేద్కర్‌ కోరుకున్నది కూడా కుల నిర్మూలనే కదా! తన కుల నిర్మూలన అనే గ్రంథంలోని భావాలే జాషువా రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట నలుగురు కుమారులటంచు విన్నాము గాని పసరము కంటే హీనుడు, మంద భాగ్యుడైన అయిదవ కులస్తుడెవరమ్మా సవిత్రి అని ప్రశ్నిస్తాడు.
మహిళా సాధికారత
జాషువా మహిళల సంక్షేమం కోసం వారికి జరిగే అన్యాయాల పట్ల నిరస గళాన్ని తన రచనల్లో వినిపించాడు. అప్పట్లో వచ్చిన కవుల రచనల్లో పురాణ మరియు స్త్రీ సౌందర్య వర్ణనలు చర్విత చర్వనాలు కాగా అందుకు భిన్నంగా జాషువా రచనలు జీవన చైతన్యంతో సామాజిక స్పృహతో మహిళా సాధికారత తపనతో నిండి ఉంటాయి.
అబల విద్యా పూర్ణయై తోడు రాకున్నన్‌ దేశము నిద్ర మేల్కొనునే అని చెప్తూ స్త్రీని అణిచి వేసినంత కాలం ఈ స్వాతంత్ర రథం బెత్తెడు కూడా ముందుకు జరగదని నొక్కి వక్కాణించారు. అంతేగాక ఏ సమాజం అయితే స్త్రీని జ్ఞానా నికి దూరంగా బంధీని చేస్తుందో ఆ సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు అంటాడు.
సాంఘిక మహాభూతంబు పెంగోరలం
దిరికింపబడి దుష్ట భర్తల కృపాహీనుల ప్రవృత్తుల్‌
హృదంతమున్‌ రంపపు కోత కోయ……
ఎలా భరిస్తున్నావమ్మా ధరాస్థలిన్‌
అంటూ పురుషాధిక్యత గల సమాజంలో స్త్రీ పడే బాధ లను ఆమె సహనాన్ని వర్ణించడం జరిగింది. జాషువా ఏదైతే మహిళా సాధికారత కోసం తన రచనల్లో ఆశించాడో దాన్ని అంబేద్కర్‌ గారు హిందూ కోడ్‌ బిల్లు రూపంలో తీసుకురావడం జరిగింది.
జాతీయ కవి జాషువా
జాషువా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన కవి కాదు. ఒక జాతీయ కవీశ్వరుడు. దక్షిణ భారత దేశంలో సుబ్రమణ్య భారతి వలె, ఉత్తర భారత దేశంలో ఠాగూర్‌ మరియు మైథిలి శరణ్‌ గుప్తా వలె జాషువా కూడా సర్వ మానవ సమానత్వాన్ని కోరుకొని మనిషి కేంద్ర బిందువుగా తన రచనలన్నింటినీ కొనసాగించాడు. తను ఏది చేసినా ఏది రాసిన ఒక్క ప్రాంతానికో ఒక మతానికో పరిమితమైన రచనలు చేయలేదు. దేశ ప్రజల బాధలే తన బాధలుగా భావించి సర్వ మానవ సౌభ్రాతృత్వం మానవత్వపు పరిమళాలు ఈ నేలపై పరిఢవిల్లాలని కోరుకున్నాడు.
ముప్పైది మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం
అప్పుబడ్డది సుమీ భరతావని వీని సేవకున్‌ అనడంలో జాతీయవాదం మనకు కనిపిస్తుంది. అందుకే జాషువా జాతీయ కవిగా కీర్తించబడ్డాడు. ఆయన జీవితమే తనకు కథా వస్తువు. వేదనాభరిత జీవిత అనుభవంతో అరుంధతీ సుతుండైన కడగొట్టుబిడ్డడు క్షుధానల దగ్ధమూర్తి యొక్క ఆవేదన ఆక్రందన, ఆవేశం, ఆర్తి, ప్రతి ఘటన, నిజాయితీ, కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. బుద్ధుడు గాంధీ అంబేద్కర్‌లు నడిచిన వజ్ర మార్గంలో వెళ్లే నేనొక అజ్ఞాత ప్రవా సిని అంటాడు. సాంఘిక అసమానతల కారణంగా ఎక్క డైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అక్కడే తన పాండితీ ప్రకర్ష చేత భళీ భళీ అని నీరాజనాలందుకున్న నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. అంతేగాక వీర శతావధాని, సత్కవీశుడు, ఆంధ్రుల శుభ రక్త నాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండైన చెల్లపిళ్ల వెంకటశాస్త్రి గారిచే తన ఎడమ కాలికి గండపెండేరము తొడిగించుకున్న మధుర శ్రీనా ధుడు మన గుర్రం జాషువా. వీటితో పాటు ఆంధ్ర యూని వర్సిటీ వారిచే కళాప్రపూర్ణ, కేంద్ర ప్రభుత్వం వారిచే పద్మ భూషణ్‌, ఇంకా కవితా విశారద,కవికోకిల వంటి ఎన్నో సత్కారాలు, కనకాభిషేకాలు, గజారోహణలు పొందిన నవ యుగ కవితా వైతాళికుడు. వీరు 1971 జులై 24 గుంటూరులో పరమపదించారు.
రాజు మరణించెనొక తార రాలిపోయే
సుకవి మరణించెనొక తార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహముల యందు
సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అని తనే చెప్పినట్లుగా తెలుగు సాహిత్య వినీలాకాశంలో జాషువా యెక్క యశశ్చంద్రికలు ఆ చంద్రతారార్కం ప్రకాశిస్తూ ఉంటాయి.

  • కొమ్మాల సంధ్య
    9154068272.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News