Thursday, November 21, 2024
Homeఓపన్ పేజ్BJP Haryana victory: బీజేపీకి సరికొత్త రాజకీయ బలం

BJP Haryana victory: బీజేపీకి సరికొత్త రాజకీయ బలం

దేశ రాజకీయాల్లో మార్పు..

హర్యానా, జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని పాలక బీజేపీకి అగ్ని పరీక్ష లాంటివని, వీటి ఫలితాలతో బీజేపీ పాలన పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయం ఎట్లా ఉందన్నది తేలిపోతుందని పదే పదే ప్రకటించిన కాంగ్రెస్‌ నాయకులకు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తీరని ఆశాభంగం కలిగించాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న హర్యానాలో ఆ పార్టీ చప్పగా చతికిల పడిపోగా, జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల్లో సైతం ఆరు స్థానాలకు, 11 శాతం ఓట్లకు పరిమితం కావలసి వచ్చింది. నిజానికి ఈ ఎన్నికలు ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్‌ గాంధీ పనితీరుకు ప్రజలిచ్చిన తీర్పుగా కూడా కనిపిస్తోంది. అనేక కష్టనష్టాలు, ఆటంకాలు, అవాంతరాల మధ్య బీజేపీ హర్యా నాలో ఘన విజయం సాధించగా, కాశ్మీర్‌ లో కూడా అది తన పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచుకోగలిగింది. హర్యానాలో పరాజయం పాలు కావడం కాంగ్రెస్‌ పార్టీకి ఒక అశనిపాతం లాంటిది. కాశ్మీర్‌ లో కూడా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ కొద్దిపాటి విజ యాలైనా సాధించగలిగింది.
హర్యానా ఓటమిని కాశ్మీర్‌ ఏ విధంగానూ భర్తీ చేయలేకపోయింది. వాస్తవానికి శాసనసభ సీట్లపరంగా హర్యానా, కాశ్మీర్‌ రాష్ట్రాల్లో 90 స్థానాల చొప్పున ఉన్నప్పటికీ, కాశ్మీర్‌ విజయం కంటే హర్యానా విజయమే అటు కాంగ్రెస్‌ పార్టీకి, ఇటు బీజేపీకి అత్యంత ముఖ్య మైనది. తాము కోల్పోయిన రాష్ట్రాల్లో గానీ, జాతీయ స్థాయిలో గానీ తాము తిరిగి అధికారంలోకి రాగలుగుతామా అన్న శంక కాంగ్రెస్‌ లో ప్రారంభం కావడానికి ఈ రెండు ఎన్నికలు అవకాశం కల్పించాయి. పదేళ్లుగా హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. అయితే, బీజేపీ ఇదివరకటి కంటే ఎక్కువ స్థానాలతో అక్కడ మూడవసారి కూడా అధికారంలోకి రావడం ఆ పార్టీ నాయకత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత శాసనసభలో బీజేపీకి సరైన మెజారిటీ కూడా లభ్యం కాలేదు. ఈసారి అత్యధిక స్థానాలతో సొంతంగా అధికారంలోకి వచ్చింది. పైగా ఓట్ల శాతం కూడా ఈసారి బాగా పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతం కూడా కొద్దిగా పెరిగినప్పటికీ, సీట్ల సంఖ్య మాత్రం బాగా తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
దుష్యంత్‌ చౌతాలా నాయకత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి పోలయిన ప్పటికీ, దాని వల్ల పెద్దగా ఉపయోగం కలగలేదు. బీజేపీ సరైన సమయంలో ముఖ్యమంత్రిని మార్చడమే కాకుండా, వివిధ వర్గాలను కూడగట్టడంలో సఫలీకృతురాలైంది. అంతేకాక, ఈసారి నరేంద్ర మోదీ హర్యానా ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా పాల్గొనకపోయినప్పటికీ ఆయన మంత్ర దండం పనిచేసింది. పార్టీలో కుమ్ములాటలు, పేలవమైన ఎన్నికల వ్యూహాలు, లేనిపోని దుష్ప్ర చారాలు కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీశాయని హర్యానాకు చెందిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, రిజర్వేషన్లకు స్వస్తి చెబుతుందని రాహుల్‌ గాంధీ తదితరులు ఇదివరకు ఎన్నికల్లో చేసిన ప్రచారం ఈసారి హర్యానాలో పని చేయ లేదని కూడా వారు విశ్లేషించారు. హర్యానా, కాశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్‌ శాసనసభల ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉంది. దేశ రాజకీయాల మీద కూడా వీటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ ప్రభావం ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి ఏమంత అనుకూలంగా ఉండకపోవచ్చు.
జమ్మూ కాశ్మీర్‌ శాసనసభ ఎన్నికల్లో అసలు సిసలు విజేత నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ. మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పి.డి.పి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీ ఇక్కడ విజయం సాధించే అవకాశం లేకపోయినప్పటికీ, తన పరిస్థితిని మెరుగుపరచుకోవడం ఒక విధంగా సానుకూల ఫలితమే. నామినేటెడ్‌ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని భావించిన బీజేపీకి ఇక్కడ ఆశాభంగం తప్పలేదు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించింది. అయితే, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది కానీ, పాలన ఉండకపోవచ్చు. ఇక్కడ అధికారాలన్నీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల్లోఉన్నాయి. అంటే పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఇక నుంచి ఇక్కడ రాజకీయాల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడం, అందులో అత్యధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం మాత్రమే ప్రస్తుతానికి శుభ పరిణామం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News