ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిలో భారతదేశ స్థానం చూసినవారికి తప్పకుండా తీవ్ర అసంతృప్తి, మనోవేదన కలుగుతాయి. మొత్తం 193 దేశాలలో భారత్ స్థానం 134 దగ్గర ఉండడం అనేది ఏ విధంగానూ అభిలషణీయం కాదు. 2021లో 135వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 134వ స్థానానికి రావడం కూడా ఏమంత ఆనందించదగ్గ విషయం కాదు. పైగా, 78వ స్థానంతో శ్రీలంక, 75వ స్థానంలో చైనా ఇంతకన్నా మెరుగైన స్థానంలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విచిత్రమేమిటంటే, భారత్ మానవాభివృద్ధిలో భూటాన్, బంగ్లాదేశ్ ల కంటే కూడా బాగా వెనుకబడి ఉంది. పాకిస్థాన్, నేపాల్ దేశాల కంటే మాత్రమే భారత్ కాస్తంతమెరుగైన పరిస్థితిలో ఉంది. మొత్తం మీద ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక భారతదేశానికి మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశంగా పరిగణించింది. ఇది అధ్వాన స్థాయి కన్నా కాస్తంత ఎక్కువ. ఈ మానవాభివృద్ధి సూచి నివేదిక ప్రకారం, దేశంలో సగటు ఆయుర్దాయం 67.2 నుంచి 67.7కు పెరిగింది. పాఠశాల విద్య శాతం కూడా 12 నుంచి 12.6కు పెరిగింది. సగటు తలసరి స్థూల జాతీయాదాయం 6,542 డాలర్ల నుంచి 6,951 డాలర్లకు పెరిగింది. అయితే, ఇవన్నీ కొద్దిపాటి మెరుగుదలలు మాత్రమే.
సగటు మనిషి జీవన ప్రమాణాల్లో అతి కొద్ది మార్పే చోటు చేసుకున్నందు వల్ల, భారత దేశం ఎంతగా అభివృద్ధి సాధించినా ప్రయోజనం లేకుండా పోతోంది. దేశంలో సరైన విధంగా మానవాభివృద్ధి జరిగితే తప్ప 2027 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగా లన్న లక్ష్యానికి అర్థం ఉండదు. భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అయినందువల్ల ఈ మానవాభివృద్ధి స్థానం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత దేశం తమ ప్రజల అభ్యున్నతికి, అభివృద్ధికి మరింత పాటుపడాల్సిన అవసరాన్ని ఈ మానవాభివృద్ధి సూచి సూచిస్తోంది. 1990, 2022 సంవత్సరాల మధ్య భారతదేశ మానవాభివృద్ధిలో బాగా మెరుగుదల ఉంటే ఉండవచ్చు. కానీ, దేశం ఇంకా సంతృప్తికర స్థాయికి చేరుకోలేదు.
పైగా, దేశంలో అనేక విధాలుగా అసమానతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పేదలు, సంపన్నుల మధ్య అంతరం విపరీతంగా పెరుగుతోంది. అంతేకాదు, కార్మిక శక్తిలో లింగ వివక్ష మరీ ఎక్కువగా ఉన్నట్టు మానవాభివృద్ధి తెలియజేసింది. దేశంలోని మొత్తం కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కేవలం 28.3 శాతమే కాగా, పురుషుల భాగస్వామ్యం 76.1 శాతమని ఈ సూచి వెల్లడించింది. మహిళల భాగస్వామ్యం, సాధికారికత పెరగనంత కాలం మానవాభివృద్ధి అనేది ఏమాత్రం సాధ్యం కాదు. ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ, రాజకీయం గానూ, సామాజికంగానూ మహిళా భాగస్వామ్యం ఎంత పెరిగితే దేశానికి అంత మంచిది. సమాజంలోని బలహీనవర్గాల కోసం లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో పథకాలు చేపడుతున్న మాట నిజమే కానీ, వాటిని అమలు చేస్తున్న విధానం మాత్రం లోపభూయిష్టంగా ఉంది. మానవాభివృద్ధిలో అత్యంత కీలక పరామితులైన విద్య, ఆరోగ్యాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఈ ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచి నివేదిక ప్రపంచంలోని ఇతర దేశాలతో భారతదేశాన్ని పోలుస్తూ రూపొందించడం జరిగింది. ఇందులో చేసిన సూచనలు ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు చాలావరకు భారతదేశానికి కూడా వర్తిస్తాయి. ఒక్క భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరుగుతున్నాయి. లింగ వివక్ష తెరిపి లేకుండా కొనసాగుతోంది. ప్రపంచంలోని పేద, సంపన్న వర్గాల మధ్య అసమానతలను తగ్గించడానికి రెండు దశాబ్దాల పాటు కృషి జరిగింది కానీ, ఇప్పుడు ఆ కృషి ఆగిపోవడమే కాకుండా, ఈ తేడాను పెంచడానికి కృషి జరుగుతోందన్న అనుమానం కూడా కలుగుతోంది. ప్రపంచ దేశాల ప్రాధాన్యాలు మారిపోతుండడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, డిజిటలీకరణ, పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు వంటి విషయాల్లో భారతదేశం ఇతర దేశాల కంటే చాలావరకు మెరుగ్గా ఉన్నప్పటికీ, వాటి ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదని ఈ నివేదిక తెలియజేసింది. ఈ నాలుగు అంశాల మీద ప్రపంచ దేశాలుదృష్టి కేంద్రీకరించని పక్షంలో ప్రభుత్వాలు, వాటి పాలన మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోవడమే కాకుండా, అనేక రకాల సంక్షోభాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.
HDI India @ 134 rank: మానవాభివృద్ధిలో అధ్వాన స్థానం
మన కంటే చైనా, భూటాన్, బాంగ్లాదేశ్ బెటరా?