Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్KCR in problems: సమస్యల సముద్రంలో కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరి

KCR in problems: సమస్యల సముద్రంలో కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరి

అందరి చూపు కేసీఆర్ ఫ్యామిలీ వైపు

సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా అధికారం నుంచి దిగిపోయినప్పుడు గవర్నర్‌ను స్వయంగా కలిసి రాజీనామా లేఖను ఇవ్వడం పరిపాటి. ఇది ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన విషయం. అయితే, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్‌ కుమార్‌తో తన రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసైకు పంపడం జరిగింది. రాజీనామా లేఖను పంపించిన తర్వాత ఆయన హైదరాబాద్‌ నగర శివార్లలోని తన ఫామ్‌ హౌస్‌ దిశగా దూసుకు పోయారు. గతంలో అయితే ఆయన తన ఫామ్‌ హౌస్‌కు వెడుతున్నప్పుడు వెనుక 20 కార్ల బలగం అనుసరించేది. ఈసారి మాత్రం రెండు కార్లు మాత్రమే అనుసరించాయి. ఒక్క నిమిషంలో తన ప్రాధాన్యం, ప్రాభవం గాలికి కొట్టుకుపోతాయని, తమ తల రాతలు రాసేది ప్రజలేనని తెలిసి కూడా విపరీతమైన అహంకారాన్ని, నియంతృత్వ ధోరణులను ప్రదర్శించి, ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఆయన ఈ విధంగా భంగపడ్డారనే అభిప్రాయం ఆ సమయంలో ఆయనను చూసినవారెవరికైనా కలుగుతుంది.
విచిత్రంగా, ఆయన కామారెడ్డి నియోజకవర్గంలో ఒక సాదా సీదా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం నిజంగా ఆశ్చర్యకర విషయం. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఒక సాధారణ అభ్యర్థి కారణంగా తల కిందులు కావడం, నిష్ఫలం కావడం విధి వైచిత్రాన్నే సూచిస్తుంది. అంతేకాదు, ఆయన పార్టీ ఆయన కంటే చిన్న వాడైన రేవంత్‌ రెడ్డి చేతిలో ఓడిపోవడం కూడా ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌ పార్టీని రెండు దఫాలు తిరస్కరించడం జరిగింది. ఆ పార్టీకి రాష్ట్రంలో నామరూపాలు కూడా ఉండవని భావించడం జరిగింది. అటువంటి పార్టీ కేసీఆర్‌ వంటి ఉద్దండ రాజ కీయ దిగ్గజాన్ని తేలికగా తీసిపారేయడం చిన్న విషయం కాదు. కేసీఆర్‌ను ఆయన ఫామ్‌ హౌస్‌లో కలుసుకున్న కొందరు పార్టీ ప్రముఖులు ఆయన బాగా నిస్సత్తువగా, నిస్త్రాణంగానే కాక, అపనమ్మకంతో కూడా ఉన్నట్టు చెప్పారు.
ఆత్మపరిశీలన అవసరం
అనేక పోరాటాల ద్వారా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన వ్యక్తిని, పది పన్నెండు తిరుగులేని సంక్షేమ పథకాలతో తమ జీవితాలనే మార్చేసిన వ్యక్తిని తెలంగాణ ప్రజానీకం ఈ విధంగా ఎలా పక్కన పెట్టారన్నది అంతు బట్టని విషయం. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అటు కేంద్రాన్ని, ఇటు ప్రధాన ప్రతిపక్షాన్ని ధిక్కరించిన, దుర్భా షలాడిన, అవమానించిన వ్యక్తి ఇప్పుడు సాధారణ శాసన సభ్యుడిగా మారిపోవడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన ఒకటి రెండు రోజులకే ఆయన ఓ అర్ధరాత్రి వేళ తన ఫామ్‌ హౌస్‌లో కాలుజారి పడడం, తుంటి ఎముక విరగడం, నడవడానికి కూడా ఇబ్బంది పడడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో కుప్ప కూలిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్‌.ఎస్‌) ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. డాక్టర్ల సలహా మీద ఏడెనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిన కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనగలరా అన్నది ఆయన పార్టీ శ్రేణులను తొలిచేస్తున్న ప్రశ్న.
ఇప్పుడు కేసీఆర్‌ ముందు రెండు ప్రధాన సవాళ్లు నిలబడి ఉన్నాయి. ముందు ఆయన పార్టీని పటిష్టం చేయాల్సి ఉంటుంది. తర్వాత లోక్‌ సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి, ఎన్నికల్లో పరాజయం పాలయిన తర్వాత ఆయన పార్టీ కనీవినీ ఎరుగని విధంగా బలహీనపడింది. దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. మొదటి నుంచి కూడా కె.సి.ఆర్‌ గానీ, ఆయన కుమారుడు కె. తారక రామారావు గానీ, ఆయన మేనల్లుడు హరీశ్‌ రావు గానీ పాలనా వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడమే జరిగింది కానీ, పార్టీ వ్యవహా లను అంతగా పట్టించుకో లేదని పార్టీ నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన ఎక్కువగా తెలంగాణ సెంటిమెంటునే తన అస్త్రంగా చేసుకున్నారు. సరైన పార్టీ వ్యవస్థ లేకుండానే, పటిష్టమైన పునాదులు లేకుండానే ఆయన, ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీచేసి, తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తమ శాసనసభ్యులకే పార్టీ వ్యవహారాలను వదిలేశారు. ఈ శాసనసభ్యుల్లో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చినవారే కావడం వల్ల పార్టీ పట్ల వారిలో పెద్దగా మమకారం కనిపించలేదు. వారు ఏ కారణంగా నైనా పార్టీని వదిలి వెళ్లే పక్షంలో పార్టీ కుప్పకూలిపోవడం ఖాయమన్న పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే 119 సభ్యుల శాసనసభలో పార్టీ సభ్యుల సంఖ్య 39కి పడి పోయింది.
పోటీపడడం కష్టమే!
ప్రస్తుతం తెలంగాణలోని 17 లోక్‌ సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు 9 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీకి 3, బీజేపీకి 4, మజ్లిస్‌ పార్టీకి ఒక స్థానం ఉన్నాయి. ఈసారి లోక్‌ సభ ఎన్ని కలు ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే జరిగే అవకాశం ఉందని, శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిం చడంతో కాంగ్రెస్‌ పార్టీ, దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం ఉండడంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ముఖాముఖీ తలపడడం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బాగా బలహీనపడి ఉన్న బీఆర్‌ఎస్‌ లోక్‌ సభ ఎన్నికల నాటికి పూర్తిగా కోలుకునే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. 2018 నాటి శాసనసభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల ఓట్ల శాతం బాగా పెరిగింది. అయితే, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒడిదుడుకులనేవి
సహజమనే విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఓటమిని ఆయన సహజమైన పరిణామంగా తీసుకోరు. ఆయన పోరాడడం జరుగుతుంది. ఆయనలో పోరాట పటిమ ఇంకా అంతరించి పోలేదు.
రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా అవతరించాలన్నది ఆయన ధ్యేయం. ఈ ధ్యేయాన్ని లేదా లక్ష్యా న్ని నెరవేర్చుకోవాలన్న పక్షంలో ఆయన రాష్ట్రంలో మొత్తం లోక్‌ సభ స్థానాలను, పొరుగున ఉన్న మహారాష్ట్రలో కూడా ఒకటి రెండు స్థానాలను గెలుచుకుని, జాతీయ స్థాయిలో ఒక బలమైన శక్తిగా అవతరించాల్సి ఉంటుంది. పార్టీ బలహీనపడుతుండడం, ఆయన అనారోగ్యం వంటి కారణాల వల్ల ఈ లక్ష్యం ఈ ఎన్నికల్లో నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలోనే పార్టీని పటిష్టంగా ఉంచలేక పోతున్న స్థితిలో పార్లమెంటు ఎన్నికల మీద దృష్టి పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచి, అధికారా నికి వచ్చి ఉంటే పార్లమెంటు ఎన్నికలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయేవి. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్‌ వ్యతిరేక వర్గాలకు అవకాశాలు ఉండడం లేదు. బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా సిద్దపడడం లేదు.
దెబ్బ మీద దెబ్బ
మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందంగా బీఆర్‌ఎస్‌ పార్టీని మరో రెండు కీలక సమస్యలు కూడా చుట్టుముట్టాయి. ఇందులో ఒకటి కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్టు కాగా, రెండవది పార్టీ నుంచి ఇతర పార్టీలకు సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా వలస వెడుతుండడం. కవితను ఢిల్లీ మద్యం కేసులో ఇ.డి అరెస్టు చేయడం పార్టీకి అశనిపాతం అయింది. పార్టీని అవినీతి కుంభకోణాలు చుట్టుముడుతున్నాయి. కాళేశ్వరం వంతెన కూలడంతో సహా అనేక అవినీతి కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్‌, కేటీఆర్‌లను కూడా అరెస్టు చేసే అవకాశముందంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు జరగడానికి రెండు నెలల ముందు కవిత అరెస్టు జరగడం పార్టీని బాగా కుంగదీసింది.
మరో ఆందోళనకర విషయం పార్టీ నుంచి పలువురు సీనియర్‌ నాయకులు నిష్క్రమించడం. పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బయటికి వెళ్లిపోవడం గమనించిన వారికి పార్టీ ఉంటుందా, మటుమాయం అవుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. 2014, 2023 సంవ త్సరాల మధ్య బీఆర్‌ఎస్‌ ఫిరాయింపులను వీలైనంతగా ప్రోత్సహించింది. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీల నుంచి 38 మంది శాసనసభ్యులను తమ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. దీని ఫలితంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, కాంగ్రెస్‌ పార్టీ బాగా బలహీనపడింది. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష సభ్యులను తమ వైపు లాక్కోవడం అనేది చాలా ఎక్కువగానే జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అదే పనిలో నిమగ్నమై ఉంది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 64 మంది సభ్యులతో, అంటే అతి తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చినందువల్ల ఈ పార్టీకి మరి కొందరు సభ్యుల అవసరం ఉంది. ఫలితంగా దాని దృష్టి బీఆర్‌ఎస్‌ మీద పడింది.
కాంగ్రెస్‌ పార్టీ తలచుకుంటే బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులతో పాటు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు సైతం తమ పార్టీ లోకి ఫిరాయించే అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్‌ ఇటీవల ఆస్పత్రిలో ఉండగా బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు సమావేశమై కేసీఆర్‌ను శాసనసభలో తమ నాయకుడుగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తానికి, తమ పార్టీని పటిష్టంగా ఉంచడమనేది కేసీఆర్‌కు ఇప్పుడు ప్రధాన కర్తవ్యంగా మారింది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News