మలయాళ సినిమా అంటే వాస్తవికతకు పెట్టింది పేరు. నిజజీవితంలో కనిపించే పాత్రలు, వాతావరణమే వాటిలో ఉంటుంది తప్ప.. భారీ సెట్టింగులు, పెద్ద పెద్ద ఫైటింగులు, హీరో-హీరోయిన్ల మధ్య డ్రీమ్ సాంగులు ఇలాంటివి పెద్దగా కనిపించవు. చాలామంది హీరోలు లుంగీల్లోనే కనిపిస్తారు. హీరోయిన్లు కూడా సర్వసాధారణమైన పంజాబీ డ్రస్సులో, కాటన్ చీరలో కట్టుకుని ఉంటారు. ఇదంతా మనకు తెరమీద కనిపించే దృశ్యం.
కానీ, కాస్త తెరవెనక్కి వెళ్లి చూస్తే.. దాదాపుగా అన్ని పరిశ్రమల్లో ఉన్నట్లుగానే ఆ సినీ పరిశ్రమలోనూ అంతులేని అరాచకాలు ఉన్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ సినీలోకంపై పడింది. ఆ కమిటీలో ప్రముఖ తెలుగు సీనియర్ నటి ఊర్వశి శారద కూడా ఉండటం మనకు మరో విశేషం. నిజానికి 2019లోనే హేమ కమిటీ తన నివేదికను సమర్పించేసింది. కానీ, నాలుగేళ్లకు పైగా కేరళ ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టేసింది. ఇందులో అత్యంత సున్నితమైన సమాచారం ఉందని, పలువురు నటీనటుల పేర్లు కూడా ఉన్నాయని, అందువల్ల దాన్ని బయటపెట్టడం వారి వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుందని చెబుతూ ఆపేశారు. కానీ, ఎట్టకేలకు కోర్టులలోను, కేరళ రాష్ట్ర సమాచార కమిషన్‌లోను అనేక పోరాటాలు చేసిన తర్వాత ఎట్టకేలకు బాహ్యప్రపంచానికి ఇది అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చిచ్చు రేగింది. తమిళ సినీపరిశ్రమ కోలీవుడ్‌లో కూడా ఇవే తరహా ఇబ్బందులు, క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఉన్నాయని సనమ్ శెట్టి అనే నటి నిర్భయంగా బయటపెట్టింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో సైతం దర్శకులు చెప్పిన పని చేయలేదని తనకు అవకాశాలు ఇవ్వని విషయాన్ని మంచు లక్ష్మి కూడా తేటతెల్లం చేసేశారు. మోహన్ బాబు కుమర్తె అనే బ్రాండ్ ఉన్నా కూడా ఆమెకు కూడా ఇబ్బందులు తప్పలేదంటే తళుకుబెళుకుల సినీలోకం వెనక ఉండే చీకటి కోణం ఏంటన్నది ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.
ఏడెనిమిదేళ్ల క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం తీవ్రంగా వచ్చింది. చిన్నతనం నుంచి పెద్దయ్యే వరకు వివిధ దశల్లో తమపై జరిగిన అఘాయిత్యాలను ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు మహిళలు బయటపెట్టారు. న్యూయార్క్ నగరానికి చెందిన తరానా బుర్కే అనే మహిళ తనకు ఎదురైన లైంగిక వేధింపులు, లైంగిక దాడి గురించి 2006లో తొలిసారి బయటపెట్టారు. అప్పుడు అలాంటి అనుభవాలే ఇతరులకూ ఎదురై ఉంటాయని భావించి, అందరూ దీన్ని ధైర్యంగా బయటపెట్టాలని, ఆ దుర్మార్గులను బట్టబయలు చేయాలని పిలుపునిస్తూ మీటూ అనే హ్యాష్ ట్యాగ్ ప్రారంభించారు. తాము ఒంటరివాళ్లం కామని, తమకు తోడుగా ఈ ప్రపంచం ఉందని అందరికీ అర్థం కావాలన్నదే దీని ఉద్దేశం. ఆ తర్వాతి కాలంలో హార్వే వెయిన్‌స్టైన్ అనే అమెరికన్ సినీ నిర్మాత చేసిన ఆగడాలపై 2017లో ఒక్కసారిగా అలైసా మిలానో, ఇతర సినీనటులు గళమెత్తారు. అప్పుడే ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో కూడా పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ సినీ, టీవీ పరిశ్రమల్లో ఉన్నవాళ్లు ధైర్యంగా తాము ఎదుర్కొన్న విషయాలు చెప్పారు.
2017 ఫిబ్రవరిలో దిలీప్ అనే హీరో ఒక ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి.. కదులుతున్న కారులో ఆమపై అత్యాచారం చేయడంతో మలయాళ చిత్రసీమ అట్టుడికింది. రాష్ట్రమంతా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అఆలగే ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ అనే బృందం గట్టిగా డిమాండు చేయడంతో కేరళ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘాన్ని నియమించింది. తెలుగు సీనియర్ నటి ఊర్వశి శారదతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి, కేరళ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేసిన కేబీ వల్సల కుమారిని ఇందులో సభ్యులుగా నియమించారు. ఆ కమిటీ నిజానికి చాలా తీవ్రంగానే శ్రమించింది. కొన్ని వందల మందిని విచారించింది. అందులో కేవలం నటీమణులే కాదు.. సినిమా రంగంలోని అన్ని విభాగాలకు చెందిన వాళ్లు ఉన్నారు. వారితోపాటు అగ్రశ్రేణిలో ఉన్న పలువురు హీరోలను, ఇతర నటులను కూడా విచారించారు. ఆ ప్రక్రియలో కమిటీకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీసం స్టెనోగ్రాఫర్లను కూడా ఇవ్వకపోవడంతో వాళ్లకు వాళ్లే నివేదిక సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. అలాగే, సినీపరిశ్రమలో పనిచేసేవాళ్లకు సమయం చాలా ముఖ్యం కావడంతో, వాళ్లకు ఖాళీ దొరికినప్పుడే వీళ్లు పనిచేయాల్సి వచ్చేది. కమిటీ సభ్యుల్లో శారద చెన్నైలోను, వల్సలకుమారి తిరువనంతపురంలోను సెటిల్ అయ్యారు.కానీ, కమిటీ కార్యాలయం మాత్రం కొచ్చిలో ఉండేది. ఎలాగోలా నానా తిప్పలు పడుతూ ఎవరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్లి పని పూర్తిచేసుకున్నారు.
సినీపరిశ్రమలో మహిళలు పనిచేసే అవకాశం ఉన్న విభాగాలను చూసినప్పుడు… నటీమణులు, నిర్మాతలు, జూనియర్ ఆర్టిస్టులు, దర్శకత్వ విభాగం, సినిమాటోగ్రాఫర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, గాయనిలు, ఎడిటింగ్ విభాగం, పాటల రచన, పీఆర్వోలు, డాన్సర్లు, డాన్స్ కొరియోగ్రాఫర్లు, స్టూడియో సిబ్బంది… ఇలా పలు రకాల విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారు.
నివేదికలో ఒక అభిప్రాయానికి రావడానికి ముందుగా తాము పలువురు నటీనటులు, పురుషులు, మహిళలందరి సాక్ష్యాలు నమోదు చేసినట్లు జస్టిస్ హేమ కమిటీ తమ నివేదికలోని 25వ పేజీలోనే స్పష్టం చేసింది. మొత్తం 235 పేజీలతో అత్యంత సమగ్రంగా ఈ నివేదికను ఆ కమిటీ రూపొందించడం విశేషం. ప్రధానంగా 17 అంశాలను ఆ కమిటీ గట్టిగా ఎత్తిచూపించింది. అందులో…
- సినీరంగంలోకి ప్రవేశించాలన్నా, ఆ తర్వాత కూడా సినిమాల్లో పనిచేసే అవకాశం కావాలన్నా పక్కలోకి రావాలని డిమాండ్ చేయడం.
- పని ప్రదేశాలు, ప్రయాణ సమయాలు, నివాస ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు
- లైంగిక కోరికలకు ఎదురుతిరిగితే మహిళలపై తీవ్రస్థాయిలో వేధింపులు, చిత్రహింసలు
- సినిమా సెట్లలో కనీసం టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు కూడా కల్పించకుండా మహిళల ప్రాథమిక హక్కులు హరించడం
- పని ప్రదేశాలు, ప్రయాణ సమయాలు, నివాస ప్రాంతాల్లో మహిళలకు కొరవడుతున్న భద్రత
- సినీపరిశ్రమలోని వివిధ విభాగాల్లో పని చేయనివ్వకుండా అక్రమంగా నిషేధం.
- అలా నిషేధం విధిస్తామంటూ బెదిరించి, నోరు ఎత్తకుండా మూయించడం
- పరిశ్రమలో పురుషాధిక్యం, లింగపరమైన వివక్ష సినీపరిశ్రమలో క్రమశిక్షణరాహిత్యం. విపరీతంగా తాగడం, డ్రగ్స్ వాడకం, పనిప్రదేశంలో అసభ్య ప్రవర్తన పని ప్రదేశాలతో పాటు ఫోన్లు చేసి ఎక్కడున్నా కూడా అసభ్యంగా మాట్లాడడం, దారుణమైన కామెంట్లు చేయడం
- ఉద్యోగులకు, యజమానికి మధ్య పని విషయంలో సరైన కాంట్రాక్టులు, ఒప్పందాలు లేకపోవడం ఇస్తామని అంగీకరించిన పారితోషికం కూడా సరిగా ఇవ్వకపోవడం
- పురుషులకు, మహిళలకు పారితోషికం విషయంలో తీవ్రమైన వివక్ష చూపడం
- సినిమాల్లోని సాంకేతిక విభాగాల్లోకి మహిళలను ప్రవేశించనివ్వకుండా తీవ్రంగా నిరోధించడం, అడ్డంకులు సృష్టించడం ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ దాడులు తమకు న్యాయపరంగా ఉన్న హక్కులు ఏంటన్నది మహిళలకు తెలియనివ్వకపోవడం సమస్యల పరిష్కారానికి చట్టపరమైన వ్యవస్థలు ఏమీ సినీపరిశ్రమలో లేకపోవడం వీటిలో మిగిలినవన్నీ ఒక ఎత్తయితే.. కనీసం పని ప్రదేశంలో అంటే ముఖ్యంగా ఔట్ డోర్ షూటింగులు ఉన్నప్పుడు కనీసం టాయిలెట్ సదుపాయాలు, దుస్తులు మార్చుకునేందుకు మరుగు కూడా కల్పించకపోవడం దాదాపు అన్ని సినీపరిశ్రమల్లోనూ ఉంటోంది. దీనివల్ల మహిళలు తీవ్రమైన సమస్యల పాలు అవుతున్నారు. చాలామంది అసలు షూటింగ్ జరుగుతున్నంతసేపు మంచినీళ్లు కూడా తాగడం లేదు. ఒకవేళ తాగితే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని, అక్కడ అలాంటి సదుపాయాలు లేకపోవడంతో ఎందుకని చెప్పి నీళ్లు తాగడం మానేస్తున్నారు. దానివల్ల వాళ్లలో చాలామందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి. మరీ అత్యవసరమైతే ఏవైనా దట్టమైన పొదల్లాంటివి చూసుకుని, వాటి వెనకాలకు వెళ్లి తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. అలాగే దుస్తులు మార్చుకోవాలన్నా కూడా తగిన సదుపాయాలు ఏమీ లేకపోవడంతో లావైన చెట్ల వెనకాలకు వెళ్లి గానీ, లేకపోతే వేరే ఇద్దరు ముగ్గురు కలిసి అడ్డంగా చీరల్లాంటివి పట్టుకుంటే ఆ మధ్యలో మరుగు చూసుకుని అక్కడ దుస్తులు మార్చుకోవడం లాంటివి చేయాల్సి వస్తోంది. ఇక రుతుక్రమ సమయంలో షూటింగ్ ఉంటే మహిళల కష్టాలు వర్ణనాతీతం. కనీసం నాప్కిన్లు మార్చుకోవడానికి, ఆ సమయంలో శుభ్రం చేసుకోవడానికి నీళ్ల సదుపాయాలు కూడా లేకపోవడం, నాప్కిన్లు పారేసేందుకు తగిన ప్రదేశాలు లేకపోవడం లాంటి సమస్యలు ఉంటున్నాయి.
కారవాన్లు కొందరికే
ఈ విషయం గురించి కొందరు నిర్మాతలను గట్టిగా ప్రశ్నిస్తే.. తాము కారవాన్లు అందుబాటులో ఉంచుతున్నామని ఘనంగా చెప్పేస్తున్నారు. కానీ, కారవాన్లు కేవలం హీరోయిన్లకు మాత్రమే ఉంటాయి. వాటిలో కనీసం వాళ్ల అసిస్టెంట్లు కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలుండదు. ఎక్కువమంది వాడితే అవి వాసన వస్తాయన్నది సదరు హీరోయిన్లు చెప్పే మాట. అది కూడా వాస్తవమే. బయో టాయిలెట్ల లాంటివి ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నా, ఆ విషయాన్ని నిర్మాతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనివల్ల ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఉమెన్ లాంటివాళ్లకు బాగా ఇబ్బంది అవుతోంది. ఏదైనా ఒక వాహనాన్ని ప్రత్యేకంగా దుస్తులు మార్చుకోవడానికి కేటాయించాలని కొందరు మహిళలు కోరినా, మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ఎక్కడపడితే అక్కడ హిడెన్ కెమెరాలు పెడుతున్నారని, సినిమా రంగంలో పనిచేసేవాళ్లకు అలాంటి తెలివితేటలు ఎక్కువగా ఉండటం వల్ల తమకు భద్రత ఉండదని చెబుతున్నారు.
లైంగిక వేధింపులు
అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీరంగంలో.. ముఖ్యంగా మలయాళ సినీరంగంలోనూ లైంగిక వేధింపులు తీవ్రంగానే ఉన్నాయి. హీరో దిలీప్ కదులుతున్న కారులో ఒక హీరోయిన్‌పై అత్యాచారం చేసిన ఘటన దీనికి పరాకాష్ఠగా నిలిచింది. అయితే, అదే సమయంలో సినీపరిశ్రమలోని పురుషులందరూ ఇలా లేరని కమిటీ స్పష్టం చేసింది. తన నివేదికలోని 38వ పేజీలో ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా అండర్‌లైన్ చేసి మరీ చెప్పింది. కొందరు పురుషులు చాలా మర్యాదగా, గౌరవంగా ఉంటారని, వాళ్లతో ఎన్నిరోజులు పనిచేసినా తమకు చాలా సురక్షితంగా ఉంటుందని కమిటీ ముందుకు వచ్చిన మహిళలందరూ ముక్తకంఠంతో చెప్పారు. ముఖ్యంగా సినిమాల్లో నటీనటులు సన్నిహితంగా ఉండే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు వీలైనంత వరకు తప్పనిసరి అనుకున్నవారు తప్ప మిగిలినవారిని కొందరు దర్శకులు బయటకు పంపేస్తారని, అలాగే అలాంటి దృశ్యాలను చాలావరకు నాలుగుగోడల మధ్యే తీస్తూ, వేరే ఎవరూ వాటిని తమ ఫోన్లలో చిత్రీకరించకుండా జాగ్రత్తపడతారని చాలామంది తెలిపారు.
అదే సమయంలో చాలామంది నీచులు కూడా ఉన్నారని వాపోయారు. తమకు వాట్సప్‌లో అసభ్య చిత్రాలు వచ్చేవని, వాటిలో తామే ఉండటం చూసి నిర్ఘాంతపోయామని పలువురు మహిళలు చెప్పారు. కొన్ని వీడియో, ఆడియో క్లిప్పింగులు కమిటీకి సైతం చూపించారు. వాట్సాప్‌లో తమకు పంపిన సందేశాల స్క్రీన్ షాట్లను చూపించారు. వాటి ద్వారా తమపై పలుమార్లు లైంగికదాడులు చేశారని కూడా చెబుతూ తీవ్రంగా రోదించారు. సినీపరిశ్రమలో చాలా పెద్ద పేరున్న చాలామంది దర్శక నిర్మాతలు, నటులు, ఇతర రంగాల వారు ఈ తరహా వేధింపులకు పాల్పడినట్లు కమిటీ పూర్తిగా విశ్వసించింది.
ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా అన్ని పరిశ్రమల్లోనూ ఉన్నాయన్నది కఠోర వాస్తవం. దీన్ని నివారించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు సినీరంగంపై కూడా కొంత నియంత్రణ విధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ రంగంలో పనిచేసవారిని అసంఘటిత కార్మికుల్లా కాకుండా వారికి సైతం తగిన హక్కులు కల్పించాలి, కనీస సదుపాయాలు కల్పించేలా నిర్మాణ సంస్థలకు నిర్దేశించాలి. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో పన్ను మినహాయింపులు ప్రకటించడం లాంటివి చేస్తున్న ప్రభుత్వాలు.. అదే సమయంలో ఆ పరిశ్రమలో పనిచేసే మహిళల సంరక్షణ బాధ్యత కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ దిశగా స్పందించడానికి ఇదే సరైన సమయం.