Sessions of Indian Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అనేది అత్యంత ముఖ్యమైన, కీలకమైన చిహ్నం. పార్లమెంటు సమావేశపరిచి, శాసనాలు, పథకాలు తదితం ‘ప్రజోపయోగ, ప్రజా సంక్షేమ వ్యవహారాలపై చర్చించడానికి, వాదించడానికి పార్లమెంట్ సభ్యులందరినీ సమావేశానికి పిలిచి, రప్పించి, అవకాశం కల్పించడం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన ధ్యేయం. చట్టసభ సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారంటే దాని అర్థం ప్రజలే చర్చల్లే పాల్గొన్నారని. తమ మనోభావాలను వారు తమ ప్రతినిధుల ద్వారా చట్టసభలో వ్యక్తపరుస్తారనేది జగమెరిగిన సత్యం. నిర్ణయాధికారం కలిగిన పాలక పక్షం జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిజానికి పార్లమెంట్ హుందాతనాన్ని, జవాబుదారీతనాన్ని, విలువలను కాపాడడం అనేది ఏ ఒక్కరి బాధ్యతో కాదు. ఇది సమిష్టి బాధ్యత. పాలక పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా దాదాపు పార్టీల సభ్యులందరూ గత కొన్నేళ్లుగా పార్లమెంట్లో చర్చలు, వాదాలు లేకుండా కేవలం గందరగోళం సృష్టించడం విలువైన పార్లమెంటరీ కాలాన్ని వృథా చేస్తున్నారు.
లోక్సభ, రాజ్యసభల్లో ప్రతి అంశాన్నీ మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. చర్చజరపక పోవడమన్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగించే ప్రమాదం ఉంది. విదేశాంగ విధానం రక్షణ సంసిద్ధత, వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యల క్షుణ్ణంగా చర్చ జరగాల్సి ఉన్నా, ఎటువంటి చర్చా లేకుండా, స్థాయీ సంఘాలకు ఏ బిల్లునూ పంపించకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడడం ప్రారంభమైందనే భావించాలి. ఎప్పుడైనా ఏదైనా సమస్య మీద లేదా బిల్లు మీద చర్చ జరిగినా అందులో పస ఉండడం లేదు. నాసిరకం చర్చతో కోట్లాది రూపాయల ప్రజాధనానికి సంబంధించిన బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. ఇందుకు పాలక పక్షాన్నీ, ప్రభుత్వాన్ని మాత్రమే నిందించి, తప్పుబట్టి ప్రయోజనం లేదు. తిలా పాపం తలా పిడికెడు అనే సామెత మాదిరిగా ప్రతిపక్షాలు సైతం పార్లమెంట్లో దేని మీదా చర్చ జరగకపోవడానికి కారణ మవుతున్నాయి. పార్లమెంట్ సమావేశమైనప్పుడల్లా ప్రతిపక్ష సభ్యులు ఒక కారణం మీద సమావేశాలు సజావుగా జరగకుండా చేస్తూ, గందరగోళ పరిస్థితులు సృష్టిస్తూ, విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఇటీవల మిళింద్ దేవరా, వరుణ్ గాంధీ తదితర పార్లమెంట్ సభ్యులు వ్యాఖ్యానించడం జరిగింది.
పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చా ఉండదు, ఆరోగ్యకరమైన విమర్శలూ ఉండవు. అంతా గందర గోళమే. గత కొన్నేళ్లుగా ఇదే తంతు అని వరుణ్ గాంధీ విమర్శించారు. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్నప్పుడు, బిట్రన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ఆ మహమ్మారిని నిరోధించ డంపై చక్కని చర్చ జరిగిందని, పాలక, ప్రతిపక్ష సభ్యులు ఈ మహమ్మారిని నియంత్రించడానికి ఎన్నో వ్యూహాలు, కార్యక్రమాలు, చర్యలు సూచించారని, కానీ, భారతీయ పార్లమెంట్లో మాత్రం ప్రతిపక్షాలు ఒక్క సూచనా చేయకపోగా, పార్లమెంట్లో గందరగోళం సృష్టించి, సమావేశాలు స్తంభించిపోవడానికే ప్రయత్నించారని కొందరు పార్లమెంట్ సభ్యులు సైతం అంగీకరించారు. ప్రభుత్వాన్ని నిలదీయడం అవసరం. ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పనిచేయించేలా చేయడం అత్యవసరం. అయితే, ఇవన్నీ గందర గోళం సృష్టించడం ద్వారా, స్తంభింపజేయడం ద్వారా మాత్రం కాదు అని మిళింద్ దేవరా స్పష్టం చేశారు. దేశాన్ని కొవిడ్ వంటి ప్రధాన సమస్యలు పీడిస్తున్నప్పుడు, ద్రవ్యోల్బణం, ఉగ్రవాదం, భద్రత వంటి సమస్యలు చుట్టు ముట్టినప్పుడు పార్టీలకతీతంగా చర్చించి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీనియర్ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో బిల్లులను ప్రవేశపెట్టే ముందు వాటిని వివిధ పార్టీల సభ్యులతో ఏర్పడిన స్థాయీ సంఘాలకు అప్పగించి, సాంకేతిక లోపాలను సవరించాల్సి ఉంటుంది. అయితే, స్థాయీ సంఘాలకు బిల్లు లను పంపడం బాగా తగ్గిపోవడం సుమారు పదిహేనేళ్ల క్రితమే ప్రారంభమై, ప్రస్తుతం దాదాపు ఆపేయడం వరకూ చేరుకుంది. పార్లమెంట్‌కు చెందిన వివిధ సంఘాలు తరచూ సమావేశమై, బిల్లులపై చర్చించడం, దేశ సమస్యల గురించి ఆలోచించడం పరిపాటి. ఆ ప్రజాస్వామ్యబద్ధ విధానానికి కూడా ఎప్పుడో స్వస్తి చెప్పడం జరిగింది. రోజుకు కనీసం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చయ్యే పార్లమెంట్ సమావేశాలలో ఒక్క ఆరగంట కూడా సరైన చర్చ జరగడం లేదు. పదిహేను రోజుల సమావేశాలు జరిగితే ఎంత లే దన్నా వంద గంటల సమయం ప్రతిపక్షాలు సృష్టిస్తున్న గందరగోళ పరిస్థితుల కారణంగా వృథా అవుతోందని ఈ మధ్య మాజీ ఉపరాష్ట్రపతి, సీనియర్ పార్లమెంటే రియన్ ఎం. వెంకయ్య నాయుడు వాపోయారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప ఏ విధమైన ప్రయోజనమూ ఉండడం లేదు. పాలకపక్షం తమ బాధ్యతను మరచిపోతున్నట్టే, ప్రతిపక్షాలు తమ పాత్రను విస్మరించి వ్యవహరిస్తున్నాయి అని ఆయన గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో ఏ సమస్య మీదా, ఏ బిల్లు మీదా చర్చ జరగకుండా చేయడం, దేని మీదా వివరణ రా కుండా అడ్డుకోవడం అటు పాలక పక్షానికి, ఇటు ప్రతిపక్షాలకు ఒక రాజకీయ స్వప్రయోజనంగా మారిందని రాజకీయ విశ్లేషకులు పత్రికల్లో తమ కథనాల ద్వారా తెలియజేస్తున్నారు. చట్టసభల సభ్యుల తీరు తెన్నులు చూసి ప్రజలు కూడా పార్లమెంట్ సమావేశాలకు విలువనివ్వడం తగ్గించేశారని రమేశ్ రంజన్ అనే సీనియర్ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు. నిజానికి రాజ్యసభ చైర్మన్ గా ఉండగా వెంకయ్య నాయు డు పార్లమెంటరీ విలువల కోసం, ఆరోగ్యకరమైన చర్చల కోసం తీవ్రంగా పోరాడారని, ఈ విషయంలో ఆయన ఎంతో ఆవేదన చెందేవారని రంజన్ గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలు అర్థం లేనివిగా మారడానికి పాలక పక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా బాధ్యత వహించాలని విశ్లేషకులు భావిస్తున్నారు.