Saturday, September 28, 2024
Homeఓపన్ పేజ్Humanity is the need of the hour: నిజమైన జ్ఞానం- నిండైన వ్యక్తిత్వం

Humanity is the need of the hour: నిజమైన జ్ఞానం- నిండైన వ్యక్తిత్వం

మనం మన సౌకర్యానికి ఏర్పాటు చేసుకున్న నియమాలు, నిబంధనలు, హద్దులు మన జీవితాలకే హద్దులను నిర్ణయిస్తున్నాయి. మంచి విషయాల్లో మన హద్దులు మన స్థాయిని గొప్పగా నిర్మించి, మన వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. హద్దులు దాటితే మన జీవితాన్ని అధః పాతాళానికి తొక్కేస్తాయి. ఇదే సందర్భంలో మితిమీరిన నియమాలు మన అవసరాలను తీర్చలేవు. అనవసరమైన త్యాగాలు అక్కరకు రాని చుట్టాలవంటివి. అవి చేతికి ఆరో వేలులా నిరుపయోగంగా మిగిలిపోతాయి. ప్రతిష్ఠ పేరుతో కొన్ని జీవితాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొంతమంది లేని ప్రతిష్ఠను ఉన్నట్టుగా ఊహించుకుని లేని వ్యక్తిత్వాన్ని గొప్పగా ఆపాదించుకుంటే, అన్నవస్త్రాలకు ప్రాకులాడితే ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా అసలుకే ఎసరు వచ్చే అవకాశాలున్నాయి. మన స్థాయి మన అస్తుల మీద,అంతస్తుల మీద ఆధారపడి ఉండదు. అహంభావం మన వ్యక్తిత్వాన్ని పెంచదు. మనిషిలోని గుణగణాలే మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి. లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, అబ్ధుల్ కలాం వంటి మహనీయులు అత్యంత నిరాడంబరంగా జీవించి, తమ కోసమంటూ ఏమీ కూడబెట్టుకోలేదు. వారిలోని సద్గుణాలే వారిని ఈ భూప్రపంచంపై చిరస్థాయిగా నిలబెట్టాయి. మరణించినా ప్రజల హృదయాల్లో జీవించే స్థాయిని కట్టబెట్టాయి. ఇలా ఎంతో మంది మహనీయులు చరిత్రకు వన్నె తెచ్చారు. దురదృష్టవశాత్తూ, ఆధునిక సమాజంలో సద్గుణాలకు విలువ లభించడం లేదు. దుర్గుణధారులకే ప్రాచుర్యం లభించే దుర్ధినాలు దాపురించాయి.త్యాగధనులు ఎక్కడో మారు మూలకు నెట్టబడుతున్నారు. సద్వర్తనం చతికిలబడిపోతున్నది. నీతి నియమాలు మనిషిని బ్రతికించలేక పోతున్నాయి. స్వార్ధం పడగ విప్పి బుసలు కొడుతున్నది. అహంకారం పైశాచిక నృత్యం చేస్తున్నది. సమిష్టితత్వం గతకాలపు అవశేషంలా మారిపోయింది. ఒకరితో మరొకరికి సంబంధాలు లేకుండా పోతున్నాయి. మనిషికి మనిషికి మధ్య వ్యాపార సంబంధాలే తప్ప మానవ సంబంధాలు లేకుండా పోయాయి. సంబంధాల్లో నిజాయితీ లోపించింది. రంగులు మార్చే తత్వం బయలు దేరింది. జీవితమంటే రైలు ప్రయాణమన్న సత్యం నేటి ఆధునిక జీవితంలో నూటికి నూరుపాళ్ళు నిజమై కూర్చుంది. దేశాల మధ్య ఎల్లలు
కేవలం భౌగోళికమైనవే. కాని మనుషుల మధ్య ఏర్పడిన ఎల్లలు మానసికమైనవి. వయసు పెరిగినా మానసిక పరిపక్వత లేని కారణంగా మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి.ఆధునిక సాంకేతిక ప్రభావం వలన,ప్రజల మధ్య ఏర్పడిన సమాచార సంబంధాల వలన ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆధునిక ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. యాంత్రిక యుగం లో మానవ శక్తికి విలువ లేకుండా పోయింది. మానవ సంబంధాలు చరవాణికే అంకితమైపోయాయి. సాంకేతిక విప్లవం ఫలితంగా మనుషుల మనసుల మధ్య దూరం పెరిగిపోయింది. సమాజంలో స్వార్ధపూరితమైన వాతావరణం నెలకొన్నది. సంపాదనకే గాని సంబంధాలకు విలువ లేని పెడధోరణులు పెరిగిపోయాయి. నైతిక పతనం అత్యంత వేగవంతమై,మానవ సంస్కృతి నశించి దానవ ప్రవృత్తి ప్రబలమై పోతున్నది. మానవత్వం కేవలం నిఘంటువులకే పరిమితమై పోయే రోజులొచ్చాయి.మనుషుల మాటలకు చేష్ఠలకు పొంతన లేకుండా పోయింది. మంచితనం అసమర్ధతగా మారిపోయింది. సంపాదనకే ప్రాముఖ్యత పెరిగింది. నోటి మాటకు లేకుండా పోయింది. కాసుల కక్కుర్తి పెరిగి పోయింది.అత్యాచారాలు,హత్యలుపెరిగిపోయాయి. విజ్ఞానం పతనానికి బాటలు వేస్తే, మానవ సంబంధాలు బీటలు వారిపోయాయి.స్వార్ధం పరాకాష్ఠకు చేరింది. కుటిల నీతి అందమైన రూపాన్ని ఆపాదించుకుని,అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తుంటే, ఆకాశాన్ని అందుకోవాలనే ఆరాటంలో నేల విడిచి సాము చేసే తత్వం ప్రబలి పోయింది. కుట్రలు,కుయుక్తులతో మనిషిని మనిషే నరుక్కునే నాగరికతకు బీజం పడింది. అరాచకాలకు హద్దులేకుండా పోయింది.పెట్టిన చేతినే నరికే సంస్కృతి మానవత్వపు నీడను కూడా లేకుండా హరిస్తున్నది. కాఠిన్యభావాలు కారుణ్య దహనానికి నిచ్చెనలు వేస్తున్నాయి. చిరుమొగ్గలను సైతం చిదిమేసే మృగత్వం మనిషిలో వికృత రూపం ధరించింది. బాధాతప్త హృదయాల్లో జనించిన ఆర్తనాదాలు శూన్యాకాశంలో నిశ్శబ్ధ తరంగాలై అంతరిస్తున్నాయి. మానవత్వం లేని మృగాలు సంచరించే వనంలో మనమంతా తలదాచుకుంటున్నాం. మనిషిని మనిషే చంపుకుతినే దుస్థితి దాపురించిన తరుణంలో మానవ సంబంధాల పునరుద్ధరణకై నడుంబిగించవలసిన తరుణం తరుముకొస్తున్నది. అంతరిస్తున్న మానవ సమాజంలో అడపాదడపా అంకురించే మానవత్వాన్ని సైతం అణగద్రొక్కే దుష్ట శక్తులను దునుమాడే సాహసికుల కోసం సమాజం ఎదురుచూస్తున్నది. కాకుల రణగొణ ధ్వనుల్లో కోయిల గానం వినిపించునా? కాకుల గూటిలో కోయిల మనగలదా? మనుగడ సాగించగలదా? ఎడారిలో నీటిగురించి,కఠినాత్ముల్లో కారుణ్యం గురించి, కారుమేఘాల్లో వెలుతురు గురించి యోచన చేయడం వృథా అనే భావన సర్వత్రా నెలకొన్నది. మంచిని వంచించి,నిలువునా ముంచేసే ఆధునిక లోకంలో లోక కల్యాణం గురించి ఆలోచించడమే దండగనే నైరాశ్య భావన సర్వత్రా నెలకొన్నది.వింత లోకంలో విడ్డూరాలెన్నో జరుగుతున్నాయి. దుర్మధాంధుల దుశ్చర్యలను చూడలేని మానవత్వం మౌనముద్రలోకి జారిపోయింది. దైవంపై మమకారం పెరిగినా, దేవుడున్నాడనే భీతి కలిగినా,దుష్ట ప్రవృత్తి మాత్రం వేయితలల రూపం ధరించడం ఆందోళనకరం.పాపకృత్యాలు మరింత పెరుగుతున్నాయి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనే నానుడి నరనరాల్లో జీర్ణించుకున్న మనిషి తాను చేసిన ఘోరకృత్యాలను దేవుడు క్షమించేస్తాడనే భ్రమలో అనునిత్యం సరికొత్త దారుణాలకు తెగబడుతూ, దైవాన్ని మ్రొక్కి, తమ పాషాణ హృదయాలను శాంతింప చేసుకుంటున్నామనే భ్రమలో మునగడం పైత్యానికి పరాకాష్ఠ. మంచితనం మసక బారి పోతున్నది. మానవత్వం కొరగాకుండా పోతున్నది. మంచి చెడుల విచక్షణ నశించింది. మానవత్వం అల్లంత దూరంలో నిలబడి ,సాగర కెరటం లా హఠాత్తుగా మన పాదాలను తాకి ముద్దాడితే,ముద్దాడిన కెరటాన్ని వద్దని వదిలేసి రాకాసి కెరటాన్ని రారమ్మని స్వాగతించి మృత్యు సుడిగుండంలోకి ఇరుక్కుపోయి మింగేసే మృత్యువు నీడలో సేదతీరాలను కోవడం మన పొరపాటు- గ్రహపాటు. సకల అవలక్షణాలతో, అష్ట వంకరలతో నైతిక పతనం వైపు పరుగులు పెడుతున్న మానవ జాతికి పట్టిన గ్రహణం వీడేదెన్నడు?మనిషి మనిషిగా జీవించే అలనాటి రోజులు ఇలలో పునరావృతం కావాలి. దేహాన్ని స్నానం పరిశుభ్రం చేసినట్టుగా జ్ఞానం, వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక చింతన మానసిక కల్మషాన్ని రూపుమాపాలి.

- Advertisement -
             - సుంకవల్లి సత్తిరాజు
        ( సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్)
               మొబైల్:9704903463.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News