మూడు నెలల వ్యవధిలో పాకిస్థాన్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను రెండవసారి అరెస్టు చేసింది. ‘తోషాఖానా’కు చెందవలసిన బహుమతులు, కానుకలను ఇమ్రాన్ ఖాన్ సొంతానికి ఉపయోగించుకున్నారన్న ఆరోపణపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయడం జరిగింది. ‘అల్ ఖదీర్’ ట్రస్టు కేసు సందర్భంగా ఆయనను మొదట గత మే 9న అరెస్టు చేశారు. తాజా కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి అయిదేళ్ల పాటు అనర్హుడయ్యారు. అంటే, వచ్చే నవంబర్ మాసంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పాల్గొనడానికి అవకాశం లేదు. ఈ నెల 9న పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు ఇటీవల ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. సరిగ్గా ప్రభుత్వం మారే సమయంలో ఇమ్రాన్ ఖాన్ పై వేటుపడడం కాకతాళీయం కాకపోవచ్చు.
ఇక ఈ మాజీ ప్రధాని న్యాయ పోరాటాల్లో చిక్కుకుపోవడం మొదలైంది. పాకిస్థాన్‌లో ప్రధానులకు ఈ విధంగా కోర్టులో కేసులు దాఖలు కావడం, జైలు శిక్షలు పడడం అనేది ఇమ్రాన్ ఖాన్ తోనే మొదలు కాలేదు. గతంలో ఆయన ప్రభుత్వం కూడా మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, షాహిద్ ఖాన్, మాజీ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, మరి కొందరు ప్రతిపక్ష నాయకుల మీద ఇదే విధంగా కేసులు పెట్టడం జరిగింది. నిజానికి ఈ విధంగా కేసులు పెట్టడం, విచారణలు జరపడం, శిక్షలు వేయడం అనేది వ్యక్తిగత ద్వేషాలు, పగలు, ప్రతీకారాల వల్ల జరగలేదు. కేవలం సైనికాధిపతుల ఇష్టానిష్టాల ప్రకారం జరిగాయి. ఇమ్రాన్ విషయానికి వస్తే, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ హయాంలో ఆయన అనేక నెలల పాటు గృహ నిర్బంధంలో ఉండిపోవడం జరిగింది. ఆ తర్వాత సైనికాధిపతులతో సత్సంబంధాలు ఏర్పడడంతో ఆయన విడుదల అయ్యారు. 2018 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి, ప్రధాని పదవిని చేపట్టారంటే అందుకు ఏకైక కారణం సైన్యాధికారి జనరల్ క్వామర్ బాజ్వా ఆశీస్సులు ఉండడమే. అయితే, ఆ తర్వాత వారిద్దరి మధ్యా సంబంధాలు దెబ్బతినడంతో ఇమ్రాన్ ఖాన్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి.
ఏది ఏమైనా, పాకిస్థాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ పై తీసుకుంటున్న చర్యలు కొద్దిగా అతిగానూ, హద్దులు మీరిన వ్యవహారాలు గానూ కనిపిస్తున్నాయి. 2022 ఏప్రిల్ లో పదవీ చ్యుతుడు అయినప్పటి నుంచి ఆయనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆయన పైనా, ఆయన కుటుంబంపైనా కేసులు పెట్టడమే కాకుండా, ఆయన పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ కు చెందిన పలువురు నాయకులను కూడా కేసుల్లో ఇరికించడం జరుగుతోంది. ఆయన మీదా, ఆయన సహచరుల మీదా దేశద్రోహం, ఉగ్రవాదం, దైవ దూషణ వంటి కేసులను కూడా నమోదు చేసినందువల్ల ఆయనకు మున్ముందు మరిన్ని కేసులలో శిక్షలు విధించే అవకాశం కూడా ఉంది. ఆయనను పదవీచ్యుతుడిని చేయడం, ఆయనపై కేసులు పెట్టడం వంటివేవీ ఆయన ప్రజాకర్షణను తగ్గించలేకపోయాయి.
అక్టోబర్ నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో అది స్పష్టంగా నిర్ధారణ అయింది. మేలో మొదటిసారిగా ఆయనను అరెస్టు చేసినప్పుడు పెల్లుబికిన ప్రజాగ్రహం కూడా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆయన మీద కేసులు పెట్టినప్పుడు, శిక్షలు విధించినప్పుడు ఇదే ప్రజాగ్రహం ఎక్కడా కనిపించలేదంటే అందుకు కారణం ఆయన పట్ల ప్రజాభిమానం తగ్గినట్టు కాదు. నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుండడమే అందుకు కారణం అని గ్రహించాలి. మొత్తానికి ఇవన్నీ పాకిస్థాన్ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
Imran Khan: ప్రమాదంలో పాక్ ప్రజాస్వామ్యం
పాకిస్థాన్ లో ప్రజాస్వామం ఎప్పుడో పోయింది