రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ సాధారణంగా దౌత్యవేత్తలను కలుసుకోరు. దేశాధినేత, విదేశాంగ మంత్రి కంటే తక్కువ స్థాయివారిని ఆయన కలుసుకునే ప్రసక్తే లేదు. కానీ, ఆయన ఇటీవల జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ ధోవల్‌ను కలుసుకోవడానికి సిద్ధపడ్డారంటే, భారత, రష్యా స్నేహ సంబంధాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ కొలువులో ధోవల్‌కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి కూడా ఆయనకు పూర్తిగా అవగతం అయి ఉండాలి. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై చర్చించడానికి వివిధ దేశాలకు చెందిన భద్రతాధికారులు సమావేశమవుతున్న సందర్భంగా భారత్ తరఫున అజిత్ ధోవల్ మాస్కో వెళ్లారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు మహిళలు, ఇతర మైనారిటీల హక్కులను ఉపసంహరించిన నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితిపై చర్చించడానికి ప్రాంతీయ భద్రతాధికారుల సమావేశం జరిగింది. ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్లకు, ఇతర ఉగ్రవాద వర్గాలకు మధ్య భీకర పోరాటం కూడా జరుగుతోంది. ఈ సమావేశం సందర్భంగా పుతిన్ పలువురు భద్రతాధికారులతో సమావేశమయ్యారు. అయితే, ధోవల్తో మాత్రం ఉదయమే విడిగా, ప్రత్యేకంగా సమావేశం కావడం విశేషం.
చాలా ఏళ్లుగా రష్యా, భారతదేశాల మధ్య స్నేహసంబంధాలు పటిష్ఠంగా కొన సాగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈ సత్సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ సమయంలో పుతిన్, ధోవల్ల మధ్య సమావేశం జరిగి నందువల్ల ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరి మధ్యా ఏ అంశంపై చర్చలు జరిగాయన్న వివరాలు బయటికి పొక్కలేదు. కానీ, కీలక అంశాలపై చర్చలు జరిగాయన్నది మాత్రం అర్థం అవుతోంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని పురస్కరించుకుని పాశ్యాత్య దేశాలతో రష్యా సంబంధాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఫలితంగా రష్యా తన చిరకాల మిత్ర దేశమైన భారతదేశంపై ఆధారపడడం ప్రారంభించింది. దౌత్య పరంగా ఏకాకిగా మిగిలిపోవడానికి రష్యా అవకాశం ఇవ్వదలచుకోలేదు. కాగా, రష్యా సంక్షోభం వల్ల భారత్ ఆర్థికంగా ఎంతగానో లాభపడిన మాట వాస్తవం. రష్యా నుంచి బాగా తగ్గింపు ధరలకు ఆయిల్, ఎరువులు కొనుగోలు చేయగలిగింది. ఈ పనిని పాశ్చాత్య దేశాలు సాధించలేక పోయాయి.
మరో విధంగా చెప్పాలంటే, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, రష్యాకు పాశ్చాత్య దేశాలు దూరం కావడంతో భారత, రష్యా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్ఠం కావడానికి అవకాశం ఏర్పడింది. భారతదేశ వాణిజ్య భాగస్వాముల జాబితాలో రష్యా ఎకాయెకిన నాలుగవ స్థానానికి చేరుకుంది. ఇదిలా ఉండగా, పుతిన్‌తో ధోవల్‌తో భేటీ కావడం అంటే ప్రధాని కొలువులో ఆయనకు ఎంత ప్రాధాన్యం ఉన్నదీ అర్థం చేసు కోవచ్చు. చాలామంది మంత్రివర్గ సహచరుల కంటే ధోవల్ మీద మోదీకి నమ్మకం ఎక్కువనీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ధోవల్‌కు ఆయన అపాయింట్మెంట్ ఇస్తుంటా రనీ దౌత్యవర్గాలు చెప్పుకుంటుంటాయి. ఇదే విషయాన్ని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇటీవల తన గ్రంథంలో రాయడం కూడా జరిగింది.
ఇక పాశ్యాత్య దేశాలు తమ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయన్న భావన పుతిన్, మోదీలలో ఉంది. 2002 నాటి గుజరాత్ అల్లర్లతో మోదీకి సంబంధం ఉందంటూ ఇటీవల బీబీసీ రూపొందించిన ఒక డాక్యుమంటరీని మోదీ ప్రభుత్వం నిషేధించడం కాకుండా, ఆ సంస్థ వలసవాద దృక్పథంతో వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. తమతో పాశ్చాత్య దేశాలు స్నేహ సంబంధాలను ఏర్పరచుకోని పక్షంలో తాము ఇతర దేశాలకు సన్నిహితం కావాల్సి వస్తుందని మోదీ ప్రభుత్వం అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు తేటతెల్లం చేస్తోంది. అన్ని దేశాలతోనూ సమతూకంగా వ్యవహరించడం మోదీ దౌత్యనీతిలో, విదేశాంగ విధానంలో ఒక ముఖ్యమైన భాగంగా మారడం నిజంగా ఒక ఘన విజయమే చెప్పాలి. ఈ విధానమే భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
– జి. రాజశుక