Monday, September 30, 2024
Homeఓపన్ పేజ్INDIA parties: లక్ష్యశుద్ధి లేని ‘ఇండియా’ పార్టీలు

INDIA parties: లక్ష్యశుద్ధి లేని ‘ఇండియా’ పార్టీలు

గమ్యం లేని రాజకీయ ప్రయాణాలు ఇలాగే ఉంటాయి

ఇటీవల ‘ఇండియా’ పేరుతో ఒక తాటి మీదకు వచ్చిన సుమారు 24 ప్రతిపక్షాలు ముంబైలో సమావేశమై, రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో వీలైనంత కలిసికట్టుగా పోటీ చేయాలని తీర్మానించుకున్నాయి. వివిధ రాష్ట్రాలలో సీట్ల పంపకం ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని, ఈ విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని కూడా పిలుపునిచ్చాయి. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఒక కన్వీనర్‌ను నియమించలేదు. ఒక లోగోను కూడా రూపుదిద్దలేదు. అయితే, వివిధ అంశాలలో ప్రతిపక్షాల మధ్య సమన్వయం, సహకారాన్ని పెంచడానికి అయిదు కమిటీలను మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగమైన 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఎన్నికల వ్యూహాలను రూపొందించే కమిటీగా కూడా వ్యవహరిస్తుంది. మిగిలిన నాలుగు కమిటీలు సహకారం, సమన్వయం, ప్రచారం, సోషల్‌ మీడియా, పరిశోధన వంటి బాధ్యతలను నిర్వర్తిస్తాయి. కాగా, ఈ ఇండియా పార్టీలు ఒక విజన్‌ డాక్యుమెంట్‌ను కూడా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ డాక్యుమెంటును అక్టోబర్‌ 2న గాంధీజీ జయంతి రోజున విడుదల చేయాలని అవి భావిస్తున్నాయి. పాట్నా, నాగపూర్‌, ఢిల్లీ, చెన్నై, గువాహతి నగరాల్లో అయిదు ర్యాలీలో నిర్వహించాలని, నాయకులంతా తరచూ సమావేశం అవుతుండాలని కూడా అవి నిర్ణయించాయి. ఈ ఐక్యతా ప్రయత్నాలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కేంద్ర బిందువుగా మారారు. తన సొంత పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆయన వివిధ ప్రాంతీయ పార్టీ నాయకులను ఒక తాటి మీదకు తీసుకు రాగలిగారు. అంతేకాక, ఆయన మరోసారి భారత్‌ జోడో యాత్ర ప్రారంభించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఈసారి పూర్తిగా బీజేపీ కంచుకోటల్లోనే పర్యటించాలని కూడా ఆయన భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడం బాగానే ఉంది కానీ, ఇండియా పార్టీలకు బీజేపీని వ్యతిరేకించడమొక్కటే లక్ష్యంగా మారడం వల్ల ప్రయోజనం లేదు. ఈ ఇండియా గ్రూప్‌ పార్టీలలోని ప్రాంతీయ పార్టీలకు తమ ప్రాంత ప్రయోజనాలే కీలకం. పశ్చిమ బెంగాల్‌, కేరళలలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలను బట్టి ఈ పార్టీలు తమ తీరుతెన్నులను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి పోరాడుతున్నాయి. కేరళలో కాంగ్రెస్‌, వామపక్షాలు ప్రబల ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఇండియా పార్టీలన్నీ కలిసికట్టుగా బీజేపీ మీద పోరాడడం దేశ ప్రజలలో చాలా మందికి నచ్చే విషయమే కావచ్చు కానీ, మరికొందరికి ఇందులో ఉన్న ద్రోహ చింతన కూడా అవగతం కావచ్చు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, పార్టీలు కలిసినంత మాత్రాన ఓట్లన్నీ కలుస్తాయని ఆశించలేం. ఇదివరకు చోటు చేసుకున్న అనేక సంకీర్ణాలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. వివిధ కార్యక్రమాలు, నినాదాల విషయంలో ఈ పార్టీలన్నిటి మధ్యా అభిప్రాయభేదాలు ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు కానీ, వీరి కార్యక్రమాలను, ప్రయత్నాలను ప్రజలు ఆమో దిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఇండియా పార్టీలు ఆమోదయోగ్యమైన కార్యక్రమాలను రూపొందించి, పటిష్టమైన ప్రచారం చేపట్టాలి. వీటిని సక్రమంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. బీజేపీ వ్యూహాత్మక శక్తిని, ప్రజల మనోభీష్టానికి అను గుణంగా వ్యవహరించే నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అది సిద్ధాంతాల విషయంలో రాజీపడని ధోరణి అవలంబిస్తోంది. అది రాజకీయ, పాలనాపరమైన చర్యల ద్వారా ఇప్పటికే ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా తయారైంది. కేవలం బీజేపీని పోటీ ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్ల ప్రతిపక్ష నాయకులు ఎటువంటి ప్రయోజనమూ సాధించలేరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News