Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్India serious on Canada govt: కెనడా తీరుపట్ల భారత్‌ ఆగ్రహం

India serious on Canada govt: కెనడా తీరుపట్ల భారత్‌ ఆగ్రహం

ఖలిస్థాన్ కు మద్దతు ఉపసంహరించకపోతే ద్వైపాక్షిక సంబంధాలు మటాష్

విదేశాలలో ఉంటున్న ఖలిస్థానీ ఉద్యమకారులు యథేచ్ఛగా భారత్‌ వ్యతిరేక ప్రసంగాలు, ప్రకటనలు చేస్తూండడం, అక్కడి ప్రభుత్వాలు చూసీ చూడనట్టు ఊరుకోవడం అనేది భారతదేశ సమస్యల పట్ల వాటి వైఖరిని ప్రతిబింబిస్తోంది. ఇటీవల శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నించడం, గత జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలో ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిర్జర్‌ ను భారత దౌత్య కార్యాలయమే హత్య చేసిందంటూ ఖలిస్థానీలు పోస్టర్లు ప్రదర్శించడం వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. నిజ్జర్‌ మీద భారత ప్రభుత్వం పది లక్షల రూపాయాలు ప్రకటించింది. నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ కు అతనికి సంబంధం ఉన్నట్టుగా తెలిపింది. సర్రేకు సమీపంలోని ఒక పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు అతని బాగా దగ్గరుండి కాల్చి చంపడం జరిగింది. ఆ హత్య మీద ప్రారంభమైన దర్యాప్తు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.
అయినప్పటికీ ఖలిస్థానీ నాయకులే దర్యాప్తు అధికారులుగా, విచారణాధికారులుగా, న్యాయమూర్తులుగా వ్యవహరిస్తూ, భారత దౌత్య కార్యాలయాన్ని తప్పుపట్టడం జరుగు తోంది. ఈ ద్వేషపూరితమైన వ్యాఖ్యలకు, ప్రకటనలకు ఖలిస్థానీలను శిక్షించడమనేది జరగడం లేదు. భారతదేశం పట్ల ఎటువంటి నేరం జరిగినా, ఎటువంటి దుష్ప్రచారం జరి గినా కెనడా పట్టించుకోదు. ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటుంది. 1985లో ఖలిస్థానీ తీవ్రవాదులు కనిష్క విమానాన్ని కూల్చినప్పుడు కూడా కెనడా నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుండిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 329 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పో యినప్పటికీ కెనడా దీనిని మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించింది. ఈ దుర్ఘటనలో చనిపోయినవారంతా కెనడా జాతీయులే. అయితే, వీరు భారత సంతతికి చెందిన వారు కావడంతో కెనడా ఉదాసీనంగా వ్యవహరించింది.
ఈ పోస్టర్లు, దాడుల విషయంలో భారత ప్రభుత్వం కెనడాను నిలదీసేసరికి, దౌత్య కార్యాలయంపై దాడిని ఉపేక్షించేది లేదని, పోస్టర్లు ప్రదర్శించడం ఆమోదయోగ్యం కాదని ఒక ప్రకటన జారీ చేసింది. దౌత్యవేత్తల భద్రతకు సంబంధించి తాము వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్పినప్పటికీ ఈ విషయంలో సరైన చర్యలేవీ తీసుకోలేదు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారత దౌత్య కార్యాలయంపై దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. దౌత్యవేత్తలకు తాము పూర్తి భద్రత కల్పిస్తామని పేర్కొంది. నేరస్థులపై చర్య తీసుకోవడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కొన్ని పాశ్చాత్య దేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రాల ముసుగులో ద్వేషపూరిత ప్రసంగాలను, ప్రకటనలను ప్రోత్సహించడం జరుగుతోంది. స్వీడెన్‌ లో ఈద్‌ మొదటి రోజున ఒక ఇరాకీ జాతీయుడు ఓ మసీదు బయట కురాన్‌ ను దగ్ధం చేయడాన్ని స్వీడన్‌ సమర్థించింది. దౌత్యపరంగా ఎదురు దాడులు ప్రారంభం అయ్యేసరికి, ఇస్లామ్‌ మతం పట్ల లేని పోని భయాలు పెట్టుకోవడం తమకు సమ్మతం కాదంటూ ఒక ప్రకటన చేసింది.
కెనడా అవకాశవాదంతో వ్యవహరిస్తోంది. కెనడాలో ఉన్న సిక్కు ఓటు బ్యాంకు మీద ఇది ఆశలు పెట్టుకుంది. ఖలిస్థానీలకు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌ లు మద్దతునివ్వడం విరమించుకోవాలని, లేని పక్షంలో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఈ దేశాలను హెచ్చరించారు. నిజ్జర్‌ హత్యకు నిరసనగా వివిధ దేశాలలోని భారత దౌత్య కార్యాలయాల ముందు శనివారం ప్రదర్శనలు నిర్వహించాలని ఖలిస్థానీలు నిర్ణయించడం వల్ల ఈ దేశాల తీరుతెన్నులు పూర్తిగా కళ్లకు కట్టే అవకాశం ఉంది. ఖలిస్థానీ ఆగడాలు, అఘాయిత్యాల పట్ల కెనడా ఏవిధంగా వ్యవహరించేదీ భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News