Tuesday, October 8, 2024
Homeఓపన్ పేజ్Indian Air Force Day: భారత వైమానిక దళ దినోత్సవం

Indian Air Force Day: భారత వైమానిక దళ దినోత్సవం

సెల్యూట్..

అక్టోబర్‌ 8, 2024న భారతదేశం సక్షం, సశక్త్‌ మరియు ఆత్మనిర్భర్‌ అనే థీమ్‌తో తన 92వ వైమానిక దళ దినోత్సవం జరుపుకోనుంది. భారత వైమానిక దళం (ఐఎఎఫ్‌) స్థాపనను స్మరించుకుంటూ, దేశం యొక్క గగనతలాన్ని నిరంతరం రక్షించే మన వీర వైమానిక యోధులను సత్కరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 8వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. లక్షా డెబ్బది వేల క్రియాశీలక, లక్షా నలభై వేల రిజర్వ్‌ సిబ్బందితో పాటు దాదాపు 2296 సుఖోయ్‌ ఎస్‌ యు-30, రఫెల్‌ మరియు స్వదేశీ తేజస్‌ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలతో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వైమానిక దళాలలో భారత్‌ నాల్గవ స్థానంలో ఉంది. ఐఎఎఫ్‌ బ్రిటీష్‌ వలసవాద కాలంలో వారి సహాయక వైమానిక దళంగా తొలుత 8 అక్టోబర్‌ 1932న రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఆర్‌ఐఎఎఫ్‌)గా స్థాపించ బడింది. 1947లో స్వాతంత్య్రానంతరం కూడా అదే పేరుతో కొనసాగి జనవరి 1950లో భారత గణతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత ‘రాయల్‌’ అన్న పదం తొల గించబడింది. వైమానిక దళ మొదటి విమానం ఏప్రిల్‌ 1, 1933న ఆరుగురు ఆర్‌ఎఎఫ్‌-శిక్షణ పొందిన అధి కారులు మరియు 19 మంది వైమానిక సైనికులతో జరి గింది. ఐఎఎఫ్‌ ‘మహాభారతం’ 11వ అధ్యాయంలోని 24వ శ్లోకం (నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్‌) స్ఫూర్తితో కీర్తితో ఆకాశాన్ని స్పృశిం చండి అనే నినాదాన్ని స్వీకరించింది. ఏప్రిల్‌ 1, 1954న సుబ్రతో ముఖర్జీ భారత ప్రప్రథమ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ గా నియమితులయ్యారు. కాగా సెప్టెంబర్‌ 30, 2024న భారత వైమానిక దళానికి నూతన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌గా ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరిం చారు. భారత వైమానిక దళ దినోత్సవాన్ని పురస్కరించు కుని, అక్టోబర్‌ 6, 2024న చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద 72 విమానాలతో నిర్వహించిన మెగా వైమానిక ప్రదర్శన అందరినీ అలరించింది.
అతిపెద్ద వైమానిక దళ స్టేషన్‌
జాతీయ రాజధాని పరిధిలో (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) గల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ లో హిందాన్‌ నది సమీపంలో వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌లో భాగంగా నిర్వహించబడే సుమారు 55 చదరపు కిలో మీటర్లు మరియు 14 కిలోమీటర్ల వ్యాసంతో ఏర్పాటైన భారత వైమానిక దళ స్టేషన్‌ ఆసియా ఖండంలోనే అతిపెద్ద వైమానిక దళ స్టేషన్‌ కాగా చండీగఢ్‌లో ఉన్న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ హెరిటేజ్‌ మ్యూజియం భారతదేశపు మొదటి వైమానిక దళ వారసత్వ కేంద్రం. అక్టోబర్‌ 6, 2024న తమిళనాడులో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎయిర్‌ షో ద్వారా ప్రారంభమైన వైమానిక దళ దినోత్సవ వేడుకలు ఆ తర్వాత హిండన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో ఎయిర్‌ ఫోర్స్‌ డే పరే్‌డ జరుగుతుంది. 6వ తేదీన ప్రదర్శించిన ఎయిర్‌ షోలో 72 ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా ఏరోబాటిక్స్‌ మరియు ఫ్లైపాస్ట్‌లతో పాటు భారత సైనిక వైమానిక నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో ఆకాష్‌ గంగ, సూర్య కిరణ్‌ మరియు సారంగ్‌ హెలికాప్టర్‌ డిస్‌ప్లేలు అక్కడికి విచ్చేసిన వారందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న ‘తేజస్‌’ మరియు తేలిక పాటి పోరాట హెలికాప్టర్‌ ‘ప్రచంద్‌’ వంటి స్వదేశీ రూప కల్పన మరియు అభివృద్ధి చెందిన ఈ విమానాలను చేర్చ డం రక్షణరంగంలో మన దేశ ఆత్మనిర్భరత (ఆత్మా విశ్వాసం)కు నిదర్శనగా నిలుస్తుంది.
వైమానిక దళ ర్యాంకులు
సైనిక దళాలలో ర్యాంకులకు ఒక విశిష్ట స్థానముంది. పదాతి దళ (ఆర్మీ) ర్యాంకులకు సంబంధించి సాధారణ ప్రజలకు కొంత అవగాహన ఉన్నప్పటికీ, వైమానిక మరియు నావికా దళ ర్యాంకుల గురించిన అవగాహన కాస్త తక్కువే అని చెప్పవచ్చు. పాఠకుల సమాచారం నిమి త్తం వైమానిక దళ ర్యాంకులకు సరిసమానమైన పదాతి దళ ర్యాంకుల వివరాలు బ్రాకెట్లలో ఇవ్వబడింది. మార్షల్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ ఫోర్స్‌ (ఫీల్డ్‌ మార్షల్‌), ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ (జనరల్‌), ఎయిర్‌ మార్షల్‌ (లెఫ్టినెంట్‌ జనరల్‌), ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ (మేజర్‌ జనరల్‌), ఎయిర్‌ కమడోర్‌ (బ్రిగేడియర్‌), గ్రూప్‌ కెప్టెన్‌ (కల్నల్‌), వింగ్‌ కమాండర్‌ (లెఫ్టినెంట్‌ కల్నల్‌), స్క్వాడ్రన్‌ లీడర్‌ (మేజర్‌), ఫ్లైట్‌ లెఫ్టి నెంట్‌ (కెప్టెన్‌) మరియు ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌ (లెఫ్టినెంట్‌).
భారతదేశంలో ముఖ్యమైన యుద్ధవిమానాలు
గగనతలంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, రక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి భారత వైమానిక దళం విభిన్న యుద్ధ విమానాలను నిర్వహిస్తోంది. వివిధ రకాలైన విమానాలు భారత సాయుధ దళాల వ్యూహాత్మక సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. భారత వైమానిక దళంలోని ముఖ్యమైన యుద్ధ విమానాలలో సుఖోయ్‌ ఎస్‌ యు-30 ఎంకెఐ (రష్యా/భారత్‌), దేశీయ సంస్థ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌, డస్సాల్ట్‌ రఫెల్‌ (ఫ్రాన్స్‌), మిగ్‌ 29 (రష్యా), మిరాజ్‌ 2000 (ఫ్రాన్స్‌), జాగ్వార్‌ ఐఎస్‌ (యుకె/భారత్‌) ప్రముఖంగా ప్రస్తావించదగినవి.
ఐఎఎఫ్‌ ప్రముఖ ఆపరేషన్లు
భారత గగనతలాన్ని డేగకన్నుతో అహర్నిశలు పహరా కాసే భారత వైమానిక దళం యుద్ధ, ప్రకృతి వైప రీత్యాల సమయాలలోనే కాకుండా వివిధ కీలక మాన వతా మిషన్లలో కూడా అనిర్వచనీయమైన సేవలనందిం చిన సందర్భాలు కోకొల్లలు. ఐఎఎఫ్‌ చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలలో 1961లో గోవా, డామన్‌ మరియు డయ్యూ ప్రాంతాన్ని పోర్చుగీస్‌ ఆధీనం నుండి తప్పించడానికి నిర్వహించిన ఆపరేషన్‌ విజయ్‌ సంద ర్భంగా కీలక స్థావరాలపై బాంబు దాడులు చేయడం, 1984లో నిర్వహించిన ఆపరేషన్‌ మేఘదూత్‌ సందర్భంగా (Operation Meghaduth) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ గ్లేసియర్‌ ను పునఃస్వాధీనం చేసుకునేందుకు సైనికులు మరియు సరుకు రవాణాను తరలించడం, 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధం సందర్భంగా నిర్వ హించిన ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌లో భాగంగా అత్యంత ఎత్తైన దుర్బేధ్యమైన కొండ ప్రాంతాలలో శత్రు స్థావరాలపై మిరాజ్‌-2000 మరియు మిగ్‌-21 యుద్ధ విమానాలతో దాడులు చేయడం, 2013లో ఆపరేషన్‌ రాహత్‌లో భాగం గా ఉత్తరాఖండ్‌ వరదలలో చిక్కుబడిన యాత్రీకులకు సహాయ పునరావాస ఏర్పాట్లలో ఐఎఎఫ్‌ సిబ్బంది అందించిన మానవతా చర్యలు వారి విపత్తు నిర్వహణ సామర్థ్యానికి కొలమానంగా నిలుస్తాయి. 2015లో నేపాల్‌ లో సంభవించిన ఘోర భూకంపం తరువాత చేపట్టిన ఆపరేషన్‌ మైత్రిలో భాగంగా అక్కడి బాధితుల సహాయ పునరావాసం కోసం చేయూతనందించడం, 2022లో రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్‌ లో చిక్కుబడిపోయిన భారత పౌరులను స్వదేశానికి తరలించడానికి చేపట్టిన ఆపరేషన్‌ గంగ (Operation Ganga) మరియు 2023లో టర్కీ మరియు సిరియాలలో సంభవించిన భయానక భూకంపం అనంతరం ఆపరేషన్‌ దోస్త్‌ పేరిట అందించిన మానవతా సహాయం అంతర్జాతీయ స్థాయిలో జరిగే విపత్తుల సందర్భంగా భారతదేశ శీఘ్ర ప్రతిస్పందన మరియు సర్వసన్నద్ధతకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌లో (Operation Safed Sagar) కీలక పాత్ర
1999 నాటి కార్గిల్‌ యుద్ధం సందర్భంగా చొరబాటు దారులపై పోరాడేందుకు భారత సైన్యానికి మద్దతు ఇవ్వడంలో వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ కోడ్‌ పేరుతో ఐఎఎఫ్‌ నిర్వహిం చిన ఆపరేషన్‌ యొక్క అతిపెద్ద సవాలు ఏమిటంటే, ఈ ఆపరేషన్‌ సందర్భంగా మన యుద్ధ విమానాలు కార్గిల్‌ భూభాగం మరియు నియంత్రణ రేఖలో ఉండి కార్యకలా పాలు నిర్వహించవలసి వచ్చింది. కార్గిల్‌ యుద్ధ క్షేత్రం సముద్ర మట్టానికి 4500-5500 మీటర్ల ఎత్తులో ఉండటంతో విమానం 6100 మీటర్ల ఎత్తులో ఉండాల్సి ఉంటుంది. ఈ యుద్ధం సందర్భంగా భూతల దాడుల కోసం ఐఎఎఫ్‌ మిగ్‌-21, మిగ్‌-23, మిగ్‌-27, మిరాజ్‌ 2000, జాగ్వార్‌ లను వినియోగించింది. భారత వైమానిక దళం పరిమిత యుద్ధ ప్రాంతంలో మరియు అంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో పోరాడడం ఇదే మొదటిసారి అయినప్ప టికీ తమ శక్తియుక్తులను మరియు నైపుణ్యాన్ని అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించడంలో విజయం సాధించింది.
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ భవిష్యత్తు
కృత్రిమ మేధస్సు (AI in Air Force) ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో డ్రోన్‌లు మరియు హైపర్‌సోనిక్‌ ఆయుధాలతో రక్షణ రంగం అధునాతన సాంకేతికతతో ఆధునిక యుద్ధంలో ఉద్భవిస్తున్న ముప్పుల ను పరిష్కరించడానికి ఐఎఎఫ్‌ విస్తృతంగా సిద్ధమవు తోంది. భారతదేశం మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్య క్రమాల ద్వారా రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా పయనిస్తోంది. ఒకనాడు ఆయుధాలు మరియు యుద్ధ సామాగ్రి కోసం విదేశాల పై ఆధార పడ్డ భారత దేశం రక్షణ రంగ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించడమే కాక రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 32.5 శాతం పెరుగుదలతో రికార్డు స్థాయిలో రు.21,083 కోట్లకు చేరుకున్నాయి. 2024-25 మొదటి త్రైమాసికం లో, భారతదేశ రక్షణ ఎగుమతులు రు.6,915 కోట్లకు చేరుకున్నాయి, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 78 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
ఈ సంవత్సరపు భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సర్వ శక్తులను ఒడ్డుతూ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి పదవీ విరమణ పొందిన వైమానిక దళ సిబ్బందితో పాటు నేడు ఉద్యోగ నిర్వహణలో ఉండి తమ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహిస్తున్న సిబ్బందికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుదాం.

  • యేచన్‌ చంద్ర శేఖర్‌
    మాజీ రాష్ట్ర కార్యదర్శి
    ది భారత్‌ స్కౌట్స్‌ & గైడ్స్‌, తెలంగాణ
    హైదరాబాద్‌

    8885050822
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News