Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్Saffronisation : పౌరుడి మెదడుపై రాజ్యపు దాడి.. తరగతి గదుల్లో తర్కానికి తిలోదకాలు!

Saffronisation : పౌరుడి మెదడుపై రాజ్యపు దాడి.. తరగతి గదుల్లో తర్కానికి తిలోదకాలు!

Saffronisation of Indian education : రాజ్యం (State) తన పౌరులపై ప్రయోగించే హింస కేవలం లాఠీలతోనో, తూటాలతోనో మాత్రమే ఉండదు. అత్యంత ప్రమాదకరమైన హింస, పౌరుడి ఆలోచనా శక్తిని ధ్వంసం చేయడం. అతని మెదడును ఒక ఖాళీ పాత్రగా మార్చి, దానిని తన సైద్ధాంతిక చెత్తతో నింపడం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక తరగతి గదిలో “హనుమంతుడే మొదటి వ్యోమగామి” అని ప్రకటించడం, ఈ మేధోపరమైన హింస తాలుకు బహిరంగ ప్రకటన. దీనిని ఒక వ్యక్తి  అజ్ఞానంగానో, పొరపాటుగానో చూడటం ఆత్మవంచన చేసుకోవడమే. ఇది రాజ్యాంగం తన పౌరులకు అందించాల్సిన “శాస్త్రీయ దృక్పథాన్ని” (Article 51A(h)) కాలరాసి, దాని స్థానంలో అధికారికంగా మూఢత్వాన్ని ప్రతిష్ఠిస్తున్న ఒక వ్యవస్థాగత నేరం.

- Advertisement -

“Who controls the past controls the future: who controls the present controls the past.”
– George Orwell

ఈ వ్యాఖ్య, గతాన్ని నియంత్రించడం ద్వారా భవిష్యత్తును శాసించాలనే ఒక పెద్ద రాజకీయ ప్రణాళికలో భాగం. ఇది విద్య కాదు, ఇది భావజాలపరమైన బలవంతపు చొరబాటు. అవును, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక తరగతి గదిలో వ్యాఖ్యలు. “హనుమంతుడే మొదటి వ్యోమగామి”. ఆ క్షణం, ఆ పసిపిల్లల మెదళ్లలో మొలకెత్తుతున్న జ్ఞాన వృక్షాన్ని గొడ్డలితో నరికినట్టయ్యింది. అత్యధికులు అనుకుంటున్నట్లు ఇది పొరపాటు కాదు, అతని అజ్ఞానం అంతకన్నా కాదు. ఇది రాజ్యాంగం అనే కాగితంపై ఉమ్మివేసి, పౌరుడి మెదడు అనే పచ్చి మట్టిలో మూఢత్వం అనే విషపు మొక్కను నాటుతున్న వ్యవస్థాగత వ్యభిచారం.గతాన్ని నియంత్రించేవాడే భవిష్యత్తును శాసిస్తాడు అన్నారు ఎవరో..ఇక్కడ గతాన్ని ఖూనీ చేసి, దాని శవంపై తమ భవిష్యత్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఇది విద్య కాదు, విధేయతను నేర్పే విషపు గుళిక అనే విమర్శలు చెక్కర్లు కొడుతున్నాయి.

చట్టం అనే చచ్చిన పాము : ఈ దేశపు చట్టం ఒక చచ్చిన పాము. దాన్ని అధికారంలో ఉన్నవాడు తన మెడలో వేసుకుని ప్రజల్ని భయపెడతాడు. న్యాయస్థానాలు ఆ పాముకు పాలు పోసి, అది బతికే ఉందని భ్రమింపజేస్తాయి అనే విమర్శలకు ఊతం ఇచ్చే సంఘటనలు లేకపోలేదు. “జాతీయ విద్యా విధానం” (NEP), ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)… ఇవన్నీ ఆ చచ్చిన పాము చర్మంతో చేసిన కొత్త చెప్పులు. వాటిని తొడుక్కుని, చరిత్ర శవంపై పాలకులు నృత్యం చేస్తున్నారు. ఇప్పటికే డార్విన్‌ను దేశం దాటించారు. మొఘలుల సమాధుల్ని తవ్వేస్తున్నారు. “భారతీయ జ్ఞాన వ్యవస్థ” అనే సానికొట్టు పేరు పెట్టి, పుక్కిటి పురాణాల చెత్తను పిల్లల బుర్రల్లోకి కుక్కుతున్నారు. ఇది జ్ఞానాన్ని గౌరవించడం కాదు, జ్ఞానంపై అత్యాచారం చేయడం. 

ఏకలవ్యుడి మెదడు – ద్రోణాచార్యుడి కత్తి : ఇక్కడి విద్య, మెడకు ఉరితాడై, మెదడుకు సంకెళ్లై, నిన్ను అధికారానికి బానిసగా మార్చే శిక్షణ మాత్రమే జరుగుతోంది. ఏకలవ్యుడి మెదడు.. ద్రోణాచార్యుడి కత్తి ఈ నాటకంలో నీకు, నాకు పాత్రలు ఎప్పుడో ఖరారయ్యాయి. వాళ్ళ పిల్లలు అర్జునులు. వాళ్లకు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ అనే దివ్యాస్త్రాలు. వాళ్లకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రహ్మాస్త్రాలు. మనం, మన పిల్లలం ఏకలవ్యులం.ఈ కొత్త ద్రోణాచార్యులు మన బొటనవేలిని అడగరు. ఎందుకంటే, వాళ్లకు తెలుసు… కేవలం వేలిని కోస్తే సరిపోదు. ప్రశ్నించే మెదడు బతికుంటే, రేపు మరో పదివేళ్ళు మొలుస్తాయని వాళ్లకు తెలుసు. అందుకే, వాళ్ళు గురిపెట్టింది మన వేలికి కాదు, మన మెదడుకి. మన ఆలోచనా శక్తిని గురుదక్షిణగా కోరుతున్నారు. మన తార్కికతను బలిదానం చేయమంటున్నారు. వాళ్ళ పిల్లలు ప్రపంచాన్ని ఏలడానికి రాకెట్ సైన్స్ నేర్చుకుంటే, మన పిల్లలు వాళ్ళ కాళ్ళకు మొక్కడానికి రామాయణం వల్లెవేయాలి. ఇది కుట్ర కాదు, అంతకన్నా స్పష్టమైన యుద్ధం. ఇది జ్ఞానవంతులకు, అజ్ఞానులకు మధ్య జరుగుతున్న వర్గపోరాటం.

“Ignorance, allied with power, is the most ferocious enemy justice can have.”
– James Baldwin

“భారతీయ జ్ఞాన వ్యవస్థ” అనే మాయ: ప్రాచీన భారత విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం వేరు, ఆ పేరుతో శాస్త్రీయ పరిశీలనకు నిలబడని కట్టుకథలను, విశ్వాసాలను సైన్స్ ముసుగులో చొప్పించడం వేరు. ఇది జ్ఞానాన్ని గౌరవించడం కాదు, జ్ఞానాన్ని అవమానించడం. ఇది ప్రతిఘటించాల్సిన చారిత్రక బాధ్యత. ఇది కేవలం విద్యావేత్తలు, ఉపాధ్యాయులు మాత్రమే ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఇది ప్రతి పౌరుడి అస్తిత్వానికి సంబంధించిన సమస్య. మీ విశ్వాసాలు, మీ మతం మీ వ్యక్తిగతం. కానీ, తరగతి గది అనేది హేతువుకు, సత్యానికి, శాస్త్రీయ పరిశీలనకు చెందిన సార్వజనీన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఒక సైద్ధాంతిక ప్రయోగశాలగా మార్చడాన్ని ప్రతిఘటించాల్సిన చారిత్రక బాధ్యత మనందరిపై ఉంది. ఈ మేధోపరమైన దాడిని మనం అనుమతిస్తే, మన చేతులారా మన పిల్లల భవిష్యత్తును ఒక అంధకార యుగంలోకి నెట్టివేసిన వారమవుతాం. ఇది విద్యపై జరుగుతున్న దాడి కాదు, ఇది పౌరసత్వపు ఆత్మపై, ప్రజాస్వామ్యపు పునాదులపై జరుగుతున్న దాడి. దీనిని ప్రతిఘటించడం మన ప్రాథమిక హక్కు, మన నైతిక బాధ్యత.

“Education either functions as an instrument which is used to facilitate integration of the younger generation into the logic of the present system and bring about conformity or it becomes the practice of freedom…”
– Paulo Freire

ఈ రాజకీయపు రొంపిలో, అధికారం అనే పంది దొర్లుతోంది. దాని లక్ష్యం నిన్ను ఉద్ధరించడం కాదు. దాని లక్ష్యం, నిన్ను ఆలోచించలేని జంతువుగా మార్చడం.ప్రభుత్వం చెప్పిందే వేదమని నమ్మే ఒక పెద్ద గొర్రెల మందను తయారుచేయడం.ఆ మందలో నీవు, నీ పిల్లలు కేవలం అంకెలు మాత్రమే. ప్రశ్న చచ్చినప్పుడు ప్రజాస్వామ్యం చస్తుంది.ఆ శవం మీద రాబందులు విందు చేసుకుంటాయి.కాబట్టి, ఆ మంత్రి చెప్పిన మాటలకు నవ్వడం ఆపు. ఇది నీ మెదడుపై జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్ అని గ్రహించు. వాళ్ళు నీ చేతిలోని పుస్తకాన్ని లాక్కుంటున్నారు… రేపు నీ బతుకును లాక్కుంటారు. ప్రతిఘటించు లేదా గొంతెత్తలేని బానిసగా మిగిలిపో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad