Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Indian politics changing rapidly: రాజకీయ చెలగాటాలు, ప్రాణ సంకటాలు

Indian politics changing rapidly: రాజకీయ చెలగాటాలు, ప్రాణ సంకటాలు

శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు

దేశ రాజకీయ పదజాలంలో కొత్తగా చేరిన పదం ఓటు కోత. నిజానికి దీన్ని వివరించి చెబితే తప్ప దీని అర్థం, పరమార్థం పూర్తిగా బోధపడే అవకాశం లేదు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఓట్ల వెల్లువ, ఓటు బ్యాంకు వంటి పదాలకు పక్కనే ఈ పదాన్ని కూడా చేర్చడం జరుగుతోంది. ‘ఓట్ కటువా’ పేరుతో ఇప్పటికే ఈ పదం ఉత్తర భారతదేశంలో బహుళ ప్రచారంలో ఉంది. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రారంభమైన ఈ పదం లేదా ఈ ధోరణి క్రమంగా దేశవ్యాప్తంగా పాకిపోతోందని రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల నిపుణులు భావిస్తున్నారు.
రాజకీయ ముఖ చిత్రం మీద అకస్మాత్తుగా కొన్ని చిన్న పార్టీలు అవతరించడాన్ని రాజకీయ విశ్లేషకులు ఓటు కోతగా అభివర్ణిస్తున్నారు. స్వయంగా విజయాలు సాధించలేని చిన్న పార్టీలు పెద్ద పార్టీలకు కొమ్ముకాస్తూ తమ ప్రత్యర్థిని దెబ్బ తీయడానికి, ఏదో విధంగా ఓట్లు చీల్చి తమకు ఇష్టమైన పార్టీ విజయం
సాధించేలా చేయడానికి ఏర్పడుతుంటాయి. తమకు ప్రత్యర్థి అయిన పార్టీని ఏదో విధంగా దెబ్బతీయడం ఈ చిన్న పార్టీల ప్రధాన లక్ష్యం. ఈ చిన్న పార్టీలు తమకు తాముగా గెలవలేవు. కానీ, గెలిచే అవకాశాలను పెద్ద పార్టీలకు కల్పిస్తూ ఉంటాయి. పెద్ద పార్టీలు తమను ఉపయోగించుకోవడానికి అవకాశమిస్తాయి. పెద్ద
పార్టీలు ఇచ్చే తృణమో, పణమో జేబులో వేసుకుని, మద్దతు పేరుతో, పొత్తు పేరుతో పెద్ద పార్టీలతో మమేకం అయి, ఓట్లు చీల్చడానికి ఉపయోగపడుతుంటాయి. ఇటువంటివి ఎన్నికల సమయంలో ఏర్పడవచ్చు. అంతకు ముందే కూడా ఏర్పడవచ్చు.

- Advertisement -

నిజానికి కొన్ని చిన్న పార్టీలు ప్రధాన పార్టీలకు కొమ్ము కాయడానికి మాత్రమే ఏర్పడతాయిని భావించడానికి వీల్లేదు. అవి తిరుగుబాటు పార్టీలుగా కూడా ఏర్పడతాయి. తమ పార్టీ మీద అలిగో, కోపం వచ్చో, మనస్తాపం చెందో కొందరు నాయకులు బయటికి వచ్చేసి సొంత కుంపటి పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవి చివరికి మఖలో పుట్టి పుబ్బలో నిష్క్రమించే పార్టీలు కూడా కావచ్చు. ఒక్కోసారి ఈ పార్టీలు కులం కారణంగానో, మతం కారణంగానో ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవి స్థానిక రాజకీయాలు లేదా ఎన్నికలను కొద్దో గొప్పో ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇవి ముఖాముఖీ పోటీలున్న నియోజకవర్గాల్లో పెద్ద పార్టీల ఓట్లను చీల్చడం, కొన్ని స్థానాల మీద తమ ప్రభావాన్ని కనబరచడం
జరుగుతుంటుంది.

పగ సాధింపు ప్రయత్నాలు
బీహార్ రాష్ట్రంలో 2020లోనూ, పశ్చిమ బెంగాల్ లో 2021 ఎన్నికల్లోనూ ఈ చిన్న పార్టీల ప్రభావం బాగా కనిపించింది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ, జనతా దళ్, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసిన మహా గఠ్ బంధన్ (ఎం.జి.బి)లు పోటీ చేయడం
జరిగింది. తాము చిన్న పార్టీల కారణంగా దెబ్బ తిన్నామని ఈ రెండు కూటములూ చివరికి ప్రకటించడం జరిగింది. రాంవిలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి విడిపడిన చిరాగ్ పాశ్వాన్ కారణంగానే తమ ఎన్.డి.ఎ విజయం సాధించలేక పోయిందని బీజేపీ నాయకులు ఎన్నికల తర్వాత ప్రకటించారు. కాగా, తాము అతి తక్కువ మెజారిటీతో గెలవడానికి అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లీస్ పార్టీయే కారణమని మహా గఠ్ బంధన్ నాయకులు కూడా వాపోవడం జరిగింది. అధికారంలోకి రావడానికి మహా గఠ్ బంధన్ నానా పాట్లూ పడింది. బీహార్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాక దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఈ తర్వాత చీలిపోయింది. ఇందులో ప్రధాన వర్గానికి నాయకుడుగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ (రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు) ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపడం జరిగింది. అయితే, ఈ పార్టీ చీలిక వర్గం కారణంగా బీజేపీ దారుణంగా దెబ్బతిన్నది.

బీహార్ లో రాజకీయంగా ఎదగడానికే కాక, ఎన్నికల పరంగా విజయాలు సాధించడానికి అనేక అవకాశాలుంటాయి. చివరికి ఎన్నికల సమయంలోనూ, రాజకీయాల్లోనూ గుర్తింపు సంపాదించు కోవడానికి రౌడీయిజం, గూండాయిజం వంటివి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఏదో ఒక చిన్న పార్టీని ప్రారంభించి, చిన్నపాటి ఓటు బ్యాంకును కూడగట్టుకుని అతి తేలికగా కోటీశ్వరులు అయిపోవచ్చు. నిజానికి, ఇక్కడ బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఈసారి చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ,
చిరాగ్ పాశ్వాన్ తో చేతులు కలపడం వల్ల అత్యధిక సంఖ్యాక దళితులకు దూరం కావాల్సి వచ్చింది. అది మహా గఠ్ బంధన్ నుంచి హిందూస్థాన్ ఆవామ్ మోర్చాకు చెందిన దళిత నాయకుడు జితన్ రాం మంజీని ఆ కూటమికి దూరం చేయగలిగింది. మంజీ కుమారుడు నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ తండ్రిని తమ వైపునకు తిప్పుకోగలిగింది. అయినప్పటికీ చిరాగ్ పాశ్వాన్ కారణంగా ఆ పార్టీ
దారుణంగా నష్టపోయింది.

భస్మాసుర హస్తాలు
విచిత్రమేమిటంటే, బీజేపీ, కాంగ్రెస్ తోమ సహా కొన్ని ప్రధాన పార్టీలు తమ ప్రధాన ప్రతిపక్షం, తమ ప్రధాన ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడానికి చిన్న పార్టీలను ప్రోత్సహించడం కూడా జరుగుతోంది. అయితే, ఎక్కువ పర్యాయాలు విజయం సాధించలేకపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతే ఒక్కోసారి
ప్రబలంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో హఠాత్తుగా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనే కొత్త పార్టీ అవతరించింది. ముస్లిం ఓట్లను సంపాదించడమే లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ బీజేపీ సృష్టే అని మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్
ఆరోపించింది కానీ, అది వాస్తవ దూరమని అతి త్వరలోనే తేలిపోయింది. ఈ ఫ్రంట్ చివరికి కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపి ఒకే ఒక సీటు సంపాదించుకోగలిగింది. పైగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకును చాలావరకు చీల్చింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ కొంతవరకూ నష్టపరచింది.

ఇక లౌకికవాద పార్టీలను దెబ్బతీయడానికి బీజేపీ అసదుద్దీన్ ఒవైసీని ఉపయోగించుకుంటోం దనే ప్రచారం కూడా రఅప్పుడప్పుడూ బయటకి వస్తూ ఉంటుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీ పోటీ చేసి, ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న అయిదు శాసనసభా స్థానాల్లో ఘన విజయం సాధించినప్పుడు, కాంగ్రెస్ పార్టీ లబోదిబోమంది. తమ ఓటు బ్యాంకును మజ్లిస్ కొల్లగొట్టిందంటూ వ్యాఖ్యానాలు చేసింది. మొత్తం మీద రాష్ట్రం కాని రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఆ పార్టీకి తీరని నష్టం కలిగించింది. పౌరసత్వ సవరణ బిల్లు వంటి కీలక బిల్లుల విషయంలో మహా
గఠ్ బంధన్ అల్పసంఖ్యాక వర్గాలకు అనుకూలంగా వ్యవహరించనందువల్లే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని ఒవైసీ ఆరోపించారు. దానికి కాంగ్రెస్ నుంచి సమాధానం రాలేదు. మొత్తం మీద ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉన్న ఈ పార్టీ అయినా ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ చేయవచ్చనే సూత్రాన్ని ప్రధాన పార్టీలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు ఇక అనుక్షణంగా అప్రమత్తంగా ఉండక తప్పదు.

పొంచి ఉన్న ప్రమాదం
ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడి ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ముఖాముఖీ తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిన్న పార్టీల నుంచి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు. ఈ రాష్ట్రాలలో తృతీయ పక్షాలు ఎంతో చురుకుగా పని చేస్తున్నాయి. సరైన సమయం కోసం గద్దల్లా నిరీక్షిస్తున్నాయి. తొంభై స్థానాల చత్తీస్ గఢ్ శాసనసభలో తగిన స్థానం సంపాదించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తో సహా నాలుగు పార్టీలు భీకర పోరాటం సాగిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి చీలి పోయిన మరో రెండు పార్టీలు కూడా తమను ‘నిర్లక్ష్యం’ చేసినందుకు కాంగ్రెస్ మీద పగ సాధించా లనే ప్రయత్నంలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి హమర్ రాజ్ పార్టీని ప్రారంభించిన అరవింద్ నేతమ్ రాష్ట్రంలో ఆదివాసీలను, గిరిజనులను నిర్లక్ష్యంమ చేసినందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు త్వరలో గుణపాఠం చెప్పబోతున్నట్టు హెచ్చరించడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పడి నాటి నుంచి ఇప్పటి వరకూ ఆదివాసీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాలేదని ఆయన అన్నారు. ఇక స్వర్గీయ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కుమారుడు అమిత్ జోగీ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీ పెట్టి, ప్రధాన పార్టీలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక ఇక్కడ బి.ఎస్.పి, గోండ్వానా గణతంత్ర పార్టీలు చేతులు కలిపాయి. ఇక్కడ ప్రధాన పార్టీలు చిన్న పార్టీల కారణంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడి ఉంది. ఇక్కడ కూడా బి.ఎస్.పి, గోండ్వానా గణతంత్ర పార్టీలు చేతులు కలిపి, సమయం కోసం నిరీక్షిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా, రాజస్థాన్ లో జాట్లు, దళితుల ఓట్లను చేజిక్కించుకునేందుకు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ రవణ్ కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ, హనుమాన్ బేనీవాల్ కు చెందిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీతో చేతులు కలిపింది. నిజానికి ఈ రెండు కులాల మధ్య వందలాది సంవత్సరాల నుంచి బద్ధ వైరం నెలకొని ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బలమైన స్థానంలో ఉన్న భారత్ ఆదివాసీ పార్టీ, గ్రామీణ కిసాన్ మజ్దూర్ సమితిలతో చేతులు కలపడానికి ఏమాత్రం ఇష్టపడకపోగా, మహా గఠ్ బంధన్ కూటమిలో ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ తో చేతులు కలిపింది. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ మీద కక్ష సాధించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. విచిత్రమేమిటంటే, ఈ రాష్ట్రాల్లో ఇండియా కూటమి లేదా మహా గఠ్ బంధన్ విజయం సాధించకుండా ఉండడానికి ఈ పార్టీలు తెలిసో తెలియకో కృషి చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, జనతా దళ్ (యు)లు
వేటికవే పోటీ చేయడం జరుగుతోంది. ఒక రాష్ట్రంలో పెద్ద పార్టీగా, ప్రధాన పార్టీగా ఉన్న పార్టీ మరో రాష్ట్రంలో చిన్న పార్టీగా ఉండడం సహజం. అయినప్పటికీ అలవిగాని చోట అధికులుగా చెలామణీ అయ్యే ప్రయత్నం జరుగుతోంది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News