మనదేశంలో మొన్నటి వరకు టమాటాల ధరలు కిలో రూ 200లకు పైగా నింగినెక్కి కూర్చున్నాయి. ఆ ధరల మంటకు సామాన్యు, మధ్యతరగతి వారి నోట మాట రాలేదు. వంట గదిలో టమాటా లేకుండా వంటకాలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. టమాటాపై సామాజిక మాధ్యమాల్లో అనేక రకాల సెటైర్లు వైరల్ అయినాయి. కానీ నేడు ఆ టమాటా ధరలు తగ్గిపోయి, కిలో..1 రూ పడి పోయింది. రోడ్లపై టమాట పంటను పడబోసే పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు ఇప్పుడు ఉల్లి తన ఘాటుకు తోడు ధరలు పెరుగుదలతో వినియోగదారులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వీటికి తోడు కొన్ని నిత్యావసరాల ధరలు 50శాతం పైగా పెరిగిపోయినాయి. వీటి ధరల నియంత్రణకై ప్రభుత్వాల వద్ద ఉత్పత్తి, సప్లై, డిమాండ్లను నియంత్రణా ప్రణాళికలు, విధానాలు లేకపోవడంతో రైతులు, వినియోగదారులు నష్టపోతున్నది నిజం కాదా!. ప్రజలు కూరగాయలు పప్పులు, బియ్యం, జీలకర్ర పాలు వంటి నిత్యవసరాల ధరలు చూసి హడలెత్తి పోతున్నారు. ఇలాంటి వేళ బుక్కెడు బువ్వ నోట్లోకి వెళ్ళడం ఎలా! బతుకు బండి సాగేదేలా అని ప్రజలు దిగులు చెందుతున్నారు. వేసవికాలంలో అకాల వర్షాలు, ఆ తర్వాత వర్షాభావం మరికొన్ని రోజులకు భారీ వర్షాలు ఇలా విభిన్న వాతావరణ పరిస్థితులతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రోటీన్లు అధికంగా లభించే కంది పప్పును తెలుగు ప్రజలు నిత్యం భోజనంలో వినియోగిస్తారు. కందిపప్పు కిలో ధర ఆరు నెలల్లోనే దాదాపు 50 శాతం పెరిగిపోయింది. ప్రస్తుతం దీని ధర 170 కి చేరింది. మన రాష్ట్రానికి కందిపప్పు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తుంది. అక్కడ కూడా వర్షాలు లేక దిగుబడి తగ్గిందని తెలుస్తుంది. దీనితో సామాన్య, మధ్యతరగతి వారు కంది పప్పు ప్రత్యామ్నాయంగా పెసరు (ఎర్ర) పప్పు వాడుతున్నారు. అలాగే బియ్యం ధరలు కూడా భారీగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సన్నబియ్యం ఎగుమతులపై నిషేధం విధించకపోతే? మరింత పెరిగేవని వ్యాపారులు అంటున్నారు. జీలకర్ర లేకుండానే పోపు చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం. ఐదారు నెలల క్రితం జీలకర్ర ధర కిలోకి 300 లోపే ఉండేది. నేడు జీలకర్ర ధర రూ700 పైగా పలుకుతుంది. అంతేకాదు రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తన నెలవారి రిపోర్టులో తెలిపినారు. దీంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో మరింత ఆందోళన పెరిగింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు తాత్కాలికమేనని ప్రభుత్వం అంటున్నప్పటికీ, ధరల నియంత్రణ చర్యల్లో చిత్తశుద్ధి లోపించింది. గత కొన్నేళ్లుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గింది లేదు. చేరువలో ఎన్నికలున్న దృష్ట్యా ప్రజల్లో ఆందోళనలు తగ్గించేందుకు ధైర్యం కల్పించే మాటలు చెబుతున్నారు. కానీ ఆకాశాన్ని తాకుతున్న నిత్యవసరాల ధరలతో ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ధరలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలతో అదుపు చేస్తామని, ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. మన దేశంలో సుమారు 22 శాతం మంది ప్రజలు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు. వీరి రోజువారి ఆదాయం చాలా చాలా తక్కువగా ఉన్నట్లు అధికార గణాంకాలు చెప్తున్నారు. దీన్ని బట్టి 40 కోట్ల మంది ప్రజలు నిత్యవసర సరుకులు కొనలేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజల ఆదాయానికి అనుగుణంగా ధరలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. మనదేశంలో గత దశాబ్ద కాలంలో పెరిగినంతగా నిత్యావసరాల ధరలు అంతకు ముందు ఎన్నడు పెరగలేదు. ఉప్పు, పప్పులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల కొనసాగుతూనే ఉంది. పోనీ ప్రభుత్వాలు ప్రజల ఆదాయాన్ని, ఉపాధి, ఉద్యోగ కల్పనలో ఏమైనా పెరిగినాయా అంటే? పెరగడం కాదు కదా.. ఉన్న ఆదాయం తెగ్గోసుకపోయాయి. నేడు ఒకవైపు ఆదాయం తగ్గడంతో పాటు మరోవైపు ధరల దరువును (భారాన్ని) భరించలేక సామాన్య, మధ్యతరగతి వారు దయనీయంగా జీవనాన్ని గడుపుతున్నారు. ఉద్యోగ వర్గాల వారికి ఐదు శాతం జీతాలు పెంచితే, 20 శాతం ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆరు నెలల కోసారి మార్కెట్ ధరలను అనుసరించి డిఏలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మన పాలకులు అవి కూడా ఇవ్వడం లేదు. కానీ ధనవంతులు, కార్పోరేట్ల సంస్థలకు 25 శాతం మాత్రమే సంపద పన్ను వేస్తున్నారు. అదే అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి తదితర దేశాల్లో సంపదపై పన్ను 35 శాతం వేస్తున్నారు. పేదలపై పన్నులు, సెస్సుల రూపంలో నిర్ధాక్షణంగా రక్తాన్ని పిల్చే జలగల్లా వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుకుంటున్నారు. మన ప్రభుత్వాలు పేదల కడుపు కాల్చి బడా వ్యాపార, కార్పొరేట్ వర్గాలకు రాయతీలిస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నది వాస్తవం కాదా!. ఇన్నాళ్లు ధరల పెరుగుదల మీద నిర్ల క్ష్యంగా ఉండి, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ధరల పెరుగుదల ప్రభావంతో ప్రజలు గతంలో పాలక పార్టీలను అధికార పీఠం నుంచి దించిన దాఖలాలు ఉన్నాయని తాత్కాలిక చర్యలకు పూనుకుంటున్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి కానీ నికరంగా ప్రజలకు మేలు జరిగే విధానపరమైన ప్రణాళిక బద్ధమైన ధరల నియంత్రణ నిర్ణయాలను తీసుకోవాలి. మనదేశంలోని కేరళ రాష్ట్రంలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో చౌక డిపోల ద్వారా అన్ని రకాల నిత్యావసర సరుకులు ప్రజలకు అందించేలా స్థిరమైన విధానాలు చేపట్టాలి. పండించే రైతుకు, వినియోగదారులకు నష్టం జరగకుండా చూడాలి. మధ్య దళారీ వ్యవస్థను నియంత్రించాలి. ప్రజల తలసరి ఆదాయం పెంచాలి. ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు అసంఘటిత కార్మికుల ఆదాయం పెంచేస్తూ మెరుగైన జీవనాన్ని అందించే విధానాలు రూపొందించాలి. ప్రభుత్వాలు కార్పొరేట్ల, ధనవంతుల భజన మానాలి. మీకు ఓట్లు వేసి అధికార పీఠంలో కూర్చోబెట్టిన ప్రజల సంక్షేమానికి కట్టుబడాలి. తక్షణమే ధరల పెరగుదలను నియంత్రించాలి. ప్రభుత్వాల ధ్యేయం ప్రజల సంక్షేమం, శ్రేయో రాజ్యం ఏర్పాటేనని మరవకండీ..
మేకిరి దామోదర్
సామాజిక విశ్లేషకులు
- 9573666650.