పుట్టిన ప్రతీ జీవి, ఏదో ఒకరోజు గతించక తప్పదు. కొత్తనీరొచ్చి పాత నీటిని ఆవలికి గెంటడం తథ్యం. ముడతలు పడి,జవసత్వాలు నశించిన తర్వాత సర్వోత్కృష్టమనుకున్న మానవ జీవులు కూడా కాలవాహినికి అంకితం కాక తప్పదు.
“నదీనాం సాగరో గతిః” అన్నట్టుగా సకల జీవరాశులు ఏదో ఒక రోజు మృత్యువు ముంగిట్లో ఒదిగిపోక తప్పదు. మూణ్ణాళ్ళ ముచ్చటైన జీవితాన్ని ఆస్వాదించి, గతించడమే మానవ జీవిత చక్రభ్రమణంలోని ఆఖరి మజిలీ.
“వార్ధక్యం” అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో చోటుచేసుకునే సహజ ప్రక్రియ.ఎలాంటి బాధలు,కష్టాలు,కన్నీళ్ళు లేకుండావృద్ధాప్యాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా ఆస్వాదించాలి. జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి వయోభారం ముంచుకొస్తున్న తరుణంలో ఇంకా వారిని బాధలకు గురిచేసి, ఆప్యాయతలను చెరిపేసి, వృద్ధాప్యంలో అనాథలుగా వదిలేయడమో,అనాథాశ్రమాలకు గెంటేయడమో జరుగుతున్నది. ఇంతకంటే అమానుషత్వం మరొకటుండదు.వైద్య,ఆరోగ్య సదుపాయాలు పెరిగిన నేపథ్యంలో వయోవృద్ధుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం భారత దేశంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల సంఖ్య 2050 నాటికి 20శాతం పెరగవచ్చునని తెలియవస్తున్నది. 80 సంవత్సరాలు దాటిన వృద్ధుల ఆరోగ్య సమస్యల విషయంలో మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుంది.1990 డిసెంబర్ 14 వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ప్రతీ సంవత్సరం అక్టోబర్ 1 వతేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడి, జీవిత చరమాంకంలో వారిని ప్రశాంతంగా ఉండేటట్లు చూడడమే ప్రపంచ వృద్ధుల దినోత్సవ ప్రధానలక్ష్యం.
మానవుడు సర్వ జీవరాశుల్లో అత్యంత శక్తివంతుడు. యుక్తిలో,మేథాశక్తిలో మానవుడికి మానవుడే సాటి. మానవ జీవపరిణామ క్రమం ఎంత విచిత్రం గా ఉన్నా, ఎన్ని మజిలీలు దాటి,ఆధునిక మానవునిగా అవతరించినా మనిషి లోని మేథస్సు వక్రమార్గంలో పయనించడం వలన రాతియుగపు మానవుడు పునరావిర్భావం చెందినట్టుగా అనిపించడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికత ఒక విప్లవంగా సమాజంలో దూసుకు వచ్చిన తర్వాత మానవుల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. మనిషికీ మనిషికీ మధ్య పొసగడం లేదు. మానవత్వం మసక బారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు కలహాలకు నిలయాలుగా మారాయి. స్వేచ్ఛ పేరుతో ఉమ్మడి కుటుంబాలు వేరుబడి, న్యూక్లియర్ కుటుంబాలుగా పరివర్తన చెందాయి.స్వార్ధమనే అనారోగ్యం సోకి, సంకుచిత మనస్తత్వాలతో ఎవరికివారే యమునా తీరే అనే రీతిలో తయారై చివరికి జన్మప్రదాతలైన తల్లిదండ్రులను సైతం విస్మరిస్తున్న వైనం అనాగరికతను సూచిస్తున్నది.పుట్టిన ప్రతీ వ్యక్తి గిట్టకతప్పదు. ప్రతీ ఒక్కరూ బాల్యం,యవ్వనం,కౌమారం అనే దశలను దాటి వృద్ధాప్యం అనే చివరి దశను స్ఫృశించక తప్పదు. వృద్ధాప్యం ఒక శాపం కారాదు. దురదృష్టవశాత్తూ నేటి వ్యవస్థలో వృద్ధులకు లభిస్తున్న గౌరవం శూన్యం. తమ ఇంట పనిమనుషులకున్న గౌరవం కూడా తల్లిదండ్రులకు లభించడం లేదు. శరీరం సహకరించపోయినా, బండెడు చాకిరీ చేస్తున్నా, ఇసుమంత ప్రేమాభిమానాలకు సైతం కరువై,బ్రతుకే బరువై ఆత్మహత్యలకు పాల్పడుతున్న పెద్దలను మనం ఎంతో మందిని చూస్తున్నాం. కనిపెంచిన పిల్లలు కఠినహృదయులై పెద్దలను బయటకు గెంటుతున్నారు. పెంపుడు కుక్కలకు పరమాన్నాలు- పట్టు పరువు పవళింపు సేవలు. కని పెంచి,విద్యాబుద్ధులు నేర్పించి,బ్రతుకుదెరువు కల్పించి, కోట్లాది రూపాయల స్థిరచరాస్తులను అనుభవించమని అప్పగించినా తల్లి దండ్రుల స్థానం మాత్రం ఇంటిబయటే.అందరూ ఉండి కూడా అనాథలుగా రహదారుల వెంట బిచ్చమెత్తుకుంటూ దీనాతిధీనంగా బ్రతుకీడుస్తున్న అభాగ్యులైన వృద్ధులను చూసి మానవత్వం తలదించుకుంటున్నది.కొందరైతే కనిపెంచిన వారిని సైతం తమ తల్లిదండ్రులుగా చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నారు.నామోషీ గా భావిస్తున్నారు. విద్యావంతుల్లోనే ఇలాంటి ధోరణి అధికంగా ఉంది. చదువులు నేర్పించిన సంస్కారం ఇదేనేమో!?ఉద్యోగాల పేరుతో భార్యాభర్తలు ఆఫీసుల్లో…చదువుల పేరుతో పిల్లలేమో మనసులేని,వికాసం లేని మరమనుషులుగా తయారుచేసే కర్మాగారాల్లాంటి విద్యాలయాల్లో….జీవితమంతా కష్టాలను అనుభవించి, జీవిత చరమాంకంలోనైనా ప్రశాంతంగా తమ బిడ్డల వద్ద సేద తీరవలసిన వృద్దులైన తల్లిదండ్రులేమో వృద్దాశ్రమాల్లో…ఇదీ నడుస్తున్న చరిత్ర. ఒకరికొకరికి సంబంధం లేని వింతజీవితాల్లో సంబంధాల గురించి ఇంతకంటే గొప్పగా వర్ణించలేము.అనాథలైన వృద్ధులు వృద్ధాశ్రమాలను ఆశ్రయించడంలో తప్పులేదు. అందరూ ఉండి అనాథలుగా బ్రతుకీడ్చవలసిన ఆగత్యం పట్టడం దురదృష్టకరం. ఇదే ఆధునిక మానవ పరిణామ ప్రక్రియ.జీవిత సర్వస్వం ధారబోసి, ఆస్తులిచ్చిన తల్లిదండ్రులకు అవసానదశలో తమ సంతానమిచ్చిన విలువైన బహుమానం ఇదేనా?తాము పడ్డ కష్టాలు తమ బిడ్డలు పడరాదని, జీవిత సర్వస్వం ధారబోసి, రేయింబవళ్లు కష్టించి తమ స్వేదాన్ని సంపదగా మార్చి,తమ సంతానానికి అందిస్తే, అవన్నీ మరచి పోయి, వృద్ధాప్యభారంతో అల్లాడుతున్న తల్లిదండ్రుల ఆలనాపాలనా మరచి, ఈసడింపులతో విసిరేయడం సంస్కారమా? పెద్దలను విస్మరించి,వారి బాగోగులను గాలికి వదిలేసిన ప్రబుద్దులు పొర్లు దండాలు పెడుతూ నిరంతర దైవార్చనలో మునిగితేలితే దైవం హర్షిస్తుందా? ప్రస్తుత నవతరంలో మార్పురావాలి. బంధాలకు విలువనివ్వాలి. పసిప్రాయంలోనే చదువుల పేరుతో పిల్లలను దూరప్రాంతాలకు పంపించడం వలన ప్రేమాభిమానాలకు దూరమైన పిల్లలు,పెద్దవారై విలువలను త్యజించి ఉన్మాదులుగా తయారౌవుతున్నారు. ఈ విషయాన్ని పెద్దలు గమనించి, కనీసం 15 సంవత్సరాల వయసొచ్చేవరకు తమ వద్దే ఉంచి విద్యాబుద్ధులు నేర్పాలి. ఉపాధ్యాయులు కూడా బాలల పట్ల కొద్ది పాటి శ్రద్ద వహించి పెద్దలపట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. నైతిక ప్రవర్తన పెంపుదలకు ప్రాధాన్యత నివ్వాలి. అప్పుడే బాలలు మానసికంగా వికసించి, పెరిగి పెద్దవారైన తర్వాత వారిలో తల్లిదండ్రులను గౌరవించే ఉన్నతమైన సంస్కారం అలవడుతుతుంది. అప్పుడే వృద్ధాశ్రమాలు లేని సమాజం నెలకొంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. అలాంటి రోజుల కోసం ప్రయత్నిద్ధాం.
– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
9704903463.
( అక్టోబర్1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం)
International elder day: వృద్ధుల వెతలు తీరాలి, మానవత్వం పరిమళించాలి
ప్రపంచ వృద్ధుల దినోత్సవం..