Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Investigative agencies are caged birds? : దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలకలేనా ?

Investigative agencies are caged birds? : దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలకలేనా ?

మనదేశంలో అత్యున్నత నేర విచారణ సంస్థలైన సీబీఐ, ఈడీల గురించి గతంలో ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. పెద్ద పెద్ద ఆర్థిక నేరాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిపై విచారణకు పరిమితమయ్యేవి కేంద్ర దర్యాప్తు సంస్థలు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ (ఈడీ)లకు సంబంధించిన వార్తలు కూడా మీడియాలో పెద్దగా కనిపించేవి కావు. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక సీబీఐ, ఈడీ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. హాట్‌టాపిక్‌లుగా మారుతున్నాయి. దేశ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీయేతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులపై కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కేసులంటే అలా ఇలా కాదు చాలా పెద్ద పెద్ద కేసులు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్‌కంటాక్స్, నార్కోటిక్ కంట్రోల్‌ బోర్డు వంటివి రంగంలోకి దిగుతున్నాయి. ఆయా నాయకుల నివాసాల్లో, వారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో ఎడాపెడా తనిఖీలు, సోదాలు చేపడుతున్నాయి. ఏ చిన్నపాటి ఆధారం దొరికినా జైలుకు పంపడానికి కూడా వెనకాడడం లేదు. ఆర్థిక నేరాలకు, వ్యాపారాల్లో అక్రమాలకు ఎవరు పాల్పడినా విచారించాల్సిందే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయమే లేదు. ఆదాయపు పన్ను సోదాలు, తనిఖీలు, ఈడీ దాడులు…ఇవన్నీ అక్రమార్కుల గుట్టు విప్పడానికే అయితే ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు. ఉండకూడదు కూడా. అయితే దర్యాప్తు సంస్థల నిష్పాక్షితపైనే అనుమానాలు వస్తున్నాయి. అకస్మాత్తుగా బీజేపీయేతర రాజకీయ ప్రముఖులకు సంబంధించిన కార్పొరేట్‌ ఆఫీసులపై ఇన్‌కంటాక్స్ రైడ్‌లుంటాయి. ప్రతిపక్షాల నేతల నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతుంటాయి. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలు ఇలా ఉన్నట్టుండి రెచ్చిపోవడం వెనక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సర్కార్ చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దర్యాప్తు సంస్థల పనితీరుపై విమర్శలు రావడానికి కారణాలు లేకపోలేదు. అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడినా దర్యాప్తు జరపాల్సిందే. ఆరోపణల్లో నిగ్గు తేల్చాల్సిందే. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులెవరిపైనా సీబీఐ,ఈడీ,ఐటీ వంటి సంస్థలు కేసులు నమోదు చేయలేదు. ఎక్కడైనా చేసినా ఒకటి అరానే. జనానికి చూపించుకోవడానికే అన్నట్లుగా ఉంటాయి ఆ కేసులు. కమలనాథులపై కేసులుంటే తూతూ మంత్రంగా దర్యాప్తు జరుగుతుందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. కమలం పార్టీ నాయకుల దరిదాపులకు కూడా దర్యాప్తు సంస్థలు వెళ్లడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అదే తాము కేంద్ర ప్రభుత్వ విధానాలను సైద్ధాంతికంగా విమర్శించినా, మర్నాటి నుంచి తమను దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయంటున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. అంతేకాదు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాయని దర్యాప్తు సంస్థలపై మండిపడుతున్నారు బీజేపీయేతర నాయకులు. రాజకీయ ప్రత్యర్థులపై ఇలా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడమే నరేంద్ర మోడీ మార్క్‌ రాజకీయమని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.

- Advertisement -

సత్యేంద్ర జైన్‌, మనీశ్ సిసోడియా అరెస్టు వెనుక ప్రతీకార రాజకీయాలు ?

దేశ రాజకీయాల్లో బీజేపీకి, ఆమ్‌ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి రాజకీయ వైరం ఉంది. ఈనేపథ్యంలో ఆరేళ్లనాటి ఒక కేసును అడ్డం పెట్టుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేంద్ర జైన్‌ను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలున్నాయి. చివరకు సత్యేంద్ర జైన్‌ జైలుకు పోయేంతవరకు ఎన్‌ఫోర్సెమెంట్ డైరక్టరేట్ నిద్రపోలేదన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఆరోపణ. జైలుకు వెళ్లడంతో నైతిక విలువలకు కట్టుబడి మంత్రి పదవికి సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు. తాను విలువలకు కట్టుబడ్డ రాజకీయనేతనని నిరూపించుకున్నారు. మహారాష్ట్రలోనూ రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కత్తిదూసిందన్నది మరో ఆరోపణ. అనిల్ దేశ్‌ ముఖ్, నవాబ్ మాలిక్ …ఇద్దరూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు. కేసులను అడ్డం పెట్టుకుని వీరిద్దరినీ దర్యాప్తు సంస్థలు జైలుకు పంపాయని ఎన్సీపీ నేతలు గతంలో ఆరోపించారు. మూడేళ్ల కిందటి గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కేంద్రం తాజాగా టార్గెట్‌ చేసిందన్న వార్తలొస్తున్నాయి. కేరళలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికే బంగారం స్మగ్లింగ్ కేసుపై కేంద్ర దృష్టిపెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు పరోక్షంగా ప్రతిపక్షాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చింది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలోని తొమ్మిది ప్రతిపక్ష పార్టీలు కిందటి నెలలో సంయుక్తంగా లేఖ రాశాయి. ప్రతిపక్ష నేతలను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్న తీరు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించాయి. దేశ రాజకీయాల్లో దర్యాప్తు సంస్థల తీరు ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షపార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థల సాయంతో కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకు కొన్ని ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. అవినీతిపరులను కట్టడి చేయడమే ప్రత్యేకాధికారాలు ఇవ్వడంలోని ప్రధానోద్దేశం. అయితే సీబీఐ పనితీరు వివాదాస్పదంగా మారిందన్న ఆరోపణలు ఇటీవలికాలంలో తరచూ వినిపిస్తున్నాయి. సహజంగా ప్రతి రాష్ట్రంలో అవినీతి కట్టడికి యాంటీ కరప్షన్ బ్యూరో ( ఏసీబీ ) ఉంటుంది. అయితే సహజంగా హై ప్రొఫైల్‌ కేసుల గుట్టు విప్పడానికి సీబీఐను ఆశ్రయిస్తారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన తరువాత సీబీఐ పాత్ర దేశ రాజకీయాల్లో పెరుగుతూ వస్తోంది. అయితే సీబీఐ పెట్టిన కేసులు చాలావరకు న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. సీబీఐ కేసులను కోర్టులు కొట్టేస్తున్నాయి. సీబీఐ గత దశాబ్దకాలంలో టేకప్ చేసిన కీలక కేసులేవీ ఒక కొలిక్కి రాలేదన్న విమర్శలున్నాయి. దీంతో సీబీఐ ఇమేజ్ కొంతమేర డ్యామేజ్ అయింది. అంతేకాదు సీబీఐ విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. అటు కేంద్రప్రభుత్వంలోని పెద్దల మాటను కాదనలేక ఇటు న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోలేక సీబీఐ సతమతమవుతోందన్న ఢిల్లీ రాజకీయ వర్గాల కథనం. కొన్నేళ్ల కిందట సీబీఐలోని డైరక్టర్‌, జాయింట్ డైరక్టర్ ఓ కేసు విషయంలో ఘర్షణ పడటం కూడా సంస్థ కు చెడ్డపేరు తీసుకొచ్చింది. ఒకప్పుడు లోకల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కంటే సీబీఐ సమర్థవంతంగా పనిచేస్తుందనే పేరు ఉండేది. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఏదైనా కేసు సీబీఐ చేతుల్లోకి వెళితే తెరమరుగైనట్టేననే అభిప్రాయం బలపడుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటివరకు పేదరిక నిర్మూలన జరగలేదు. అనేక గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేదు. తాగునీటి సౌకర్యం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. మరోవైపు ఉపాధి వెతుక్కుంటూ పల్లె జనం పట్టణాలకు వలస వెళుతున్నారు. ఈ మౌలిక సమస్యలకు పరిష్కారాలు చూపడం మానేసి, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడంలో భాగంగా దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీబీఐను పంజరంలో చిలక అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కామెంట్ ఒక్క సీబీఐకే పరిమితం కాదు. ఈడీ సహా అన్ని దర్యాప్తు సంస్థలకు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య వర్తిస్తుంది. ఇవన్నీ కేవలం అపవాదులేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపైనే ఉంది. పారదర్శక పనితీరుతోనే దర్యాప్తు సంస్థలు మునుపటి గౌరవాన్ని సాధించుకోగలవు.

-ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్ సీనియర్ జర్నలిస్ట్‌

63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News