త్వరలో జరిగే హర్యానా శాసనసభ ఎన్నికలు జాట్ – జాట్‌యేతర వర్గాల మధ్య పోరుగా మారింది. జాట్ సామాజికవర్గం బీజేపీకి వ్యతిరేకంగా మారింది. దీనికి అనేక కారణాలున్నాయి. తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్నది బీజేపీపై జాట్ వర్గం చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో నాన్ జాట్ సామాజిక వర్గాలపై బీజేపీ కన్నేసింది. ప్రధానంగా ఓబీసీ, బ్రాహ్మిణ్ , బనియా, ఖాత్రి సామాజికవర్గాలను తమ వైపునకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సామాజికవర్గాలన్నీ కలిస్తే హర్యానా జనాభాలో 50 శాతాన్ని దాటుతుంది. దీంతో జాట్ సామాజికవర్గాన్ని దీటుగా ఎదుర్కోగలమని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జాట్, ముస్లిం, దళితులను ఆకట్టుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ మూడు సామాజికవర్గాలు తమకు అనుకూలంగా ఉంటే కమలం పార్టీని సులభంగా ఎదుర్కోగలమని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.
హర్యానా శాసనసభ ఎన్నికల్లో జాట్ సామాజికవర్గం కీలకంగా మారింది. హర్యానా జనాభాలో జాట్ సామాజికవర్గం 27 శాతం ఉంది. హర్యానాలో రాజకీయంగా బలమైన కమ్యూనిటీగా జాట్‌వర్గానికి పేరుంది. ఇప్పటివరకు హర్యానాకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది జాట్ సామాజికవర్గానికి చెందినవారే. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 57 నియోజకవర్గాల్లో జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో జాట్ కమ్యూనిటీ ఉంది. ఈ 57 నియోజకవర్గాల్లో జాట్ జనాభా పది శాతం కంటే ఎక్కువ. అలాగే 37 నియోజకవర్గాల్లో జాట్ జనాభా 20 శాతం కంటే ఎక్కువగా ఉంది.2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అసెంబ్లీలో మొత్తం 90 నియోజకవర్గాలుంటే బీజేపీ 40 గెలుచుకుంది. జాట్ వర్గ ప్రముఖుడైన దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన్నాయక్ జనతా పార్టీకి 10 సీట్లు లభించాయి. దీంతో భారతీయ జనతా పార్టీ, జన్నాయక్ జనతా పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. బీజేపీలో జాట్ సామాజికవర్గానికి చెందిన కెప్టెన్ అభిమన్యు ఉన్నారు. అందరూ కెప్టెన్ అభిమన్యుకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓబీసీ అయిన మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం. ముఖ్యమంత్రి పదవి తమ వర్గానికి రాకుండా బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం జాట్ పెద్దలకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. చాలా కాలం ఈ విభేదాలు నడిచాయి. రెండు పార్టీల మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో ఈ ఏడాది మార్చి నెలలో ఖట్టర్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. అయితే ఖట్టర్ వారసుడిగా తమ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి బీజేపీ అవకాశం ఇస్తుందని జాట్ పెద్దలు భావించారు. అయితే ఈసారి కూడా జాట్ కమ్యూనిటీ మనోభావాలను కమలం పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఓబీసీ నేత అయిన నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది కమలం పార్టీ. దీంతో బీజేపీ వైఖరిపై మండిపడింది జాట్ సామాజికవర్గం. ఉద్దేశపూర్వకంగా తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి రాకుండా హస్తిన బీజేపీ పెద్దలు కుట్ర పన్నారని జాట్ సామాజికవర్గం ఒక నిర్ణయానికి వచ్చింది. హర్యానాలో బీజేపీతో జాట్ సామాజికవర్గం కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దాదాపు మూడేళ్ల కిందట మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకువస్తే అందుకు వ్యతిరేకంగా పదకొండు నెలల పాటు ఢిల్లీ శివార్లలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది హర్యానా రైతులే.
అగ్నిపథ్ పథకంపై మండిపాటు
ఈసారి ఎన్నికల్లో అగ్నిపథ్ పథకం, బీజేపీకి మైనస్ పాయింట్‌గా మారనుంది. హర్యానా యువత ఎక్కువమంది సైన్యంలో కొలువులపై ఆసక్తి చూపుతుంటారు. స్కూల్ ఫైనల్ పాస్ కాగానే సైన్యంలో రిక్రూట్ కావడానికి ప్రయత్నిస్తుంటారు. అగ్నిపథ్, రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక పథకం. యువతకు సైన్యంలో కొలువులు కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే అగ్నిపథ్ పథకంలో కేంద్రం ఇచ్చే ఉద్యోగం కేవలం నాలుగేళ్లే ఉంటుంది. అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో కొలువులు చేసేవారిని అగ్నివీరులుగా పిలుస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌కు కార్పస్ ఫండ్ కింద కొంత అమౌంట్ కూడా జమ చేస్తారు. అయితే నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తరువాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే. మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే అగ్నివీరులు నిరుత్సాహ పడకుండా వారికి భవిష్యత్తులో అనేక అవకాశాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశ పెడుతున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేకపోవడం విశేషం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన అగ్నివీరులకు ఆ తరువాత ఎటువంటి పెన్షన్ సౌకర్యం ఉండదు. నాలుగేళ్ల సర్వీసు తరువాత మళ్లీ కొత్తగా ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. దీంతో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై హర్యానా యువత ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జాట్ సామాజికవర్గం ఓటు చేసింది. మొత్తం పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈసారి బీజేపీ ఐదు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది. కాగా 2019 లోక్‌సభ సెగ్మెంట్లను భారతీయ జనతా పార్టీయే గెలుచుకుంది.
నాన్ జాట్ వర్గాలపై బీజేపీ ఆశలు
జాట్ సామాజికవర్గం తమకు వ్యతిరేకంగా ఉందన్న విషయం కమలం పార్టీ గుర్తించింది. దీంతో నాన్ జాట్ వర్గాలపై కన్నేసింది. ప్రధానంగా ఓబీసీ, బ్రాహ్మిణ్ , బనియా, ఖాత్రి సామాజికవర్గాలను తమ వైపునకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సామాజికవర్గాలన్నీ కలిస్తే హర్యానా జనాభాలో 50 శాతాన్ని దాటుతుంది. దీంతో జాట్ సామాజికవర్గాన్ని దీటుగా ఎదుర్కోగలమని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జాట్, ముస్లిం, దళితులను తమ వైపునకు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మూడు సామాజికవర్గాలు తమకు అనుకూలంగా ఉంటే కమలం పార్టీని సులభంగా ఎదుర్కోగలమని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రైతుల ఆందోళన, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం వంటి అంశాలతో పాటు పదేండ్ల పాలనపై సహజంగా ఉండే ప్రజావ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ పెద్దలు అంచనాలు వేస్తున్నారు.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320