కొంతకాలంగా ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం తగ్గడం మొదలైంది. ఉక్రెయిన్‌పై సైనికదాడుల విషయంలో రష్యాను అమెరికా కట్టడి చేయలేకపోయింది. ఉక్రెయిన్ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చేసిన హెచ్చరికకు భయపడి అమెరికా మౌనంగా ఉన్నదన్న విమర్శలు సాక్షాత్తూ పశ్చిమ దేశాల నుంచే వచ్చాయి. కాగా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కూడా ఇటీవల అమెరికా పలుకుబడి తగ్గింది. చైనా నుంచి అమెరికా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. చైనా పోటీని తట్టుకోవడానికి ప్రస్తుతం అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ఇదొక్కటే కాదు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ఆధిపత్యం కూడా తగ్గుతోంది. అంతర్జాతీయంగా దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్‌ను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్న వర్ధమాన దేశాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. నాలుగేళ్ల పాలనతో ఒక బలహీన అధ్యక్షుడిగా అమెరికా ప్రజల ముందు జో బైడెన్ ఆవిష్కృతమయ్యారు.
ఊహించిందే జరిగింది. అమెరికా అధ్యక్ష పదవి బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వైదొలగారు. బైడెన్ అభ్యర్థిత్వంపై కొంతకాలం నుంచి పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీనికి కారణం కొన్ని రోజుల కిందట అధ్యక్ష పదవి బరిలో నిలిచిన అభ్యర్థుల మధ్య నడిచిన ప్రత్యక్ష చర్చే. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులిద్దరూ ముఖాముఖి చర్చలో పాల్గొనడం సర్వసాధారణం. ఎన్నికలకు ముందు జరిగే ఈ లైవ్ డిబేట్‌ను దేశ ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తారు. అయితే ప్రత్యక్ష చర్చలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందు జో బైడెన్ తేలిపోయారు. ట్రంప్ మహాశయుడి దూకుడు ముందు జో బైడెన్ నిలబడలేకపోయారు. అనేక అంశాలపై డొనాల్డ్ ట్రంప్ చెలరేగిపోతే, జో బైడెన్ అందుకు తగ్గట్లు బదులు ఇవ్వలేకపోయారు మొత్తంమీద లైవ్ డిబేట్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు పాసు మార్కులు కూడా వేయలేదు అమెరికా ప్రజలు. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలు వచ్చాయి. దీంతో డెమోక్రటిక్ పార్టీ లో చర్చ మొదలైంది. జో బైడెన్‌ను అభ్యర్థిగా పెట్టుకుని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలా లేక మరో అభ్యర్థిని బరిలోకి దించాలా అని ఆలోచనలో పడ్డారు డెమోక్రటిక్ పార్టీ నేతలు. చివరకు అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి పక్కకు తప్పుకోవాలంటూ జో బైడెన్‌పై స్వంత పార్టీ నేతలే ఒత్తిడి చేశారు. కాగా అమెరికా రాజకీయాల్లో దుమారం రేపిన రహస్యపత్రాల అంశం కూడా జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడానికి కారణం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రహస్యపత్రాల అంశం జో బైడెన్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. బారక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ పనిచేశారు.అలనాటి సర్కార్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరచినవే హాట్‌టాపిక్‌గా మారిన సీక్రెట్ డాక్యుమెంట్స్ . అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఐదేళ్ల కాలంనాటి కీలక సమాచారాన్ని రహస్య పత్రాల్లో పొందుపరుస్తారు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే రహస్యపత్రాలు అందుబాటులో ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైనా తమ పదవీకాలం పూర్తికాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్ కు అప్పగిస్తారు. అమెరికా ప్రభుత్వాల రహస్యాలను కాపాడుకోవడానికి దీనిని ఒక నిబంధనగా చేశారు. రహస్య పత్రాలకు అంతటి ప్రాధాన్యం ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. అయితే అంతటి కీలకమైన రహస్య పత్రాలు ఆ తరువాతికాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పాత కార్యాలయాల్లో దొరికాయి. అంతేకాదు జో బైడెన్ నివాసంలోనూ గుట్టలుగుట్టలుగా దొరికాయి. దీంతో రహస్యపత్రాల వివాదం వెలుగు చూసింది. వాస్తవానికి జో బైడెన్‌కు వ్యక్తిగతంగా అమెరికా సమాజంలో గుడ్‌విల్ ఉంది. నిజాయితీపరుడన్న పేరుంది. అయితే కుమారుడు హంటర్ బైడెన్ పుణ్యమా అంటూ వెలుగుచూసిన రహస్య పత్రాల వివాదంతో జో బైడెన్ నిజాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉంటే బైడెన్ కు ఇప్పటికే జ్ఞాపకశక్తి తగ్గింది. మతిమరుపు కూడా బాగా పెరిగింది. దేశాధినేతల పేర్లు కూడా తప్పుగా పిలుస్తున్నారు. ఎనభై ఏళ్ల వయస్సులో చాలా మందికి ఇది సర్వ సాధారణం. వయస్సు మీద పడటంతో కలిగే ఇబ్బందులకు జో బైడెన్‌కూడా మినహాయింపు కాదు. జో బైడెన్ అభ్యర్థిత్వానికి డెమోక్రటిక్ పార్టీలో వ్యతిరేకత రావడానికి ఇది కూడా ఒక కారణం.
బైడెన్ హయాంలో తగ్గిన అమెరికా ప్రాభవం
అమెరికాను అగ్రరాజ్యంగా యావత్ ప్రపంచం భావిస్తుంది. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలను అమెరికా శాసించింది అంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అవసరం లేకపోయినా ప్రపంచంపై ఆధిపత్యం కోసం నాటో కూటమిని ఏర్పాటు చేసింది అమెరికానే. ఇప్పటికీ నాటో కూటమిని వెనుకుండి నడిపిస్తోంది అమెరికానే. అయితే కాలక్రమంలో ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం తగ్గడం మొదలైంది. ఉక్రెయిన్‌పై సైనికదాడుల విషయంలో రష్యాను అమెరికా కట్టడి చేయలేకపోయింది. ఉక్రెయిన్ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చేసిన హెచ్చరికకు భయపడి అమెరికా మౌనంగా ఉన్నదన్న విమర్శలు సాక్షాత్తూ పశ్చిమ దేశాల నుంచే వచ్చాయి. కాగా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కూడా ఇటీవల అమెరికా పలుకుబడి తగ్గింది. చైనా నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ప్రస్తుతం అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ఇదొక్కటే కాదు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ఆధిపత్యం కూడా తగ్గుతోంది. అంతర్జాతీయంగా దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్‌ను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్న వర్ధమాన దేశాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఏదిఏమైనా తమ దేశాధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా ఉండాలని యావత్ అమెరికన్ సమాజం ఆశిస్తుంది. ఇది సహజం కూడా. అయితే నాలుగేళ్ల పాలనతో ఒక బలహీన అధ్యక్షుడిగా అమెరికా ప్రజల ముందు జో బైడెన్ ఆవిష్కృతమయ్యారు. మొత్తానికి అమెరికా రాజకీయ చరిత్రలో జో బైడెన్ అధ్యాయం ముగియబోతోంది.
-ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320