రకరకాల ఒత్తిళ్లు, దుష్ప్రచారాలు, ప్రత్యక్ష విమర్శల ద్వారా కొందరు స్వప్రయోజనాపరులు దేశంలో న్యాయ వ్యవస్థను కించపరచడానికి, నిర్వీర్యం చేయడానికి, అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ 21 మంది రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ కు లేఖ రాశారు. పది పదిహేను రోజుల క్రితం సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేతో సహా 600 మంది న్యాయవాదులు ఇదే విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం జరిగింది. కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ లాభాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేలా ప్రయత్నాలు చేస్తున్నారని, కేవలం రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే న్యాయవ్యవస్థ మీద దాడులు సాగిస్తున్నారని రిటైర్డ్ న్యాయమూర్తులు తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యక్తులు చేసే విమర్శలు, వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసేవిగా, న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పులు తమకు అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయని కూడా మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థను అవమానించడం, అప్రతిష్ఠపాలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారని, ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నారని, దీనివల్ల న్యాయ వ్యవస్థే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థే బలహీనపడే ప్రమాదం ఉందని న్యాయవాదులు కూడా తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి, స్వప్రయోజనాపరులు దేశంలోని న్యాయ వ్యవస్థను దెబ్బతీయడానికి, న్యాయ వ్యవస్థను కించపరచడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో, వీరి లేఖలు కూడా అదే ఉద్దేశంతో రాసినట్టు కనిపిస్తోంది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, వివిధ పార్టీలకు ఎవరు ఎంత విరాళం ఇచ్చారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత న్యాయవాదులు ఈ లేఖను రాయడం జరిగింది. న్యాయ వ్యవస్థ ఒత్తిడిలో ఉందనో, న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారనో చెప్పడానికి ఆ సమయంలో మరో తీర్పేదీ వెలువడలేదు. న్యాయస్థానాలు వెలువరించే తీర్పులను న్యాయవాదులు, పాలకులు, ప్రతిపక్ష నాయకులు విమర్శించిన సందర్భాలు గతంలో కూడా అనేకం ఉన్నాయి. ఇందులో కొన్ని సముచితమైనవీ ఉన్నాయి, కొన్ని అనుచితమైనవీ ఉన్నాయి. అయితే, న్యాయ వ్యవస్థ ఒత్తిడిలో ఉందంటూ న్యాయవాదులంతా కలిసి ఒక ప్రకటన జారీ చేయడం అసందర్భంగా కనిపిస్తోంది.
న్యాయ వ్యవస్థకు అనుకూలంగానూ, ప్రతికూలంగానే ఇటువంటి ప్రకటనలు వెలువడడం, లేఖలు రాయడం కూడా న్యాయ వ్యవస్థను కించపరచడమే అవుతుంది. తప్పకుండా ఇటువంటివి న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకు వస్తాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించినప్పుడు ఇటువంటి ప్రకటనలు వచ్చే పక్షంలో వాటి వెనుక ఉన్న దురుద్దేశాలు ఏమిటన్నది అర్థమవుతూనే ఉంటుంది. విచిత్రమేమిటంటే, న్యాయవాదుల లేఖతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏకీభవించారు. కొందరు స్వప్రయోజనాపరులు న్యాయస్థానాల మీద, ముఖ్యంగా హైకోర్టుల మీద దుష్ప్రచారాలు చేయడం, వాటి తీర్పులకు దురుద్దేశాలు అంటగట్టడం, వాటిని కించపరచడం వంటివి జరుగుతున్న విషయం వాస్తవమేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ హయాంలో దేశంలో నిబద్ధత కలిగిన న్యాయ వ్యవస్థ ఉండేదని కూడా ప్రధాని అన్నారు. న్యాయవాదులు లేఖ రాసినా, న్యాయమూర్తులు లేఖ రాసినా అది న్యాయ వ్యవస్థను దెబ్బ తీయడానికేనని, న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకు వచ్చే ఉద్దేశంతోనే ఇటువంటి లేఖలు రాయడం జరుగుతోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ లేఖల్లో వారు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, ఆవేదనలను యథాతథంగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ ఆందోళనల వెనుక ఈ మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదుల పరోక్ష హెచ్చరిక కూడా ఉంది. ఈ లేఖల వెనుక ప్రధానిని హెచ్చరించడం కూడా జరుగుతోంది.