Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Karnataka: కర్ణాటకలో విభిన్న పాలన సాధ్యమా?

Karnataka: కర్ణాటకలో విభిన్న పాలన సాధ్యమా?

ఎన్నికల్లో విజయం సాధించడానికి చేసే ఐక్యతా ప్రయత్నాలు సఫలం కావచ్చు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ ప్రయత్నాలు అడుగడుగునా సమస్యలను ఎదుర్కుంటూనే ఉంటాయి. కర్ణాటక కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ ప్రధాన నాయకులైన సిద్దరామయ్య, డి.కె. శివకుమార్‌ల మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో తలెత్తిన విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి, శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కినంత మాత్రాన వివాదం శాంతియుతంగా పరిష్కారం అయిందనుకోవడానికి అవకాశం లేదు. అన్ని వర్గాలకు అవకాశం ఇస్తూ 10 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి గత మే 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా పార్టీలో లుకలుకలు సద్దుమణగలేదు. భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి మారిన లింగాయత్‌ వర్గ నాయకుడు ఎం.బి. పాటిల్‌కు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు, దళిత నాయకుడు అయిన ప్రియాంక్‌ ఖర్గేకు, ఇద్దరు దళిత నాయకులు కె.హెచ్‌. మునియప్ప, జి.పరమేశ్వరలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వీరు కాక, ఒక ముస్లింకు, ఒక క్రైస్తవుడికి కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. ఇటువంటి ప్రాతినిధ్యం కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగింది.
అయితే, ఇవన్నీ పైపై పూతలు, మెరుగులే. అనేక వాగ్దానాలు, హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును అటు ప్రజలే కాక, ఇటు ప్రత్యర్థి బీజేపీ కూడా సునిశితంగా గమనిస్తున్న విషయాన్ని విస్మరించలేం. అందువల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం తన దృష్టినంతా పాలన మీద కేంద్రీకరించాల్సి ఉంటుంది. కుల, మతాల ప్రాతిపదికగా, రాజకీయ విధేయతల ఆధారంగా మంత్రివర్గంలో స్థానం కోసం ఒత్తిడి తీసుకు వచ్చే వర్గాల మీద కంటే పాలన మీదే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రజలు తమను ఏ కారణంగా ఎన్నుకున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. తమ ప్రధాన లక్ష్యం ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చాలన్నది ఆలోచించాలి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సామరస్యం, హుందాతనం పాటిస్తూ పాలన సాగించడం పాలక పక్షానికి నిజానికి కత్తి మీద సామే.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని నిర్వహించే తీరు దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కాబోతోంది. అందువల్ల కర్ణాటక ఒక రోల్‌ మోడల్‌ కావడానికి శాయశక్తులా ప్రయత్నించాల్సి ఉంటుంది. పార్టీలో శివకుమార్‌ ఒక అధికార కేంద్రంగా అవతరించిన నేపథ్యంలో సిద్దరామయ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నవారున్నారు. మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. సిద్దరామయ్య, శివకుమార్‌లలో ఏ వర్గానికి మంత్రివర్గంలో ఎక్కువగా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న సమస్య తలెత్తడం ఖాయం. తన వక్కలిగ కులానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని శివకుమార్‌ ఇప్పటికే పట్టుబట్టడం ప్రారంభించారు. ఒక వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కర్ణాటక రాష్ట్రం ఇటీవలి మత కలహాల వల్ల కొద్దిగా దారి తప్పింది. ఎవరు ఏ మతానికి చెందినవారైనా, నేరాలకు, ఘోరాలకు పాల్పడినప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఐక్యత అనేది విజయం సాధించడానికి మాత్రమే కాదు, పాలనకు కూడా అవసరమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News