గత 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని, అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణ లు మారుతూనే ఉన్నాయి. అక్కడ ఓ రాజకీయ సంక్షోభం అట్టుడుకుతూనే ఉంది. అది మరింత భగభగమండడానికి ఈ ఏడాది కూడా దానికి కొద్దిగా ఆజ్యం తోడ యింది. నియోజక వర్గాల సంఖ్యను పెంచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాటు, తాజాగా అక్కడ ఓటర్ల జాబితాలను తయారు చేయాలనే నిర్ణయం కూడా అక్కడ మళ్లీ సమస్యలను తెచ్చి పెట్టింది. ఈ రెండు నిర్ణయాలు కాశ్మీర్ చరిత్రాత్మకంగా సున్నిత మైన అంశాలను స్పృశించినట్టు అయిందని అక్కడి నాయకులు కేంద్రం మీద నిప్పు లు చెరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు గమనించాల్సినవి. త్వరలో కాశ్మీర్‌లో జరగ బోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గనుక జోక్యం చేసుకున్నట్టయితే, తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఆయన మొత్తం మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ అనేక రకాలుగా ప్రయత్ని స్తుంది. మా వాళ్లను కొందరిని కొనేసినా ఆశ్చర్యపోనక్కర లేదు. బీజేపీ కుయుక్తుల్ని దేవుడు ముందుకు సాగనివ్వడు అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గనుక కల్పించుకుంటే పెద్ద తుఫాను చెలరేగడం ఖాయం. ఈ తుఫానుని అదుపు చేయడం ఎవరి వల్లా కాదు అని కూడా ఆయన అన్నారు.
ఇటువంటి ప్రసంగంతో ఫారూఖ్ అబ్దుల్లా రానున్న ఎన్నికలకు తెర తీసినట్ట యింది. జమ్మూ-కాశ్యీర్ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై సొలిసిటర్ జనరల్ తుషార్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. ఫారూఖ్ అబ్దుల్లా ప్రసంగాన్ని విన్నవారికి రాబోయే శాసనసభ ఎన్నికలు నిజంగా పెద్ద దుమా రాన్నే రేపేటట్టు ఉన్నాయని అనిపిస్తుంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడి శాసనసభ ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలు చేసిన విషయాన్ని ఇక్కడి రాజకీయ విశ్లేష కులు పదే పదే గుర్తు చేస్తున్నారు. అబ్దుల్లా కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారిన సంగతిని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
కొత్త వ్యూహాలు, సవాళ్లు 1983లో రెండవ పర్యాయం ప్రధానమంత్రి పదవిలో కూర్చున్న ఇందిరా గాంధీ అప్పట్లో అత్యంత భారీ సంఖ్యతో ఎన్నికైన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు ఫారూ ఖ్ అబ్దుల్లాను తను కుయుక్తుల ద్వారా తమ వైపు తిప్పుకున్నారు. రాష్ట్రాన్ని నాలుగు దశాబ్దాల పాటు పాలించిన షేక్ అబ్దుల్లా (ఫారూఖ్ అబ్దుల్లా తండ్రి) ఆకస్మిక మరణం తర్వాత ఫారూఖ్ రాష్ట్ర పగ్గాలు చేతబట్టారు. ఆమె ఒత్తిడి మేరకు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా కొన్ని నియోజక వర్గాల్లో బలహీన అభ్యర్థులను నిలబెట్టి, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా చేయాల్సి వచ్చింది.
ఇందిరా గాంధీకి కాశ్మీర్లో విజయం సాధించడమనేది ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారింది. 1957 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కేరళలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్నే కూల్చే సిన ఇందిరా గాంధీకి, కాశ్మీర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చాలన్న కోరిక కలిగింది.
ఆమె కాశ్మీర్లో ఫారూఖ్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కూలదోయడానికి అక్కడి గవర్నర్ బ్రజ్ కుమార్ నెహ్రూ సహాయం అడిగారు. ఆయన ఇందిరా గాంధీకి బాగా దగ్గరి బంధువే. అయినప్పటికీ ఆయన ఆమె ఒత్తిడికి ఏమాత్రం లొంగిపోలేదు. దాంతో ఆమె గవర్నర్నే తొలగించి, తనకు బాగా నమ్మకస్థుడైన జగా మోహన్‌ను గవర్నర్‌గా నియ మించారు. ఆమె ఆ తర్వాత ఎంతో చాకచక్యంగా అబ్దుల్లాను పదవి నుంచి తప్పించా నని పొంగిపోయారు కానీ, నిజానికి ఆ తర్వాత పదేళ్ల పాటు ఆ రాష్ట్రంలో రాజకీయ అస్థి రత్వం రాజ్యమేలింది. అప్పటి నుంచి సరిహద్దులకు అవతల నుంచి చొరబాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. కాగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కాశ్మీర్‌లో బయటివారు భూములు కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వడం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలు స్థానికుల్లో అనుమానాలను పెంచాయి.
విచిత్రమేమిటంటే, రాష్ట్రంలో ప్రజా భద్రతా చట్టం, అవాంఛనీయ కార్యకలాపాల నిరోధక చట్టం వంటీ వాటి కింద కేసులు అధిక సంఖ్యలో దాఖలవుతున్నాయి. ఈ కేసులన్నీ రాజకీయ ప్రత్యర్థుల మీదే దాఖలు చేస్తున్నారన్న అభిప్రాయం ఎక్కువవు తోంది. ఈ అభిప్రాయాన్ని ఫారూఖ్ అబ్దుల్లా తదితర ప్రతిపక్ష నాయకులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాలన్నిటినీ రద్దు చేస్తామని ఫారూఖ్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఈ మధ్య ఒక సభలో వాగ్దానం చేశారు. ఇది ఇలా ఉండగా, తమ పార్టీ అభ్యర్థులు ప్రతి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని, బీజేపీకి గెలిచే అవకాశమే ఇవ్వమని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ముఫ్త ప్రకటించారు. 2019 ఆగస్టులో కేంద్రం 370ని రద్దు చేస్తూ తీసు కున్న నిర్ణయానికి, మరికొన్ని చట్టాలకు సంబంధించిన నిర్ణయాలకు ఎన్నికల రూపేణా రాష్ట్రంలో అతి త్వరలో తీర్పు వెలువడబోతోంది.