ఈ ఏడాది డిసెంబర్ నెలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న తెలంగాణలో క్రమంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) అధినేత, ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర్ రావు ఇప్పటికే సమర శంఖం పూరించారు. తమ నియోజక వర్గాలలో ప్రతికూలతలను ఎదుర్కుంటున్నారన్న అభిప్రాయంతో ఆయన ప్రస్తుత శాసనసభ్యులలో ఏడుగురికి టికెట్లు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అందులో గజ్వేల్ ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కాగా అదనంగా ఆయన కామారెడ్డిని తన రెండవ నియోజక వర్గంగా ఎంచుకున్నారు. ప్రత్యర్థులు, ప్రతిపక్షాల అంచనాలను తారుమారు చేయడం కె.సి.ఆర్ కు చాలా ఇష్టమైన విషయం. తమకు వాటా ఉంటుందని ఆశించిన వామపక్షాలకు ఆశాభంగమే మిగిలింది.
అభ్యర్థుల ఎంపికను నిశితంగా గమనించినవారికి ఒకటి రెండు ప్రశ్నలు తలెత్తక మానవు. ఆయన దాదాపు శాసనసభ్యులందరికీ టికెట్లు ఇవ్వడం ఎలా జరిగింది? తార్కికంగా ఆలోచిస్తే, కర్ణాటకలో బీజేపీ చేసినట్టుగా ఆయన కూడా కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తే పార్టీలో ఏదో సమస్య ఉందని ఇతరులు భావించే అవకాశం ఉంది. కొత్త అభ్యర్థులు కూడా అందరూ గెలిచే అవకాశం లేదు. సీటు కోసం పోటీపడేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నందువల్ల, ఏ చిన్న మార్పు చేసినా అది తేనెటీగల తుట్టెను కదల్చి నట్టవుతుంది. టికెట్ కోసం ప్రయత్నించినవారు నిరుత్సాహపడే అవకాశం ఉందనే విషయం కూడా కాదనలేం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి చెందినందువల్ల ఆయన ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా గెలిచే అవకాశాలు ఎక్కువే. ఇందులో సందేహం లేదు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా కేసీఆర్ ను బట్టి గెలిచే అవకాశాలే ఎక్కువ.
ఆయన తన చాణక్యంతోఎటువంటి తిరుగుబాటు అభ్యర్థులనైనా తన వైపు తిప్పుకో గలరు. వారిని శాంతింపజేయగలరు. అదే సమయంలో ఆయన మొండి పట్టుదలకు మారుపేరనే విషయం కూడా మరచిపోకూడదు. ఏది ఏమైనా, ప్రస్తుతానికి ఆయన తన పార్టీకి సమస్యలు తీసుకు రాదలచుకోలేదన్నది స్పష్టంగా అర్థమైపోతోంది. అంతేకాక, తమ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తమ పార్టీ అందనంత ఎత్తులో ఉన్నందువల్ల, విజయా వకాశాలు తమకే ఎక్కువగా ఉన్నందువల్ల కేసీఆర్ మాటకు, చేతకు తిరుగుండకపోవచ్చు. ఆయన వ్యూహం గనుక విజయవంతమై, ఆయనకు ఎన్నికల్లో ఘన విజయం లభిస్తే దక్షిణాది రాష్ట్రాలలో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కుతుంది.
రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన శాసనసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ఒక ఎత్తు కాగా, ఆయన రెండు స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించడం మరో ఎత్తు. ఆయన ఈ రెండు నియోజక వర్గాలలోనూ తేలికగా విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాక, వెనుకటి నిజామాబాద్ జిల్లాలో మిగిలిన బి.ఆర్.ఎస్ అభ్యర్థులకు కూడా విజయాలు తేలిక అవుతాయి. పైగా, జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టిన కె.సి.ఆర్ ఈ రెండు నియోజక వర్గాలలోనూ విజయం సాధించడం వల్ల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.
ఇప్పుడిక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ మహా యుద్ధానికి తమ అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. బీ.ఆర్.ఎస్ లోని ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చినందువల్ల ఈ పార్టీలు పాలక పక్ష ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే అవకాశం లేదు. నిజానికి, బీ.ఆర్.ఎస్ కు గట్టి పోటీ ఇవ్వ గల అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఆ పార్టీ ఏమేరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న దానిపై ఇది ఆధారపడి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను కాస్తో కూస్తో సొమ్ము చేసుకోగల అవకాశం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.
KCR strategy: కేసీఆర్ ప్రభుత్వ విజయ వ్యూహం
మరి కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది?