సంక్రాంతి అంటేనే విలేజ్ టూరిజం, కాక్ ఫైట్ టూరిజం అన్నట్టు సాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. గోదారి జిల్లాల్లో కోడి పందేలు-సంక్రాంతి రెండూ ఒకటికొకటి తరాలుగా పెనవేసుకుపోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వీటిని భారీఎత్తున నిర్వహిస్తారు.
వినోదమే వ్యసనమై-వ్యాపారమైతే
కోడి పందేలు వినోదంగా ప్రారంభమై, వ్యసనంగా మారి, చివరికి వ్యాపార రూపందాల్చి కాక్ ఫైట్ బిజినెస్ అయికూర్చుంది. కోడికి కత్తి కట్టి బరిలోకి దించితే కనకవర్షమే. కోడిపందేల్లో బెట్టింగ్ ద్వారా మారే నోట్ల కట్టలకు లెక్కేలేదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే కుటుంబాలు చాలానే ఉన్నాయి.
అన్ని కోళ్లు పందేనికి పనికిరావు
టీకర్లు, రేజాలు, కర్లు, జావాలు, కౌజు, చవల, సేతువ, కొక్కిరాయి, ఎరుపుగౌడు, రసంగి, తెలుగుగౌడు, మైల, పచ్చకాకి, డేగ, కాకి, పర్ల, నెమలి, పింగళ, పూ, ముంగిస, అబ్రాసు, గేరువా ఇలా ఎన్నో జాతులు కోడి పందేల్లో ఉపయోగిస్తారు. కానీ కాకి, డేగ, నెమలి జాతుల కోళ్లు చాలా దూకుడు స్వభావంతో ఉండి పోరాటంలో ప్రాణాలే ఒడ్డుతాయి. అందుకే బెట్టింగ్ రాయుళ్లకు ఇవి హాట్ ఫేవరెట్ జాతులుగా ఉన్నాయి.
అత్యంత లాభదాయకంగా పందెం జాతి కోళ్ల పెంపకం
పందెం కోసం ట్రైనింగ్ అయిన కోడి తొలిసారి బరిలోకి దింపేందుకు కొనాలంటే కనీసం 50,000 రూపాయలు వెచ్చించాల్సిందే. ఇంతకంటే తక్కువ ధరకు మేలు జాతి పందెం పుంజులు దొరకవు. గతంలో పందేలు గెలిచిన పుంజుల ధర లక్షల్లో ఉంటుంది. అది ఆ ఏడాది డిమాండ్ ను బట్టి ఉంటుంది.
ఎందుకంత ధర?
ప్రత్యేక బ్రీడ్లు, ప్రత్యేక ఆహారం, ప్రత్యేక శిక్షణ ఇది ఈ పుంజుల ప్రత్యేకత. ఇందుకు కోళ్ల ఫాముల్లో ఫుల్ టైం ట్రైనర్స్ ఉంటారు. మటన్ ఖీమా, డ్రై ఫ్రూట్స్-నట్స్, మినుములు ఇలా మంచి పోషకాహారాన్ని అందిస్తూ పందెం కోళ్ల యజమానులు ఏడాదంతా వీటిని పోషించి, పందేనికి అవసరమైన శిక్షణ ఇస్తారు. రోజూ ఔషధ గుణాలున్న నూనెలతో మసాజ్ చేస్తారు కూడా. వీటికి ఎగరటం, పోటీ పడటం, ఆఖరుకి ఈత కొట్టడం వంటి వాటిల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు, దీంతో ఇవి త్వరగా అలసిపోకుండా, గాయపడినా త్వరగా కోలుకుంటాయి. ఇదంతా చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టే కోడి పందేలు అనేది కూడా ఖరీదైన వ్యసనంగా మారిపోయింది. తాము పెట్టే పెట్టుబడికి మించిన లాభాలు ఆర్జించేలా బెట్టింగ్ జోరు ఉంటుంది.
కుక్కుట శాస్త్రం ప్రకారం బెట్టింగ్
మీకు కుక్కుట శాస్త్రం అంటే తెలుసా? అదే కోడిపుంజుల పంచాగమన్నమాట. పౌరుషానికి ప్రతీకగా నాటి కాలంలో రాజులు కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పందేలు నిర్వహించేవారు. ఇది కోళ్లకు సంబంధించిన సైన్స్-జ్యోతిష్యం కూడా. ఏ రంగు జాతి కోడి, ఏ జాతి కోడి, ఏ నక్షత్రంలో, ఎప్పుడు, ఏ దిశలో బరిలో దింపితే గెలుస్తుందో కచ్ఛితంగా లెక్కగట్టి చెబుతుంది. కోడి పందేల్లో కూడా చాలా రకాలున్నాయి.
కోళ్లే ఎందుకంటే
అసలు కోళ్లే ఎందుకు అంటే కోళ్ల మధ్య పోటీ పెడితే వాటి జాతి లక్షణం ప్రకారం అవి చావో రేవో తేల్చుకుంటాయి కానీ వెనక్కు తగ్గవు. ఇది నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తుంది కాబట్టి పూర్వకాలం నుంచి కోడి పందేలంటే సరదాగా మారాయి.
పల్నాటి, బొబ్బిలి యుద్ధాల వెనుక కూడా కోడి పందేలు కారణమని మనందరికి తెలుసుకదా. సింధూలోయ నాగరికతలో కూడా కోళ్లపందేలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. చైనా, పర్షియా, తూర్పు దేశాల్లో కూడా ఈ కోళ్ల పందేల సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇప్పటికి పలు దేశాల్లో కాక్ ఫైట్ పేరుతో స్టేడియంల్లో నిర్వహిస్తూ, ప్రభుత్వాలు అధికారికంగా సొమ్ము చేసుకుంటున్నాయి. స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ కు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు ఉత్సాహంగా వస్తారు అచ్చం అలాగే ఫిలిప్పైన్స్, థాయ్ ల్యాండ్, వియత్నాం, బాలీ వంటి దేశాల్లో కాక్ ఫైట్ భారీఎత్తున నిర్వహిస్తారు.
నిషేధం ఉన్నా
మనదేశంలో 1960 నుంచి కోడి పందేలు నిషేధించినా అనధికారికంగా ఇంకా భారీ ఎత్తున సాగుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కనీసం 900 కోట్ల రూపాయలకు తగ్గకుండా కోడి పందేలు ఏటా జరుగుతాయని అంచనా. మూడు రోజుల సంక్రాంతి సంబరాల కోసం ఏకంగా 200,000 పైగా కోళ్లను ఇందుకు ఉపయోగిస్తారని నోటి లెక్కలే చెబుతున్నాయి.
కాక్ ఫైట్ టూరిజం-ఎన్ఆర్ఐలు
ఎన్ఆర్ఐలు కోడి పందాల కోసం ప్రత్యేకంగా కోస్తా తీరప్రాంతానికి ఏటా వచ్చేందుకు ఆసక్తిచూపుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా మనోళ్లు ఎక్కడున్నా ఈ పండగ టైంకి కోడిపందాలు జరిగే ప్రాంతాల్లో వచ్చి వాలతారు. ఇటీవల ఉత్తరాది వారికి కూడా ఈ పందేలపైన ఆసక్తి పుట్టింది. భీమవరం, కైకలూరు పరిసరాల్లో ఈసారి 1000 కోట్ల రూపాయలపైనే కోడి పందేలపై బెట్టింగ్ జరగచ్చనే అంచనాల మధ్య పందెం రాయుళ్ల తెగ ఆసక్తి చూపుతున్నారు.
కాసినో-కారావాన్ హంగామా
రాజకీయ, సినీ రంగాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఎన్ఆర్ఐల కోసం కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో కాసినో-క్యారావాన్ లు కూడా ఏర్పాటు చేసి విలాసవంతమైన సౌకర్యాలకు తమ ఊళ్లో కొదవ లేకుండా నిర్వాహకులు ఆకట్టుకుంటారు.
యు ట్యూబ్ లో అమ్మకాలు-బెట్టింగులు
క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్ లైన్ పేమెంట్లు తీసుకుంటూ, డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాట్సప్ గ్రూపుల్లో ఈ దందా సాగుతోంది. స్వయంగా పందేలు చూసేందుకు రాని వాళ్లు ఈ వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ కట్టి, గ్రూప్ వీడియో కాల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తమ కోళ్లు, వాటి ప్రత్యేకతలపై వీడియోలు చేసి యు ట్యూబ్ ఛానెళ్లలో పుంజులను అమ్మకాలకు పెడుతున్నారు. బరిలోకి దిగుతున్న కోళ్ల వివరాలు వీడియోలు చేసి 2-3 నెలల ముందే యూట్యూబ్ లో పెట్టి బెట్టింగ్ రాయుళ్ల నుంచి అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టా షార్ట్స్ లో కూడా వీటిని వైరల్ చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. యూ ట్యూబ్ లో కోడి పందేలు అని సర్చ్ కొడితే అమ్మకానికి పెట్టిన కోళ్ల వివరాలు, పందెం కాసేందుకు మీకు నచ్చిన పుంజులను ఎంచుకోవచ్చు. పందెం కోళ్లు కొనాలన్నా, బరిలోని కోళ్లపై పందెం కాయాలన్నా ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద మార్కెట్ గా మారింది.
వీటిని నిర్వహించకూడదని చెబుతున్నా సంప్రదాయం-సెంటిమెంట్ పేరుతో ఇక్కడ బరులు ఏర్పాటు చేయటం షరామామూలుగా మారింది.