Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Lal Bahadur Shastri: ఐదడుగుల బుల్లెట్టు.. లాల్‌ బహుదూర్‌ శాస్త్రి

Lal Bahadur Shastri: ఐదడుగుల బుల్లెట్టు.. లాల్‌ బహుదూర్‌ శాస్త్రి

దేశానికి దిశానిర్దేశనం చేసిన మహాశక్తి లాల్‌ బహదూర్‌


లాల్‌ బహదూర్‌ శాస్త్రి 1904 అక్టోబర్‌ 2 ఉత్తర ప్రదేశ్‌ లోని మొగల్‌ సరాయ్‌ గ్రామంలో శారదా ప్రసాద్‌ రాయ్‌, రామ్‌ దులారీ దేవీలకు జన్మించారు. ఒక అతిసామాన్య పౌరుడు, గాంధీ భావాల పట్ల ఆకర్షితుడైనా, తన సొంత సిద్దాంతాలకూ విలువ ఇచ్చే మనిషి. కులమతాలకి తాను అతీతుణ్ణనే భావంతో శ్రీ వాత్సవ అన్న ఇంటి పేరుని సైతం ఎప్పుడూ వాడని సమతావాది. నిజానికి శాస్త్రి అన్నది ఆయన కాశీ విద్యాపీఠంలో పొందిన పట్టా. అదే తర్వాత ఆయన ఇంటి పేరయింది.
చదువు కోసం రోజూ నదిని ఈదుతూ ప్రాణాలకు తెగించిన లాల్‌ బహద్దూర్‌ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనటానికి చదువును సైతం వదులుకున్న దేశ భక్తుడు. జైలుకి వెళ్ళి విడుదలైన తరువాత మళ్ళీ చదువు పూర్తి చేసిన మొండి పట్టుదలగల వ్యక్తి.
ఎర్రకోటపై జెండా ఎగరెయ్యడానికి వెళ్ళిన వాళ్ళని బ్రిటిష్‌ సైనికులు అడ్డుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ సందుల్లోంచి వెళ్ళి మరీ ఎర్రకోటపై జెండా ఎగరవేసిన ధిక్కార వ్యక్తిత్వం..స్వాతంత్య్రం వచ్చాక.. ఉత్తర ప్రదేశ్‌ అప్పటి ముఖ్యమంత్రి గోవింద వల్లభ పంత్‌ కు పార్లమెంటరీ సెక్రటరీగా ప్రారంభించిన తన రాజకీయ జీవితంలో అంచెలంచలుగా తన నిజాయితీతో, నిబద్ధతతో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖామంత్రిగా, హోం శాఖామంత్రిగా, ఆ తరువాత నెహ్రు మంత్రివర్గంలో 1952 మే13 న కేంద్ర రైల్వే మంత్రిగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి నియమితుడు అయ్యారు.1956 లో ‘అరియ లూర్‌’లో సంభవించిన రైల్‌ ప్రమాదంలో 145 మంది ప్రయాణికులు మరణించగా శాస్త్రీజీ మొట్ట మొదటగా నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అప్పటి ప్రధాని నెహ్రూతో సహా అందరూ తిరస్కరించినా కూడా తన రాజీనామాకు కట్టుబడి వున్నారు.
తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గములో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా తర్వాత 1961 నుండి గృహమంత్రిగా ఏ పదవి అయినా అదే నిరాడంబరతో చేసారు. తదనంతర పరిణామాల్లో నెహ్రూ మరణంతో శాస్త్రి భారత ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. 1964 లాల్‌ బహదూర్‌ కార్యశీలతకి, ధైర్య సాహసాలకునూ మరోసారి నిరూపించింది. 1965లో వొచ్చిన పాకిస్తానుతో యుద్ధం అంతకు ముందు దాకా అక్కర్లేని శాంతి వచనాలతో దేశాన్ని నిర్వీర్యం చేసిన స్థితినుండి దేశాన్ని ఉత్తేజం దిశగా, ఉత్సాహం దిశగా ఉరకలెత్తించిన ఖ్యాతి కేవలం లాల్‌ బహదూర్‌. దేశానికి రెండే మూల స్థంభాలు.. జై కిసాను.. జై జవాను అంటూ నినదించి దేశానికి దిశానిర్దేశనం చేసిన మహాశక్తి లాల్‌ బహదూర్‌.
అన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులని పొందినా తన కోసం కనీసం సొంత ఇల్లు కూడా సంపాదించుకోని లాల్‌ బహదూర్‌ నిజాయితీని చూసైనా మన నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. ఒక పంచాయతీ మెంబర్‌ కూడా లక్షలు కూడపెట్టుకుంటున్నా రాజకీయాల్లో సొంత ఇల్లు లేనిలేని దుర్భర పరిస్థితుల్లో లాల్‌ బహదూర్‌ భార్య లలితా శాస్త్రి గడిపారని తెలిసాక గర్వంతో కూడిన విషాదపు నవ్వు మన మొహంలోకి రాకమానదు.
అలాంటి శాస్త్రి ఇంకా కొద్దికాలం బ్రతికి ఉండి ఉంటే మన దేశ పరిస్థితి ఎలా ఉండేదో గానీ అప్పట్లో కాంగ్రెసుకు అత్యంత ప్రీతి పాత్రమైన సోవియట్‌ యూనియన్‌ కి (ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌ పర్యటనకు) వెళ్ళాడు లాల్‌ బహద్దూర్‌. అక్కడ తాష్కెంట్‌ లో ఒక సమావేశం దౌత్యపరమైన పర్యటనకై వెళ్ళి అక్కడ అప్పటి పాక్‌ ప్రధాని అయూబ్‌ తో రష్యా మధ్యవర్తిత్వంలో ఒప్పంద కాగితాలపై సంతకాలు చేసి అదే రాత్రి జనవరి 10 19663న రష్యాలోనే మరణించారు. అక్కడే గుండె ఆగి మరణించాడని డాక్టర్లు చేసిన ప్రకటన విషయంలో ఎవరికి ఎన్ని అనుమానాలు ఉన్నా ఏమీచెయ్యలేని పరిస్థితిలో, స్వయంగా భార్య లలితా శాస్త్రి తన భర్త ఆరోజు తాగిన పాల గ్లాసు కనపడలేదని, అది ఉంటే ఫోరెన్సిక్‌ నిపుణుల చేత పరీక్షలు చేయిస్తే అసలు కారణం బయటపడుతుందని చెప్పినా వినిపించుకోలేదంటూ వార్తలు కూడా వినిపించాయి. నేటికీ శాస్త్రీజీ సరళత, దేశభక్తి మరియు నిజాయితీని భారతదేశమంతా గౌరవంగా గుర్తుంచుకుంటారు. 1966 లో ఆయనకు మరణానంతరం భారత్‌ రత్న అవార్డు లభించింది.

  • పిన్నింటి బాలాజీ రావు
    హనుమకొండ.
    9866776286
    (నేడు లాల్‌ బహుదూర్‌ శాస్త్రి గారి జయంతి )
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News