ఇటీవల లా కమిషన్ చేసిన సిఫార్సుపై దేశంలో దుమారం చెలరేగుతోంది. ఇది పరువు నష్టం కేసులకు సంబంధించిన విషయం. లా కమిషన్ ప్రభుత్వ మనోభావాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తోందంటూ అటు ప్రతిపక్షాలు, ఇటు కొందరు నిపుణులు విమర్శించడం జరుగుతోంది. నేరపూరిత పరువు నష్టం చట్టాలను యథాతధంగా కొనసాగించాలని లా కమిషన్ సిఫారసు చేసింది. పరువును కాపాడుకోవడం, పరువు నష్టం జరగకుండా చూసుకోవడం అన్నది కూడా ఒక ప్రాథమిక హక్కేనని, ఈ జీవిత హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అందరికీ కల్పిస్తోందని లా కమిషన్ పేర్కొంది. తమకు పరువు నష్టం కలిగించే ప్రసంగాలు చేసినా, వ్యాఖ్యలు చేసినా తమను వాటి నుంచి కాపాడుకోవడానికి ప్రజలకు అధికారం ఉందని, దానికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అది స్పష్టం చేసింది.
లా కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన తన 285వ నివేదికలో ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. ఆర్టికల్ 19 (1)(ఎ) కింద రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, వ్యక్తి స్వేచ్ఛ వంటి హక్కులకు ఇది ఒక విధంగా పరిమితి విధించడమే అవుతుంది. వాక్ స్వాతంత్య్రం దుర్వినియోగం కాకుండా ఉండడానికి రాజ్యాంగం ఈ నిబంధనను ఏర్పాటు చేసింది. ఐ.పి.సిలోని 499, 500 సెక్షన్ల కింద సుప్రీం కోర్టు ఈ పరువు నష్టం చట్టాన్ని సమర్థించడం కూడా జరిగింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే పక్షంలో రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా
విధించడానికి అవకాశం ఉంది. పరువు నష్టం కలిగించినప్పుడు జైలు శిక్ష విధించడంలో తప్పేమీ లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తమ పరువును కాపాడుకునే బాధ్యత, హక్కు పౌరులకు ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. నాగరిక జీవితాన్ని గడపడానికి, సాటి పౌరులతో కలిసి మెలసి ఉండడానికి ఇది ప్రాథమిక అవసరం. ప్రజా జీవితం రోజురోజుకూ విస్తరిస్తుండడం, టెక్నాలజీ కారణంగానూ, సోషల్ మీడియా కారణంగానూ ప్రైవేట్ జీవితంలో ఏకాంతం తగ్గుతున్న కారణంగానూ ఇది
మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ప్రైవేట్ జీవితంలో కూడా పోటీ పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు, పత్రికా రచయితలు, విమర్శకులు, ఉద్యమ కార్యకర్తలు సాధారణ విమర్శలు సాగించినా పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంటుంది. ప్రాథమిక హక్కులుగా గుర్తింపు పొందిన వ్యక్తి స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది భంగకరమే అవుతుందనడంలో సందేహం లేదు. అయితే, ఈ హక్కులు ఎంత ముఖ్యమో, విమర్శలు కూడా అంతే ముఖ్యమనే విషయం గమనించాలి. కాగా, పరువు నష్టం చట్టాన్ని రాజకీయాలు తదితర ప్రజా జీవితాల్లో ఎక్కువగా దుర్వినియోగం చేసుకునే అవకాశమే ఉంది. సుప్రీంకోర్టు చెప్పినట్టు, వ్యక్తి స్వేచ్ఛకు, పరువు నష్టానికి మధ్య సమతూకం పాటించాల్సి ఉంటుంది.
రాజకీయాల్లోనూ, మీడియాలోనే కాక ఇంకా అనేక రంగాలలో దీన్ని దుర్వినియోగం చేయడమే ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరువు నష్టం దావాలు వేసిన సందర్భాలున్నాయి. రాహుల్ గాంధీ మీద పరువు నష్టం దావా దాఖలు కావడం, చివరికి ఆయన్ని పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా చేయడం గుర్తుండే ఉంటుంది. నేరపూరిత పరువు నష్టం చట్టాన్ని రద్దు చేయాలంటూ ఎడిటర్స్ గిల్డ్ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజీలాండ్, శ్రీలంక వంటి దేశాలు ఈ చట్టంలో నేరపూరిత అనే మాటను ఏనాడో తొలగించాయి. పరువు నష్టం చట్టం ఉండడం సాధారణ విషయమే కానీ, దీన్ని ఒక నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధించడం సమంజసంగా కనిపించడం లేదు. ప్రశ్నించడాన్ని ఒక నేరంగా భావించే రోజుల్లో రూపొందించిన ఈ చట్టం నుంచి నేరపూరిత అనే మాటను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు, సరైన విమర్శకు కూడా ప్రజాస్వామ్యంలో అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో విమర్శను నేరంగా పరిగణించడానికి
ఆస్కారం లేదు. అయితే, ఆధారాలున్నా లేకపోయినా విమర్శల దుమారం సాగించడం, వ్యక్తిగత దూషణలు సాగించడం కూడా వ్యక్తి స్వేచ్ఛలో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమనుకుంటే పొరపాటే. ప్రస్తుతం దేశంలో అదే ఎక్కువగా జరుగుతోంది.