Tuesday, September 17, 2024
HomeతెలంగాణVemulavada: వైస్ ఎంపీపీపై అవిశ్వాసానికి అడుగులు!

Vemulavada: వైస్ ఎంపీపీపై అవిశ్వాసానికి అడుగులు!

త్వరలోనే కాంగ్రెస్ ఖాతాలోకి వైస్ ఎంపీపీ పదవి?

వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపీపీపై అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు చడిచప్పుడు లేకుండా కొనసాగిన అర్బన్ మండల రాజకీయాల్లో చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ కీలక నేత, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యుడు వనపర్తి దేవరాజ్ బి.ఆర్.ఎస్ పార్టీని వీడి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. ఇదే క్రమంలో వైస్ ఎంపిపి పోస్టుకు ఎసరు పెట్టె పరిస్థితి నెలకొంది. వాస్తవానికి మొత్తం 6 ఎంపిటిసి స్థానాలు కలిగిన అర్బన్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీటీసీ సభ్యుడు(బాస రాజశేఖర్-అనుపురం) ఉండగా, బి.ఆర్.ఎస్ పార్టీకి-04, బీజేపీకి ఒక్క సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన బూర వజ్రమ్మ-బాబు (మారుపాక), ఎంపిపిగా, రేగులపాటి రవి చందర్ రావు(చింతల్ ఠాణా) వైస్ ఎంపిపిగా కొనసాగుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ రాష్ట్రంలో ఒక్కసారిగా బి.ఆర్.ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే దేవరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక్కసారిగా లెక్కలు మారాయి. ఈ నేపథ్యంలోనే వైస్ ఎంపిపిపై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు, దీనికి అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనక జరిగితే ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కలిగిన కాంగ్రెస్ పార్టీకి బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన రుద్రవరం ఎంపిటిసి సభ్యులు గాలిపల్లి సువర్ణ-స్వామి గౌడ్, బీజేపీ పార్టీకి చెందిన సంకేపల్లి ఎంపీటీసీ సభ్యులు బుర్ర లహరిక-శేఖర్ గౌడ్ లు సంపూర్ణ మద్దతు ఇస్తారని, దీంతో 4మంది సభ్యుల సంపూర్ణ మెజారిటీతో అనుపురం ఎంపిటిసి సభ్యుడు బాస రాజశేఖర్ లేదా చీర్లవంచ ఎంపిటిసి సభ్యుడు వనపర్తి దేవరాజ్ వైస్ ఎంపిపి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఎంపీ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలడమే కాకుండా కాంగ్రెస్ ఖాతాలోకి వైస్ ఎంపీపీ పదవి చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వేచి చూడాలి మరి ఏమి జరుగుతుందో?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News