ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మార్క్సిస్టు పార్టీ తదితర వామపక్షాలు ఎటువంటి వ్యూహాలను రూపొందించుకుంటున్నాయనేది వామపక్ష అభిమానులకు అంతుబట్టడం లేదు. వామపక్షాలు ఇప్పటికైనా తమ ప్రాభవాన్ని, ప్రాధాన్యాన్ని పెంచుకునేందుకు, పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నించాలని వారు ఆశిస్తున్నారు. ఈ దిశగా వామపక్ష నాయకత్వం ప్రయత్నాలేమైనా చేస్తోందా అన్నది అర్థం కావడం లేదు. నిజానికి ఇంతవరకూ అటువంటి ప్రయత్నమేదీ కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్ లోని మార్క్సిస్టు పార్టీ వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించింది. ఈ ర్యాలీల చివరి రోజున అంటే జనవరి 7న ఒక పెద్ద బహిరంగ సభను కూడా నిర్వహించింది. ఈ ‘ఇన్సాఫ్ సభ’కు హాజరైన లక్షలాది మంది కార్యకర్తలను, ప్రజలను చూసిన వారికి దేశంలో మార్క్సిస్టు పార్టీ గానీ, ఇతర వామపక్షాలు గానీ సచేతనంగానే ఉన్న విషయం తేలికగా అర్థమవుతుంది. మార్క్సిస్టు పార్టీకి ఎదురుగా ఎన్నో సవాళ్లు ఉన్న విషయం నిజమే. పశ్చిమ బెంగాల్ తో సహా అనేక రాష్ట్రాల్లో దీని అవసరం కనిపిస్తూనే ఉంటోంది. అది ‘తలచుకుంటే’ ఉన్నత శిఖరాలకు చేరుకోగలదనే నమ్మకం కూడా ఏర్పడుతుంది.
ఈ ర్యాలీల కోసం, బహిరంగ సభ కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు దేశ రాజకీయ రంగంలో తమ ప్రాధాన్యం కోసం చెప్పకనే చెప్పడం జరిగింది. సి.పి.ఐ(ఎం) యువజన విభాగమైన డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డి.వై.ఎఫ్.ఐ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నిజానికి, బహిరంగ సభలకు హాజరైన జనాన్ని బట్టి పార్టీల బలాబలాలను అంచనా వేయడం సమంజసం కాదని అనేక సందర్భాల్లో రుజువైంది. ప్రజలు అనేక కారణాల వల్ల బహిరంగ సభలకు హాజరవడం జరుగుతుంటుంది. వారిని బట్టి పార్టీల బలాన్నే కాదు, ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే అవకాశాలను కూడా నిర్ధారించలేం. విశ్వసనీయత గురించి చెప్పలేం. వాటి సైద్ధాంతిక, రాజకీయ సాఫల్యాలను లెక్కకట్టడం కూడా సాధ్యం కాదు. నిజానికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి వామపక్ష సిద్ధాంతాలు, భావజాలం అనేక విధాలుగా మార్పులు, చేర్పులకు లోనవుతూ వచ్చింది. ఇతర పార్టీలు అనేకం వామపక్ష భావజాలాన్ని, సిద్ధాంతాలను తమకు సొంతం చేసుకోవడంతో వామపక్షాల సిద్ధాంతాలకు ఎక్కడా అవకాశం లేకుండా పోయింది.
కేంద్రంలోనే కాక, రాష్ట్రాల్లోనూ వామపక్ష-మధ్యేవాద శ్రామిక రాజకీయ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. వామపక్షాలు ఈ సత్యాన్ని అంగీకరించకపోవచ్చు. ఇక కొన్ని రాష్ట్రాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ, అవి పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, విద్యావకాశాల మెరుగుదల, సామాజిక భద్రత, ఉద్యోగావకాశాలతో కూడిన ఆర్థికాభివృద్ది వంటి వామపక్ష సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం జరగలేదు. పశ్చిమ బెంగాల్ లో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ వామపక్షాలు ఈ సిద్ధాంతాలను, ఆశయాలను అమలు చేయలేకపోయాయి. ఇటీవల సుమారు 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమిలోని పార్టీలు పేరుకే చేతులు కలిపాయి కానీ, ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ ఈ ఐక్యత అమలు కాలేదు. మార్క్సిస్టు పార్టీ కూడా ఇదే పంథానే అనుసరించింది. పశ్చిమ బెంగాల్ లో ఈ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని తేలిపోయింది. పైగా, భారతీయ జనతా పార్టీతో తృణమూల్ కాంగ్రెస్ పరోక్షంగా చేతులు కలుపుతోందంటూ ప్రచారం కూడా ప్రారంభించింది.
పైగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనను అసమర్థ పాలనగా మార్క్సిస్టు పార్టీ అభివర్ణిస్తోంది. నిజానికి, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్సిస్టు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలనే కొనసాగిస్తోంది. ఉపాధి హామీ పథకం తమ మానస పుత్రిక అని చెప్పుకునే మార్క్సిస్టు పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఆ పథకాన్ని ఎక్కడా ఎప్పుడూ అమలు చేయలేదు. ఇటువంటి ప్రకటనలు, ప్రసంగాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు పార్టీ విశ్వసనీయతను దెబ్బతీయడం జరుగుతోంది. పార్టీని పునరుజ్జీవింప చేస్తామని, పార్టీలో యువ రక్తాన్ని నింపుతామని, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని మార్క్సిస్టు పార్టీ దాదాపు దశాబ్ద కాలంగా చెబుతోంది. ఇంతవరకూ పార్టీలో అందుకు సంబంధించిన ప్రణాళిక రూపుదిద్దుకోలేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీ కమిటీల్లో అట్టడుగు వర్గాల శ్రామికులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని, బడుగు వర్గాల ప్రాబల్యాన్ని పెంచుతామని ప్రకటించడం జరిగింది కానీ, అవి ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదు. ఇక 15 మంది సభ్యుల కార్యవర్గంలో కూడా ముస్లింలకు, గిరిజనులకు ఒక్కొక్క సభ్యత్వమే లభించింది. మొత్తం మీద ఎక్కడా ఆశించిన, ప్రకటించిన మార్పు మాత్రం రాలేదు.