Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Leftists: మార్క్సిస్టు పార్టీ తీరే వేరు

Leftists: మార్క్సిస్టు పార్టీ తీరే వేరు

ఏ విధంగా చూసినా దేశ రాజకీయాల్లో మార్క్సిస్టు పార్టీ (సి.పి.ఐ-ఎం) ఒక విలక్షణమైన, ప్రత్యేకమైన పార్టీ. దేశంలో మరే పార్టీకీ లేని మంచి లక్షణం ఒకటి ఈ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఆ లక్షణం ఏమిటంటే, సందర్భం వచ్చినప్పుడల్లా ఆత్మవిమర్శ చేసుకోవడం. పార్టీ సమావేశాలు జరిగినప్పుడు ప్రతిసారీ తనను తాను సంస్కరించుకుంటూనే ఉంటుంది. మారడానికి ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటుంది. అవసరమైతే తన వ్యూహాలను, తన ఆలోచనలను మార్చుకుని ముందుకు వెళ్లడానికి ఏమాత్రం సందేహించదు. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండి, చివరికి ఓటర్ల తిరస్కారానికి గురైన మార్క్సిస్టు పార్టీ నిరాశా నిస్పృహలతో కుప్పకూలిపోకుండా, వెంటనే తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించింది. తనను తాను చక్కదిద్దుకునే కార్యక్రమం చేపట్టింది. అప్పట్లో ఆ పార్టీ అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీలోని కొన్ని అవాంఛనీయ, భూస్వామిక శక్తులను కలుపు మొక్కలను ఏరేసినట్టు ఏరిపారేశారు.
పార్టీలో అత్యున్నత స్థాయి నుంచి అట్టడుగు స్థాయి కమిటీల వరకు ప్రతి యూనిట్లోనూ తప్పనిసరిగా ఆత్మవిమర్శ జరుగుతుంది. పార్టీ వ్యవహారాల మదింపు జరుగుతుంది. దిద్దుబాటు చోటు చేసుకుంటుంది. అంతేకాదు, పార్టీ అత్యున్నత స్థాయి కార్యవర్గం సమావేశమై, గంటల కొద్దీ చర్చించి, పార్టీ తీరు తెన్నులను మదించి, ఒక సమగ్ర నివేదికను తయారు చేసి, అట్టడుగు స్థాయి కార్యకర్త వరకూ పంపిణీ చేసింది. ఈ నివేదిక పేరు ‘సమకాలీన రాజకీయాలు-సంస్థాగతంగా తక్షణం పార్టీ చేపట్టాల్సిన కర్తవ్యాలు.” ఈ నివేదిక పార్టీలోని ప్రతి ఒక్కరికీ సరికొత్త మార్గదర్శనంగా మారింది. కేరళలో రూపుదిద్దుకున్న ఈ నివేదికనే జాతీయ స్థాయిలో కూడా అమలు చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఆ పార్టీకి కేరళ పాలన, విధానాలు, కార్యక్రమాలే ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయంటే అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఈ పార్టీకి ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలా కంచుకోటగా వెలిగిందో ఇప్పుడు కేరళ అంత కంచుకోటగా వెలుగుతోంది. నిజానికి, కేరళ రాష్ట్రం ఆ పార్టీ విధానాలను ముందుకు నడిపించడానికి అనేక విధాలుగా తోడ్పడుతోంది.
ఆచరణకు చాలా దూరం
ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే, పార్టీలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ప్రతి విమర్శలు సాగించడం, ఆరోపణలు చేయడం, ప్రత్యారోపణలు చేయడం వంటివి ఎక్కువయ్యాయి. మద్య ఎడం పెరిగిపోయింది. మాదక ద్రవ్యాల సేవనం హద్దులు దాటిపోతోంది. అత్యాచారాల కేసులు కూడా ఎ క్కువయ్యాయి. ఇక ఆర్థికపరమైన అవకతవకలకు, అవినీతికి హద్దూ పద్దూ లేకుండా పోయింది. ఇవి చాలదన్నట్టు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సామాజికంగా తిరోగమన విధానాలను, పద్దతులను అనుసరించడం కూడా మొదలుపెట్టారు. పార్టీ నాయకులకు నిర్దేశించిన జీవన శైలిని, జీవన విధానాలను నాయకులు గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకపక్క పార్టీలో అంతర్మథనం జరుగుతున్న సమయంలోనే పార్టీ సీనియర్ నాయకుడు పి. జయరాజన్ మరో సీనియర్ నాయకుడు, ఎల్. డి.ఎఫ్ కన్వీనర్ అయిన ఎల్.పి. జయరాజన్ సంపద కూడగట్టుకుంటున్నారంటూ ఆరోపణలు ప్రారంభి౦చారు.
ఆయన మీద గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు అనేకం వచ్చాయి. అయితే, పార్టీ నిర్దేశించిన జీవన శైలికి విరుద్ధంగా నడచుకోవడానికి సంబంధించి ప్రతివారికీ ఆయన ఒక ఉదాహరణగా మారుతు న్నారు. పార్టీలో భూస్వామిక విధానాలు ప్రబలుతున్నాయనడానికి కూడా ఆయనో ఉదాహరణ కింద మారారు. కేరళ మార్క్సిస్టు పార్టీ రూపొందించిన నివేదిక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆమోదం పొంది, ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ అవుతోంది. ఇది మాత్రమే కాదు. గతంలో కూడా అనేక పర్యాయాలు మార్క్సిస్టు పార్టీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. 1996లోనూ, ఆ తర్వాత 2009లోనూ పార్టీలో పెద్ద ఎత్తున ఆత్మవిమర్శ, ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పట్లో కేంద్ర కమిటీయే ఈ కార్య క్రమాన్ని భుజాలకెత్తుకుంది. కేరళ శాఖ అయితే, 2013లో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సాధారణం గా ఈ దిద్దుబాటు చర్యలకు పార్టీ మనసా వాచా కర్మణా కట్టుబడి ఉంటుంది. కానీ, గతంలో కోల్క తా, కోళికోడ్ ప్లీనరీ సమావేశాల్లో తీసుకున్న దిద్దుబాటు చర్యలు ఏ కారణంగానో పార్టీలో ఇంతవరకూ అమలు కాలేదు. పార్టీ ప్రక్షాళనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన చర్యలు అమలు జరిగి ఉంటే బాగు౦డేది. దేశంలో తమ ఉనికిని కాపాడుకుని, తమ ప్రాధాన్యాన్ని పెంచుకోవాలనుకున్న పక్షంలో ఆత్మవిమర్శ, ఆత్మశుద్ధి కార్యక్రమాలకు పార్టీ దృఢంగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News