జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్లో గత డిసెంబర్ 21న సైనిక వాహన శ్రేణి మీద ఉగ్రవాదులు దాడి చేసి అయిదు మంది సైనికులను హతమార్చడం గూఢచర్య వైఫల్యానికి అద్దం పడుతోంది. ఆ ఆకస్మిక దాడిని పురస్కరించుకుని భద్రతాదళాలు ఎనిమిది మంది స్థానికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తమయింది. మరణించిన ముగ్గురూ స్థానిక గిరిజనులైన గుజ్జర్లు కావడంతో పరిస్థితి మరీ విషమించింది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను నిలిపివేయడం జరిగింది. ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం భద్రతా దళాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 2021 నుంచి ఇంతవరకు పూంచ్, రాజౌరి జిల్లాలలో సైన్యం 33 మంది సైనికులను కోల్పోవడం జరిగింది. 2021 నుంచి గత మే నెల వరకూ జమ్మూ కాశ్మీర్ లో 251 ఉగ్రవాద సంబంధిత సంఘ టనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది నవంబర్ లో రాజౌరీ జిల్లాలో ఇద్దరు అధికారులతో సహా నలుగురు సైనిక సిబ్బంది ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక గత సెప్టెంబర్‌లో అనంతనాగ్ సమీపంలోని కోకర్ నాగ్ ప్రాంతంలో ఒక మేజర్, ఒక కెప్టెన్, ఒక సైనికుడు, ఒక డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌లను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇక ఏప్రిల్‌లో పూంచ్ జిల్లా పీర్ పంజల్ వ్యాలీలో ఉగ్రవాదుల దాడిలో అయిదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
నిజానికి, 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గింది కానీ, సైనికుల మీద ఉగ్రవాదుల దాడులు మాత్రం బాగా పెరిగాయి. ముఖ్యంగా వాస్తవాధీన రేఖకు దగ్గరగా పూంచ్, రాజౌరీ జిల్లాలలో ఉన్న పీర్ పంజల్ వ్యాలీ వంటి ప్రాంతాలలో భద్రతా దళ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ప్రాంతమంతా చిట్టడవులు వ్యాపించి ఉండడం, అనేక ప్రదేశాలు చొరలేని ప్రాంతాలు కావడం, ఉగ్రవాదులు దాక్కోవడానికి అవకాశం ఉండడం, దాడుల తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోవడానికి అనువుగా ఉండడం ఈ దాడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది భద్రతా దళాల నిఘా కన్నుల్లో లేనివారే. స్థానికంగా ఉగ్రవాదులు తయారు కావడం బాగా తగ్గింది కానీ, పాకిస్థాన్ నుంచి వచ్చేవారి సంఖ్య, గుర్తు తెలియని ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.
స్థానికంగా గానీ, గ్రామీణ స్థాయిలో గానీ గూఢచర్య కలాపాలు బాగా తక్కువగా ఉన్నందువల్ల ఉగ్రవాదులు ఇటువంటి ప్రాంతాలను ఆశ్రయించి తమ కార్యకలాపాలను పెంచడం జరుగుతోంది. అడవుల సంరక్షణ కోసం కంచెలు నిర్మించడంతో ఇక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వెళ్లడం ఆగిపోయింది. ఈ గ్రామీణుల కారణంగానే భద్రతా దళాలకు, గూఢచారులకు ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం అందుతూ ఉండేది. అయితే, ఈ కంచెలు, ఆంక్షల కారణంగా స్థానిక గూఢ చర్యం అనేది బాగా తగ్గిపోయింది. అధికారుల తీరుతెన్నుల పట్ల కొద్దిగా విముఖత ఏర్పడడం కూడా ఇందుకు కారణం అవుతోంది. అందువల్ల స్థానిక అధికారులు, సైనికాధికారులు, భద్రతా దళాలు స్థానికుల్లో నమ్మకం పెంచడానికి కృషి చేయాల్సి ఉంది. ముఖ్యంగా పీర్ పంజల్ వ్యాలీలోని గిరిజనుల వల్ల అధికారులకు ఎంతో ఉపయోగం ఉంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో స్థానిక గూఢచర్య వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, స్థానికుల మద్దతును కూడగట్టుకోవాల్సి ఉంటుంది. అధికారిక గూఢచర్యం కంటే అనధికార గూఢచర్యం చాలావరకు ఉపయోగపడే అవకాశం ఉంది.
Locals are not supporting army in J&K: జమ్మూ కాశ్మీర్ లో స్థానిక మద్దతు ఏదీ?
పూంచ్ ఎన్ కౌంటర్లో స్థానికుల మృతి