Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Loksabha Elections 2024: అజెండా 2024 హైలైట్స్ ఇవే

Loksabha Elections 2024: అజెండా 2024 హైలైట్స్ ఇవే

ప్రో హిందూ ఇమేజ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఉచిత విద్యుత్, రైతు రుణ మాఫీ, యూసీసీ ..ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు అజెండా 2024రూపంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను శాసిస్తున్నాయి. ఈ అంశాలపై సరియైన కసరత్తు చేస్తే ఓటరును మెప్పించవచ్చనేలా పరిస్థితి తయారైంది. ఈ అంశాలను నిర్లక్ష్యం చేస్తే నేల విడిచి సాము చేసినట్టే లెక్క. అందుకే వీటిపై ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మిగతా పెద్దా, చిన్నా రాజకీయ పార్టీలు కూడా దీనిపైనే దృష్టి సారిస్తున్నాయి. ఈ అంశాలపై సరైన నిర్ణయం తీసుకుని చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రజల విశ్వాసం చూరగొన్న పార్టీదే 2024 ఎన్నికల్లో విజయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ పెన్షన్ స్కీం తెస్తామని కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించింది. అంతేకాదు మధ్యప్రదేశ్ వంటిచోట్ల ఓల్డ్ పెన్షన్ స్కీంతోపాటు రైతు రుణమాఫీని కూడా ప్రధానంగా ప్రచారంలోకి తెచ్చింది. కానీ ఇవి అమలు చేయటం అసాధ్యమని బీజేపీ పదేపదే వాదిస్తూ అధికార వ్యతిరేకతను భారీగా మూటకట్టుకుంటోంది.

- Advertisement -

2024లో జరిగే ఎన్నికలే బీజేపీ, కాంగ్రెస్, ఆప్, టీఆర్ఎస్, తృణముల్ వంటి పార్టీల ప్రధాన లక్ష్యం. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని మోడీ టీం భారీ స్కెచ్ లు వేస్తూంటే మోడీని సాగనంపాలని మిగతా పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఎప్పటి నుంచో ఎన్నికల కసరత్తులో నిమగ్నమై ఉన్న బీజేపీ తాజాగా మరోమారు తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూ సరికొత్త అస్త్రాలను బయటికి తీసి, వాటికి సానపెడుతోంది. 2024 ఎన్నికల రోడ్ మ్యాప్ అంటూ ఓ కమిటీని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన కమలం పార్టీ.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా తమ బీజేపీ సర్కారులో చేయాల్సిన భారీ కసరత్తు గురించి చేసిన సలహాలు సూచనలు ఇప్పుడు పార్టీలకతీతంగా అందరు సీఎంలకు ఉపయోగపడేలా ఉంది. ఓవైపు రాష్ట్రపార్టీలో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తేకానీ మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చౌహాన్ రిపోర్ట్ తేల్చి చెబుతోంది. గుజరాత్ లో దాదాపు ఇదే పని చేసి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ప్రస్తావిస్తున్నాయి. అధికార వ్యతిరేకత, నేతలు, మంత్రులపై ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి సాహసం చేసి ప్రభుత్వానికి, పార్టీకి సీరియస్ చికిత్స చేస్తే కానీ అధికారం నిలబెట్టుకోవడం అసాధ్యమనే విషయాన్ని ప్రాంతీయ పార్టీలు సైతం గ్రహించాయి. మరో ఏడాదిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్ ఎన్నికలకు సరిగ్గా ఏడాది గడువుండగానే పార్టీ-ప్రభుత్వ ప్రక్షాళనను చేపట్టింది బీజేపీ. ఇదే ఫార్ములాను తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ చేయక తప్పదనే పరిస్థితి ప్రస్తుతం వాటిల్లింది. విజయ్ రూపాని నేతృత్వంలోని గుజరాత్ సర్కారులో క్యాబినెట్ మొత్తం పునర్వ్యవస్థీకరించారు. 45 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా ఈ మొత్తం స్థానాల్లో 43 చోట్ల బీజేపీ విజయబావుటా ఎగురవేసింది.

ఇలా ఒక్కో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీలకు కొత్త రక్తం ఎక్కించి, చికిత్స చేస్తేనే 2024ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే వాతావరణం సృష్టించినట్టు అవుతుందనేది హైకమాండ్ ఆలోచన కూడా. రాష్ట్రస్థాయిల్లో చేయాల్సిన కసరత్తులపై ప్రత్యేక దృష్టిపెట్టిన హైకమాండ్ ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్ రెడీ చేయక తప్పని పరిస్థితుల్లో ఉన్నట్టు కమలనాథులు గ్రహించారు.

ఈ వ్యూహంలో భాగంగా కమిటీ సభ్యులు ప్రతి గ్రామం, పట్టణానికి వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తారు. ఈ కమిటీనే సరైన ప్రణాళికను సిద్ధం చేసి, కార్యక్రమాలను కూడా రూపొందించి, ప్రచార కార్యక్రమాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 జనరల్ ఎలక్షన్స్ లో పార్టీని గట్టెక్కిస్తాయని పార్టీ భావిస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రెజెన్స్ లేని ఆప్ గురించి బీజేపీ పెద్దగా ఆలోచించటం లేదని పదేపదే చెబుతోంది కమలం పార్టీ. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓటమిపాలు కావటం వెనుకున్న కారణాలు డీకోడ్ చేస్తే ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలం కానేకాదు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ దాదాపు సమానమైన ఓట్ షేర్ దక్కింది. కానీ కేవలం రెబెల్ ధాటికి బీజేపీ హిమాచల్ లో అధికారానికి దూరమైంది. కాబట్టి తిరుగుబాటు అభ్యర్థులే బీజేపీని ఇక్కడ ఓడించారు.

ఇంట్లోవారే శతృవులుగా మారితే ఎంత ప్రమాదమో అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా బాగా తెలిసివస్తోంది. మనదేశంలో రెబెల్స్ అత్యధికంగా ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి. వీరికి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే సాకుతో రెబెల్స్ గా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి హిమాచల్ లో బీజేపీ ఓటమిని చూసి కాంగ్రెస్ కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటోంది. బీజేపీకూడా ఈ విషయంపై పూర్తిగా దృష్టిసారిస్తూ ఇంటి దొంగలపై వేటు వేసేందుకు కఠినమైన క్రమశిక్షణా అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఇక బీజేపీలోని రెబెల్స్ ను పార్టీ ఉపేక్షించే పరిస్థితే లేదు. అంతేకాదు విపక్షాలపై నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మాటల కత్తులు దూస్తే ప్రయోజనం లేదని బీజేపీ ఆలస్యంగా గ్రహించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయం తరువాత తమ ఓటమికి కారణాలను బీజేపీ అర్థం చేసుకుంది. ఎటువంటి ఆకట్టుకునే హామీలు ఇవ్వకపోగా, తాము సాధించిన ప్రగతిని చెప్పుకోవటం అటుంచి కేవలం ఆప్ మంత్రులు, ఆప్ నేతల దందాలపై దూకుడు ప్రదర్శించి ప్రజల మెప్పును పొందలేకపోయింది బీజేపీ. దీంతో రానున్న 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ తప్పులను బీజేపీ రిపీట్ చేయకూడదని డిసైడ్ అయింది.

కానీ ఇటు కాంగ్రెస్ మాత్రం అన్ని పార్టీల కంటే ముందే 2024 సన్నాహకాలు జోరుగా మొదలు పెట్టింది. ఇందులో భాగమే భారత్ జోడో యాత్ర. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర 2.0తో దేశమంతా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని నోటితో చెప్పకుండానే సందేశాన్ని మాత్రం గట్టిగా ఇచ్చేశారు. విద్యాధికులైన రఘురాం రాజన్ ఏంటి ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆఖరుకి సామాన్యులు కూడా పెద్ద ఎత్తున రాహుల్ పాదయాత్రపై ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో రాహుల్ యాత్రపై ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న అప్డేట్స్, యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ అవుతున్న విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే రాహుల్ కు పెరుగుతున్న ప్రజాదరణ, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరుగుతున్నట్టు పాజిటివ్ అంశాలు చాలా కనిపిస్తాయి.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటకలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్న అసలు సమస్యలకు పరిష్కార మార్గాలనే ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచేలా ఇప్పటి నుంచే హామీల వర్షం కురిపించటం మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది. తన స్ట్రాటజీ మార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కడిగిపారేస్తోంది. యూనిఫాం సివిల్ కోడ్ కు ఎనిమిదేళ్ల సమయం సరిపోలేదా అంటూ దెప్పిపొడుస్తోంది. పార్టీలో కొత్త జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా స్లోగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా రాహుల్ ఇమేజ్ పెంచటం, ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లటాన్నే కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి కారణం మోడీ ఇమేజ్ చాలా పెద్దది కావటమే. మోడీని, మోడీ పార్టీని ఢీ కొట్టాలంటే మోడీ అంతటి ఇమేజ్ సంపాదించుకోవటం అతి పెద్ద అర్హత అని కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు గుర్తించటమే భారత్ జోడో యాత్ర వెనుకున్న రహస్యం.

ఇటు కాస్త దూకుడును తగ్గించిన మమతా బెనర్జీ బీజేపీతో శృతి కలుపుతోంది. దేశం ముందు రాజకీయలు తరువాత అంటూ సరికొత్తగా దీదీ మాట్లాడుతుండటం రాజకీయ పార్టీలకు అంతుచిక్కకుండా చేస్తోంది. వీలైనంత తొందరగా జాతీయ పార్టీ హోదా దక్కించుకోవటాన్ని ఆమె టార్గెట్ గా పెట్టుకుని ఈశాన్య రాష్ట్రాలపై దృష్టిసారిస్తున్నారు. అటు సంఘటితంగా పోరాడదాం, మళ్లీ అధికారంలోకి వద్దామంటూ నితీష్ కుమార్ ఆర్జేడీ సుప్రిమో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ సర్కారులో ప్రస్తుతం తేజస్వి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.

2024 టార్గెట్ గా ఆప్ తెగ కుస్తీలు పడుతూ, రెట్టించి ఉత్సాహంతో పనిచేస్తోంది. అసలే జాతీయ హోదా దక్కించుకున్న జోష్ లో ఉంది కేజ్రీవాల్ పార్టీ. వీరు సింపుల్ గా బీజేపీ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. రామ రాజ్యం తెస్తామని కేజ్రీవాల్ పదేపదే చెబుతుంటే మరోవైపు ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా దేశ భక్తి బడ్జెట్ తో బీజేపీ నినాదమైన జాతీయవాదాన్ని కౌంటర్ చేస్తున్నారు. తనను తాను శ్రవణ కుమారుడిగా పబ్లిసిటీ చేసుకుంటున్న కేజ్రీవాల్ తీర్థయాత్రలకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటూ తాను హనుమ భక్తుడినంటూ చెప్పుకుని తిరుగుతున్నారు. మన కరెన్సీ నోట్లపై లక్ష్మి, గణపతి విగ్రహాలు చేర్చాలంటూ కేజ్రీవాల్ డిమాండ్లు చేసేస్తూ, తాను అపర హిందువునంటూ హిందూ ఓటు బ్యాంకును మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఆప్ కు గట్టి షాక్ ఇచ్చింది. మైనారిటీలు అత్యధికంగా ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఢిల్లీలోని కొన్ని వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తక్కువ ఓట్లు రావటంతో ఇప్పుడు తన ప్రో హిందూ ఇమేజ్ విషయంపై ఆప్ లో మేథోమధనం సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News