Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్Telugu Sahithyam: కథకులకు కథకుడు మధురాంతకం

Telugu Sahithyam: కథకులకు కథకుడు మధురాంతకం

కథా సాహిత్యాన్ని అక్షర ఆయుధంగా ..

సమకాలీన కథకుల్లో వినూత్న కథకుడు మధురాంతకం రాజారాం. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలోని దామల్చెరువు గ్రామానికి చెందిన ఈ గ్రామీణ రచయిత అక్కడి ప్రజల ఈతిబాధలు, కష్టనష్టాలు, రాగద్వేషాలు, సాఫల్య వైఫల్యాల గురించి అతి మధురమైన భాషలో, అది సుందరమైన కథనంతో ఆయన వందలాది కథలను మలచారు. ఆయన పైకి కనిపించని సంఘ సంస్కర్త. తన కథకు లోక కల్యాణమే పరమార్థం కావాలని, సమాజాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడమే రచయిత లక్ష్యం కావాలని గట్టిగా నమ్మిన వ్యక్తి మధురాంతకం రాజారాం. ఆయన జీవితాంతం అధ్యయనం చేసింది కూడా అటువంటి సాహిత్యాన్నే. ఆయన తనకు అత్యంత ప్రీతిపాత్రమైన, అభిమానమైన తెలుగు రాష్ట్రాల చుట్టూనే తన ఇతివృత్తాలను నడిపారు. సాధారణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటినే ప్రతిబింబిస్తూ, వాటికి పరిష్కారాలను సూచిస్తూ కథలను రాయడానికి ఆయన నడుం బిగించారు. తెలుగు రాష్ట్రం నాలుగు చెరగులనూ పర్యటించి పరిశీలించి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను అధ్యయనం చేసి, కథా సాహిత్యాన్ని అక్షర ఆయుధంగా చేసుకున్నారు.
ఆయన రాసిన కథలతో వెలువడిన ‘మధురాంతకం రాజారాం కథలు’ సంకలనంలోని కథలను చదివిన వారికి ఆయన సమాజాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారన్నది సులువుగా అర్థమవుతుంది. నాలుగు దశాబ్దాల పాటు కథా సాహిత్యాన్ని పండించిన రాజారాం ఒక ు ఉపాధ్యాయుడుగా అటు పల్లెటూళ్లలోనూ, ఇటు పట్టణాల్లోనూ విధులు నిర్వర్తించడం వల్ల అటు ప్రజానీకంతో, ఇటు సాహితీ బంధువులతో బాగా సన్నిహితం కావడం జరిగింది. ఇదివరకటి భారతి సాహిత్య సంచిక నుంచి ఇటీవలి వారపత్రికల వరకు ఆయన కథను ప్రచురించని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఎక్కువ భాగం కథలు ఆంధ్రపత్రిక వార పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆయన కథలను చదివిని వారికి పల్లెటూళ్లకు సంబంధించిన రైతుల జీవితాలు, రైతుకూలీల జీవితాలు, అక్కడి బడిపంతుళ్ల జీవితాలు కళ్లకు కడతాయి. తన కథల్లోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం అని ఆయన చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. ఆయన తనకు తెలిసిన పాత్రలు, ప్రదేశాలు, పరిస్థితులు, సన్నివేశాలను, జీవన సమస్యల్ని తన కథల్లో నిక్షేపించడానికి ప్రయత్నించారు.
ఇక, 1930లో పుట్టి, 1990లో కాలధర్మం చెందిన రాజారాం కథలకు 1993లో సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఆయన రాసిన ‘హాలికులు కుశలమా’ సంకలనం ఇప్పటికీ ఎప్పటికీ సాహితీవేత్తల హృదయాల్లోనే కాక, సాహితీ అభిమానుల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారతీయ కథా సాహిత్యంలో ‘మధురాంతకం రాజారాం కథలు’ను ఒక అద్భుత మణిపూసగా సాహితీవేత్తలు అభివర్ణించడం జరిగింది. ఆయన కుమారులు మధురాంతకం నరేంద్ర, మధురాంతకం మహేంద్ర కూడా ఆరితేరిన కథకులు కావడంతో ఈ ముగ్గురినీ కలిపి మధురాంతక త్రయం అని పిలిచేవాళ్లు. ఆయన ఏ కథ రాసినా బయటికి సందేశాత్మకంగా కనిపించేది కాదు. అయితే, గ్రామీణ జీవితాన్ని అనేక కోణాల నుంచి ప్రతిబింబించేది. ఎటువంటి రాతి గుండెనయినా కదిలించేది. ఈ కథలను చదవడం ప్రారంభించిన తర్వాత కథల్లో మమేకం కావడం జరుగుతుంది. అనేక కథలను, కథా సంపుటాలను ప్రచురించిన రాజారాం ఎందరో వర్ధమాన రచయితలకు కథా రచనను నేర్పించారు. ఏ విధంగా చూసినా కథా సాహిత్యంలో సమకాలీన రచయితల్లో ఆయనను ఒక అగ్రగణ్యుడుగా భావించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News