Saturday, July 27, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: సంగనభట్ల కథల చెరువులో 'చేపనవ్వింది'

Telugu Literature: సంగనభట్ల కథల చెరువులో ‘చేపనవ్వింది’

నీతి, స్ఫూర్తి, యుక్తి, సందేశాత్మక కథలు..

బాల సాహితీ రచనా రంగంలో అడుగిడి అనంతరం ప్రౌఢ సాహిత్యం వైపు పరుగులు పెట్టడం సర్వసాదారణం, కానీ అందుకు భిన్నంగా మొదట ప్రౌఢ సాహిత్యంలో అందునా పద్య ప్రక్రియలో పరిణితి చెంది, తెలుగు పండితులుగా ఉద్యోగ విరమణ చేసినది మొదలు తనలోని భావాలను బోధన అనుభవాలను జోడించి అద్భుతమైన బాలల కథలు రాస్తున్నారు ధర్మపురి బాలసాహితీ మూర్తి సంగనభట్ల చిన్న రామకృష్ణయ్య. పద్య సాహిత్యం మీద పట్టు గల ఆయన కథలు రాయడంలో కూడా మంచి నేర్పరి వెయ్యినొక్క నవలలు వ్రాసిన కొవ్వలిని ఆదర్శంగా తీసుకొని తన కథారచనలో దూసుకుపోతున్నారు సంగనభట్ల గారు.
ఆయన వ్రాసిన వందలాది పిల్లల కథల్లో ముచ్చటగా మూడవ బాలల కథా సంపుటిగా “చేప నవ్వింది” ప్రచురించారు.
40 కథలు గల ఈ బాలల కథాగుచ్చంలోని ప్రతి కథ ఒక ప్రత్యేకత నింపుకొని ఇంపుగా చదివిస్తుంది. ,”కీర్తి మాధుర్యం” మొదలు “పిల్లి కోతి స్నేహం” వరకు సాగిన ఈ కథా ప్రస్థానంలో నీతి కథలు, స్ఫూర్తి కథలు, యుక్తి కథలు, సందేశాత్మక కథలు, కలగలసి ఉన్నాయి.
ప్రతిఫలాపేక్ష లేని దానం వల్ల కలిగే ప్రయోజనం గురించి వివరిస్తూ తద్వారా కలిగే కీర్తి విలువను ఉపదేశించిన కథ “కీర్తి మాధుర్యం” , మన కృషి శ్రమ పరుల కోసం వినియోగించబడిన నాడే మనకు నిజమైన ఆనందం తృప్తి కలుగుతాయి అనే చక్కని సందేశం పంచిన కథ “వర్షం కోసం”.
యుక్తికథల సరసన చేరి తెలుగు భాష గొప్పదనం చాటిన చక్కని కథ “గొప్ప మనసు”, ఇదే యుక్తికథల వరుసలో చేరిన వాగుడుకాయ, నాలుగు ప్రశ్నలు, వంటి కథలు చదువరులను ఆలోచింపజేస్తాయి చివరికి సంతృప్తి నిండిన సంతోషాన్ని కలిగిస్తాయి.
ఇక “గురుదక్షిణ” కథలో చిన్నతనంలో అల్లరి చిల్లరగా గడిపిన గురువుగారి దండన, శిక్షణ, వల్ల తనను తాను చక్కదిద్దుకుని కష్టపడి చదివి వైద్య వృత్తి చేపట్టి తనవృత్తి ధర్మములో తనకు చిన్నతనంలో చదువు చెప్పిన రాఘవ మాస్టారు ఆశయాల మేరకు పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ రాము, తన గురువుగారికి ఇచ్చిన గురుదక్షిణ గురించి కథ ముగింపులో తెలిసి మనసు అర్థతతో ఉప్పొంగి, గురుశిష్య సంబంధం లోని గొప్పతనం ఆవిష్కరిస్తుంది.
ప్రశ్నించే వారే ప్రతిభావంతులు అనే నానుడిని నిరూపిస్తూ సాగిన మరో యుక్తికథ “వింత ప్రవర్తన”, స్వార్థం కన్నా నిస్వార్థం ఎంతటి గొప్పదో చక్కగా చెప్పిన కథ “కోడి వరం”, సార్తక నామధేయంగా చెప్పిన దురాశ కథతో పాటు ఎవరు తీసుకున్న గోతిలో వారేపడతారు అన్న పెద్దల నానుడిని అన్వయించి చెప్పబడ్డ కథ “పరిశుభ్రత” దీనిలో పర్యావరణ సమస్య గురించి సమన్వయం చేస్తూ స్వార్థ బుద్ధి ద్వారా కలిగే అనర్ధాలు కళ్లకు కట్టినట్టు చెప్పారు.
ఇద్దరు వ్యక్తులు మధ్య సఖ్యత పెంచటం గొప్పతనం కానీ గొడవలు పెట్టి విడగొట్టడం మూర్ఖత్వం. అనే సత్యం చాటడమే కాదు చాడీలు చెప్పి ఇద్దరి మధ్య గొడవలు సృష్టించే దుష్టులకు ఎలా గుణపాఠం చెప్పాలో తెలియాలి అంటే ఇందులోని “పిల్లి కోతి స్నేహం” కథ తప్పక చదవాల్సిందే!
ఇక పుస్తక శీర్షికగా పెట్టిన కథ “చేపనవ్వింది”జ్ఞాన బుద్ధికి పెద్ద ప్రాణి అల్ప రాణి అనే భేదం ఉండదు అని చాటి చెబుతూనే మనం చేసే పుణ్య కార్యాల వల్ల ఇతరులకు ప్రయోజనం కలిగిన నాడే మనం చేసిన పుణ్య కార్యక్రమానికి విలువ సార్థకత చేకూర్తాయి అనే సత్యం చాటి చెబుతూ అనవసర పుణ్య కార్యక్రమాల వల్ల కూడా ఆశించినంత పుణ్యం దక్కదని నిర్మొహమాటంగా చెబుతారు రచయిత.
సాధారణ స్థితిలో ఎన్ని ఉపాయాలు వచ్చిన ఎంత తెలివితేటలు ప్రదర్శించిన వాటివల్ల వచ్చేదేమీ లేదని అపాయకర పరిస్థితుల్లో వచ్చే ఉపాయాలు తెలివితేటలే మన గొప్పతనం పెంచుతాయి అనే గొప్ప సత్యం చాటిన కథ “తెలివిగల చేప”.
విద్యార్థులకు పెద్దలు ఉపాధ్యాయులు అందించే చిన్నచిన్న ప్రోత్సాహాలు వారిని ఎంత ఉన్నత స్థాయికి చేరుస్తాయో చక్కగా వివరించిన కథ “మార్పు”.
నిజాయితీ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చెబుతూ సాగిన కథ కానుక అలాగే స్నేహబంధం, కనువిప్పు, అమ్మ ప్రేమ, చెట్టు సందేశం, త్యాగశీలి,లాంటి కథల్లో రచయిత తనదైన సందేశపూరిత భావుకత వ్యక్తం చేశారు.
కథల పేర్లు కూడా పిరికి వాడి ధైర్యం, ఏనుగమ్మ ఏనుగు, చేప నవ్వింది, వ్యతిరేకవ్రతం, వంటి కథల పేర్లు ద్వారా రచయితలోని భావుకత, కృషి, వ్యక్తం అవుతాయి.
” సైగలతో వ్రతం” కథలో రచయిత చతురత, భావవ్యక్తీకరణ, స్పష్టమవుతాయి ఇలా అన్ని కథలు వేటికవే ముందు వరుసలో నిలుస్తాయి.
ఈ బాల సాహితివేత్త పద్య ప్రక్రియకుచెందిన వారు కావడం వల్ల తన కథల్లో అధిక వాక్యాలు గ్రాంథిక భాణిలో సాగాయి, ఇటువంటి చిరు సవరణలు వినహాయిస్తే పుస్తకంమొత్తం అత్యంతం అలవోకగా చదివిస్తుంది. కథకు అన్వయం లేని పచ్చని చిలుక, పిరికి వాడి ధైర్యం, వంటి కథలు మినహాయిస్తే మిగతా అన్ని కథలు ఒకదాన్ని మించి మరొకటి ఉత్తమమైన లక్షణాలతోనిండి ఉన్నాయి. తెలుగు పాఠక లోకానికి సంగనభట్ల వారు ఇచ్చిన ఈ కథల కానుక బాల సాహితీవేత్త లంత “సొమ్ములతో సొంతం” చేసుకోదగ్గది.
పుస్తకంపేరు: చేపనవ్వింది (బాలల కథా సంపుటి)
పేజీలు:95, ధర:100/- రూ,
ప్రతులకు: సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య (రచయిత) సెల్: 93922 48587.
సమీక్షకుడు: డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్:77298 83223.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News