Thursday, June 27, 2024
Homeఓపన్ పేజ్Maharana Pratap: రాణాప్రతాప్ పోరాట పటిమకు నిదర్శనం హల్దీ ఘాటి యుద్ధం

Maharana Pratap: రాణాప్రతాప్ పోరాట పటిమకు నిదర్శనం హల్దీ ఘాటి యుద్ధం

శౌర్యప్రతాపాలకు పర్యాయపదమైన మహారాణా ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని రాజపుత్రులకు మరియు మొఘల్ దళాలకు మధ్య 18 జూన్ 1576న కేవలం నాలుగు గంటల పాటు జరిగిన ‘హల్దీఘాటి’ యుద్ధం 16వ శతాబ్దంలో భారతదేశ రాజకీయ మరియు సైనిక కార్యకలాపాలను గణనీయంగా ప్రభావితం చేసింది. దాదాపు నాలుగున్నర శతాబ్దాల క్రితం మహా రాణాప్రతాప్ ప్రదర్శించిన పోరాట పటిమను నేటికీ దేశ విదేశాలలో స్మరించుకోవడం భారతీయులుగా మనందరికీ గర్వ కారణం. మే 9, 1540న మేవార్ (ప్రస్తుత రాజస్థాన్)లోని కుంభాల్‌ఘర్‌లో సిసోడియా రాజపుత్ వంశానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్ మరియు రాణి జీవంత్ కన్వా దంపతులకు జన్మించిన మహారాణా ప్రతాప్ సింగ్ 1572లో ‘మేవార్’ సింహాసనాన్ని అధిష్టించాడు. మహారాణా ప్రతాప్ నేతృత్వంలోని రాజపుత్రులకు మరియు మొఘల్ చక్రవర్తి అక్బర్ దళాలకు నేతృత్వం వహించిన మాన్ సింగ్ ఫస్ట్ ఆఫ్ ది అంబర్ సేనల మధ్య జరిగిన భీకర యుద్ధంలో మేవార్ దళాలు ఓటమి చవిచూసినప్పటికీ, మహారాణా ప్రతాప్ సింగ్ మొఘలులకు భారీ ప్రాణనష్టం కలిగించి తన అద్వితీయ పోరాట పటిమను మరియు పరాక్రమాన్ని రుచి చూపించడంలో విజయం సాధించడంతో ‘హల్దీఘాటి’ యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం దక్కింది.

- Advertisement -

హల్దీఘాటి యుద్ధానికి కారణం:

14 ఫిబ్రవరి 1556న అక్బర్ పట్టాభిషిక్తుడైన తరువాత మొఘలులు భారత ఉపఖండం అంతటా తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఉద్యుక్తమవగా రాజస్థాన్‌లో రాణాప్రతాప్ వారికి ఒక ముఖ్యమైన ప్రతిపక్ష శక్తిగా ఉద్భవించడంతో రాజస్థాన్‌ లోని ఆరావళి శ్రేణిలో ఉన్న ఇరుకైన పర్వత మార్గం అయిన హల్దీఘాటి ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. 1568లో మొఘలులు చిత్తోర్‌గఢ్ ముట్టడించడంతో మేవార్ రాజ్యంలోని సారవంతమైన తూర్పు ప్రాంతం వారి హస్తగతమవగా చెట్లు కొండలతో నిండిన బీడు ప్రాంతం సిసోడియాల ఆధీనంలో ఉండిపోయింది. కాగా మేవార్ గుండా గుజరాత్‌ ప్రయాణించేందుకు అనువుగా ఒక మార్గం ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో అక్బర్ 1572లో పట్టాభిషిక్తుడైన రాణా ప్రతాప్ సింగ్ ను కూడా ఆ ప్రాంతంలోని ఇతర రాజపుత్ రాజుల మాదిరిగా సామంత రాజుగా మారమని ప్రతిపాదనలు పంపినప్పటికీ మహా రాణాప్రతాప్ వాటిని నిర్ద్వందంగా తిరస్కరించడంతో అది ‘హల్దీఘాటి’ యుద్ధానికి దారి తీసింది. మొదట అక్బర్ తనను అమితంగా అభిమానించే సేవకుడు జలాల్ ఖాన్ ఖుర్చీ ను తరువాత వరుసగా అంబర్ (తరువాత జైపూర్ అయ్యింది ) సామంత రాజు మాన్ సింగ్‌ను, రాజా భగవంత్ దాస్ లను దౌత్యం కోసం పంపగా వారి ప్రయత్నాలు విఫలం కావడంతో చివరగా రాయబారం నెరపడానికి వెళ్ళిన తోడర్ మల్ కూడా రిక్తహస్తాలతో వెనుదిరగడంతో యుద్ధం అనివార్యమైంది. ఈ ప్రాంతంలోని పర్వతాలు పసుపు రంగులో ఉండడంతో దీనికి ‘హల్దీఘాటి’ అని పేరు వచ్చింది.

ఓటమి ఎదురైనా మడమ తిప్పని పోరాట యోధుడు:

సహజంగా ఇరుకైన నైసర్గిక స్వభావం గల హల్దీఘాటి పర్వత శ్రేణి ప్రాంతం అణువణువు తన సేనలకు కొట్టిన పిండి కావడంతో అది వారికి అనుకూలంగాను మరియు భారీ సంఖ్యలో ఉండే మొఘల్ సైన్యానికి గందరగోళంగాను ఉంటుందని మహారాణా ప్రతాప్ భావించాడు. యుద్ధతంత్రంలో భాగంగా అతను హల్దీఘాటి పాస్‌కు దక్షిణంగా 23 కిలోమీటర్ల దూరంలో ఉదయపూర్ నగరానికి సమీపంలో గల గోగుండా పట్టణంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసి యుద్ధ సన్నాహాలు చేసినప్పటికీ, మొఘలులు అక్కడున్న మేవార్ దళాలను గుర్తించి వారిపై దాడి చేశారు. ఇరు పక్షాల మధ్య జరిగిన భీకర పోరులో మేవార్ పక్షం 20 వేల మంది సైనికులతో అశ్వ, గజ దళాలతో తలపడగా అక్బర్ సైన్యం 85 వేల మంది సైనికులతో తలపడింది. అత్యంత శౌర్య ప్రతాపాల మధ్య సాగిన ఈ పోరులో 40 వేల మంది మొఘల్ మరియు 8 వేల మంది మేవార్ సైనికులు నేలకొరిగారు. ప్రారంభంలో మహారాణా ప్రతాప్ తన ఏనుగులను మొఘలుల పైకి పంపి పైచేయి సాధించినప్పటికీ, మొఘల్ మస్కటీర్లు, విలుకారుల (ఆర్చర్స్) మరియు మావటిల ఎదురుదాడి కారణంగా మేవారీ ఏనుగులు ఓడిపోయాయి. అదే సమయంలో మొఘలులు మేవార్ దళాలను మూడు వైపుల నుండి చుట్టుముట్టడంతో రాణాప్రతాప్ కమాండర్లు మరణించడంతో మేవార్ సైన్యానికి గట్టి దెబ్బ తగిలింది. ఎట్టకేలకు ఈ యుద్ధంలో మొఘలులు విజయం సాధించినప్పటికీ, మహారాణా ప్రతాప్‌ను బంధించడంలో మాత్రం విఫలమయ్యారు. భారీ సంఖ్యలో మేవార్ సేనల ప్రాణ నష్టం నేపథ్యంలో, మొఘల్ సేనలు రాణాప్రతాప్ ను చుట్టుముట్టగా తన తోటి యోధుల బలవంతంతో రాణాప్రతాప్ అయిష్టంగానే అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇంతలో మాన్ సింగ్ అనే ఝాలా అధిపతి ఒకరు రాణాప్రతాప్ రాజ చిహ్నాలను ధరించి తానే రాణాప్రతాప్ అని మొఘలులను భ్రమింప చేసి వారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అతని ధైర్యసాహసాల కారణంగా రాణాప్రతాప్ అక్కడినుండి సురక్షితంగా బయటపడగలిగాడు. ఆ తరువాత కూడా ఆయన అజ్ఞాతంలో ఉంటూ గెరిల్లా యుద్ధ వ్యూహాలననుసరించి మొఘలుల విస్తార కాంక్షను ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని రక్షించుకోవడంలో ఇరు పక్షాల మధ్య అనేక దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘమైన భీకర పోరాటానికి ‘హల్దీఘాటి’ నాంది కావడం గమనార్హం. దౌత్యం మరియు ఇతర సామ, దాన, దండోపాయాలను (బ్రూట్ ఫోర్స్) ఉపయోగించి రాజ్‌పుతానాలోని అనేక రాజ్యాలను తమ ఆధీనంలోకి తీసుకోగల్గినప్పటికీ మడమ తిప్పని పోరాట యోధుడైన మహారాణా ప్రతాప్ పాలిస్తున్న మేవార్ మాత్రం మొఘలులకు మోకరిల్లలేదు. 1579 తర్వాత మొఘలుల దృష్టి సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలపైకి మళ్లడంతో రాణాప్రతాప్ చిత్తోర్‌గఢ్ మరియు మిగిలిన తూర్పు మేవార్ మినహా గతంలో కోల్పోయిన పశ్చిమ భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకున్నాడు. మరణించే నాటికి ఆయన తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి సాధించడం గమనార్హం.

స్వామి పరాయణత్వానికి ప్రతీక ‘చేతక్’:

మహారాణా ప్రతాప్‌ చరిత్రను అతని నమ్మిన బంటు ‘చేతక్’తో విడదీయజాలము. మహారాణా ప్రతాప్ శౌర్య ప్రతాపాలకు సంబంధించిన అనేక ప్రసిద్ధ ఇతిహాసాలలో ఆయనకు అత్యంత నమ్మకమైన, ధైర్యమైన గుర్రం ‘చేతక్’ ప్రస్తావన ఉంటుంది. జానపద కథల ప్రకారం, ‘చేతక్’ రాణా ప్రతాప్ జీవితంలో కీలక పాత్ర పోషించిన అద్భుతమైన మరియు విశ్వసించదగిన నేస్తం. హల్దీఘాటి యుద్ధంలో చేతక్ అద్భుతంగా మహారాణా ప్రతాప్‌తో కలిసి పోరాడి అసాధారణమైన ధైర్యాన్ని మరియు విధేయతను ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతుంది. యుద్ధం సమయంలో, తీవ్రంగా గాయపడిన చేతక్ తన యజమానికి ప్రమాదం ఉందని గ్రహించి మహారాణా ప్రతాప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి 26 అడుగుల కందకం మీదుగా అవతలి వైపుకు ఒక్క ఉదుటున లంఘించి తన స్వామి సురక్షితంగా ఉన్నాడని నిర్ధారించుకున్న తరువాత ప్రాణాలు వదిలిందని చెబుతారు. మహారాణా ప్రతాప్ తన నమ్మకమైన సహచరుడిని కోల్పోయినందుకు ఎంతాగానో చింతించి చేతక్ గౌరవార్థం హల్దీఘాటిలో “చేతక్ సమాధి”గా పిలువబడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. మహారాణా ప్రతాప్‌ ‌దగ్గర ఉన్న రాంప్రసాద్‌ అనే ఏనుగు గురించి తన పుస్తకంలో ప్రస్తావిస్తూ అల్‌ ‌బరౌని అనే రచయిత, మేవాడ్‌ యుద్దం సందర్భంగా రాణాప్రతాప్‌‌తో పాటు అయన ఏనుగును కూడా బంధిస్తే సరిపోతుందని అక్బర్‌ ‌తన సైన్యంతో అన్నట్లు పేర్కొన్నాడు. 13 మొఘల్ ఏనుగులను హతమార్చిన రాంప్రసాద్‌ను బంధించడానికి 7 పెద్ద ఏనుగుల మీద 14 మంది నిపుణులైన మావటిలు చక్రవ్యూహం పన్ని బంధించి అక్బర్‌ ‌ముందు ప్రవేశపెట్టగా ఆయన దానికి “పీర్‌ ‌ప్రసాద్‌” అని నామకరణం చేసినట్లు అల్‌ ‌బరౌని పేర్కొన్నాడు. అక్బర్ ఆధీనంలో రాంప్రసాద్ 18 రోజుల పాటు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ప్రాణాలొదడంతో అవాక్కైన అక్బర్‌ “ఈ ఏనుగునే వంచలేక పోయాను… మహారాణాను ఎలా వంచగలుగుతాను” అని అన్నాడట. మహా రాణా ప్రతాప్‌ ‌సింహ్‌ ‌చనిపోయాక అక్బర్‌ ‌కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చరిత్ర కారులు పేర్కొనడం ఆ వీరుడి గొప్పదనానికి నిదర్శనం. 7 అడుగుల ఎత్తుగల ఆజానుబాహువుడైన మహారాణా ప్రతాప్‌ ఉపయోగించినట్లు చెప్పబడే యుద్ధ సామగ్రి ఉదయపూర్‌ ‌ప్యాలెస్‌లో భద్రపరచ బడింది.

విదేశీయులకు స్ఫూర్తి:

అగ్రరాజ్యమైన అమెరికా పై రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అనంతరం విజయం సాధించిన వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి “అమెరికా పై మీరు ఎలా విజయం సాధించారు” అని అడగ్గా “శక్తివతంమైన అమెరికాను ఎదుర్కోవడానికి మేము భారతదేశానికి చెందిన మహా రాణాప్రతాప్ సింగ్ చరిత్ర ద్వారా ప్రేరణ పొంది విజయం సాధించాం’’ అని తెలిపాడు. దివంగత వియత్నాం అధ్యక్షుడి సమాధి మీద నేటికీ “ఇది మహారాణా ప్రతాప్‌ ‌యొక్క శిష్యుడిది” అని రాసి ఉండడం మనకు ఆశ్చర్యం కలిగించకమానదు. భారతదేశ పర్యటనకు విచ్చేసిన వియత్నాం విదేశాంగమంత్రికి దేశంలోని గొప్ప వ్యక్తులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు మొదట గాంధీ సమాధి, ఆ తర్వాత ఎర్రకోట చూపించగా, ఆయన మహారాణా ప్రతాప్‌ ‌సమాధి ఎక్కడ అని అడగడంతో ఆశ్చర్యపోయిన భారత అధికారి ఉదయపూర్‌లో ఉందని తెలిపాడు. దాంతో ఆయన ఉదయ్‌పూర్‌ ‌వెళ్లి మాహా రాణా ప్రతాప్ సింగ్ సమాధిని దర్శించి, అక్కడ నుంచి ‘‘పిడికిడు మట్టిని’’ తీసుకొని జాగ్రత్తగా తన బ్యాగ్‌లో భద్రపర్చుకుని “ఇదే మట్టి దేశ భక్తులైన వీర పుత్రులకు జన్మనిచ్చిందున దీన్ని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతాను. ఇలాంటి రాజు ప్రేరణతో అక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారు” అన్నాడు.

ధైర్యం, శౌర్యం, దేశభక్తికి పర్యాయపదాలుగా నేటికీ కీర్తించబడే “మహారాణా ప్రతాప్ సింగ్” 56 సంవత్సరాల వయస్సులో రాజస్థాన్‌లోని చావంద్ అనే కోటలో మరణించాడు. జీవితకాలంలో, మహారాణా ప్రతాప్ తన రాజ్యం యొక్క స్వాతంత్ర్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు అతని దళాలను దీటుగా ఎదుర్కొన్నాడు.

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

హైదరాబాద్
8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News