మణిపూర్ సమస్యను పరిష్కరించడం మీద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఉన్నట్టు సంకేతాలు, సందేశాలు అందుతున్నాయి. వాస్తవానికి మణిపూర్ సమస్య విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. అంత మాత్రాన ఈ సమస్య గురించి కేంద్ర ప్రభుత్వం చర్యలేమీ తీసుకోవడం లేదనే అభిప్రాయం కూడా సరైనది కాదు. మణిపూర్ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోనూ, హింసా విధ్వంసకాండల్లోనూ ఉన్న సమయంలో కూడా మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు సాగిస్తున్నాయి. ఆయన పార్లమెంట్లోనే మణిపూర్ సమస్యపై సమాధానమిచ్చారు. ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, ఆ తర్వాత మణిపూర్ సమస్యపై చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పడం జరిగింది. మణిపూర్ లో త్వరలో ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించడం జరుగుతుందంటూ ఆయన ఆ రాష్ట్ర ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది.
అయితే, మణిపూర్ సంక్షోభం ఒక జటిల సమస్య అయినందువల్ల ఇక్కడ ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించడానికి సమయం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం వల్ల మణిపూర్ రాష్ట్రంలో నిదానంగా పరిస్థితి చక్కబడుతున్నట్టు ప్రధాని ఇటీవల కూడా ఒక ప్రకటన చేశారు. సమీప బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి వలస వస్తున్న కుకీలు, ఇతర నాగజాతివారు ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్న గ్రహించిన కేంద్ర ప్రభుత్వం మణిపూర్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేయడం కూడా ప్రారంభించింది. మణిపూర్ రాష్ట్రంలోకి చొచ్చుకువస్తున్న కుకీ జాతి వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ సమస్య మీద అంతర్జాతీయ ప్రభావం కూడా ఉన్నందు వల్ల కేంద్రం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. అయితే, మణిపూర్ సమస్య పరిష్కారం విషయంలో మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేయడం మీదే కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు దృష్టి పెడుతున్నాయంటూ హోం మంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది.
ప్రతిపక్షాల ఉద్దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కారణంగానే ఈ సమస్య ప్రారంభమైంది. ఆయన ప్రభుత్వం కుకీలకు వ్యతిరేక వర్గమైన మైతీల పక్షాన ఉండడం వల్లే సమస్య జటిలంగా మారుతోందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రచారం సాగిస్తోంది. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ బీజేపీకి చెందిన వ్యక్తి అయినందువల్ల సహజం గానే కాంగ్రెస్ ఆయనను లక్ష్యంగా చేసుకుంది. మొత్తానికి రాష్ట్ర సమస్య అంతా కుకీలు, మైతీల మధ్య కేంద్రీకృతమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మైతీల పక్షాన ఉందనే ఉద్దేశంతో కుకీలు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమస్య పరిష్కారం విషయంలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు తమకేమీ కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు సాగిస్తోంది. నిజానికి రాష్ట్ర సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అనేక పర్యాయాలు కుకీ నాయకులతోనూ, మైతీ నాయకులతోనూ చర్చలు జరపడంతో పాటు, రాష్ట్ర సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి మణిపూర్, మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది.
రాష్ట్రంలో మతపరమైన ఏకీకరణలు చోటు చేసుకోవాలని, అవి దినదినాభివృద్ధి చెందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మణిపూర్‌లో ఇప్పటికే మొదలై పోయిన పునరేకీకరణలను కేంద్రం పెంచి పోషిస్తోందని కూడా ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇక్కడకు వచ్చినా మత హింస చెలరేగుతోందని, కుకీలు, మైతీల మధ్య సయోధ్య కుదరకుండా కాంగ్రెస్ నాయకులే అడ్డుకుంటున్నారని బీరేన్ సింగ్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మణిపూర్ సమస్య చాలా వరకు పరిష్కారమై పోతుందని హోం మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. ఆయన మాటలను బట్టి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రశాంత పరిస్థితులు పునరుద్ధరించడం జరగలేదని అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య దీర్ఘకాలికమైనందువల్ల, సమస్యా పరిష్కారానికి కూడా దీర్ఘకాలమే పట్టే అవకాశాలున్నాయి. అయితే, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మాత్రం నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నారు.
Manipur crisis: శాశ్వత పరిష్కారం దిశగా మణిపూర్
కుకీలు, మైతీల మధ్య సయోధ్య